క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః ।
స్మృతిభ్రంశాద్ బుద్ధి నాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి ।। 63 ।।
క్రోధాత్ — క్రోధము నుండి; భవతి — ఉత్పన్నమగును; సమ్మోహః — విచక్షణ కోల్పోవుట; సమ్మోహాత్ — విచక్షణా రాహిత్యం నుండి; స్మృతి — జ్ఞాపక శక్తి; విభ్రమః — భ్రమ; స్మృతి-భ్రంశాత్ — స్మృతి భ్రమ వలన; బుద్ధి-నాశః — బుద్ధి నశించును; బుద్ధి-నాశాత్ — బుద్ధి నష్టం వలన; ప్రణశ్యతి — వ్యక్తి పతనమగును.
Translation
BG 2.63: కోపం అనేది విచక్షణా రాహిత్యానికి దారి తీస్తుంది, అది స్మృతి (జ్ఞాపకశక్తి) భ్రమని కలుగ చేస్తుంది. స్మృతిభ్రమ కలిగినప్పుడు బుద్ధి నశిస్తుంది. బుద్ధి నశించినప్పుడు మనుష్యుడు పతనమౌతాడు.
Commentary
ఉదయం పూట పొగమంచు సూర్య కాంతిని కప్పివేసి తగ్గించినట్టు, కోపము వివేకాన్ని క్షీణింపచేస్తుంది. కోపంలో జనులు తప్పిదాలు చేసి, దానికి తరువాత చింతిస్తారు, ఎందుకంటే కోపంలో ఉన్నప్పుడు బుద్ధి, భావోద్వేగాలచే కప్పి వేయబడుతుంది. జనులు అంటారు, ‘అతను నాకంటే ఇరవై ఏళ్ళు పెద్దవాడు, నేను ఎందుకు అతనితో ఇలా మాట్లాడాను? నాకు ఏమైంది?’ అని. నిజానికి ఏమైందంటే, క్రోధం వలన విచక్షణా జ్ఞానం లోపించింది అందుకే పెద్దవారిని దూషించే తప్పిదం జరిగింది.
బుద్ధి మబ్బుకమ్మినప్పుడు అది స్మృతి (జ్ఞాపక శక్తి) భ్రంశను కలుగ చేస్తుంది. ఆ వ్యక్తి ఏది మంచి, ఏది చెడు అనే విచక్షణ కోల్పోయి, భావోద్వేగాల ప్రవాహంలో కొట్టుకోపోతాడు. అక్కడి నుండి ఇక అధో-పతనం సాగుతుంది. స్మృతి భ్రంశ బుద్ధి వినాశనాన్ని కలుగచేస్తుంది. బుద్ధి అనేది అంతర్గత మార్గదర్శకం ఇచ్చేది కాబట్టి, అదే నశించినప్పుడు, వ్యక్తి సర్వ నాశనమైపోతాడు. ఈ విధంగా, దైవత్వం నుండి అధార్మికతకు పతనం అయ్యే ప్రక్రియ, ఇంద్రియ విషయముల చింతన నుండి బుద్ధి విధ్వంసం వరకు విశదీకరించబడింది.