ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ।
ప్రసన్నచేతసో హ్యాశు బుద్ధిః పర్యవతిష్ఠతే ।। 65 ।।
ప్రసాదే — భగవత్ కృపతో; సర్వ — అన్నీ; దుఃఖానాం — దుఃఖములూ; హానిః — వినాశనం; అస్య — అతని; ఉపజాయతే — వచ్చును; ప్రసన్న-చేతసః — ప్రశాంత మైన చిత్తంతో; హి — నిజముగా; ఆశు — త్వరగానే; బుద్ధిః — బుద్ధి; పర్యవతిష్ఠతే — స్థిరముగా నిలుచును.
Translation
BG 2.65: భగవత్ కృప ద్వారా అన్ని దుఃఖాలు తొలిగిపోయే పరమ శాంతి లభిస్తుంది, మరియు అలా ప్రసన్న చిత్తంతో ఉన్న వ్యక్తి యొక్క బుద్ధి శీఘ్రము గానే భగవంతునియందు స్థిరముగా నిలుస్తుంది.
Commentary
కృప (అనుగ్రహం) అనేది ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం లోనికి వరద లాగా వచ్చే ఒక దివ్యమైన శక్తి. తన కృప ద్వారా, సత్-చిత్-ఆనంద స్వరూపుడైన భగవంతుడు, తన దివ్య జ్ఞానాన్ని, దివ్య ప్రేమను మరియు దివ్య ఆనందాన్ని అనుగ్రహిస్తాడు. ఇది బుద్ధిని భగవంతుని యొక్క ప్రేమ, ఆనందం మరియు జ్ఞానంలో ఓలలాడిస్తుంది. భగవంతుని కృపచే మనం ఎప్పుడైతే ఆ దివ్య ఆనందం రుచి ఎరుగుతామో, ఇంద్రియ సుఖముల కోసం ఉన్న తపన శాంతిస్తుంది. ఎప్పుడైతే ప్రాపంచిక వస్తువుల కోసం యావ తొలగిపోతుందో, ఆ వ్యక్తి అన్నీ దుఃఖాలకు అతీతుడై, అతని మనస్సు శాంతినొందుతుంది. ఆ యొక్క అంతర్గత తృప్తి స్థితిలో, భగవంతుడు మాత్రమే ఆనందానికి మూలం అని, అతడే జీవాత్మ యొక్క అంతిమ లక్ష్యం అని, బుద్ధి స్థిర నిశ్చయానికి వస్తుంది. దీనికి పూర్వం, వేదాల్లో చెప్పబడిన జ్ఞానం ఆధారంగా మాత్రమే బుద్ధి దీనిని ఒప్పుకుంది, కానీ ఇప్పుడు, పరమ శాంతి యొక్క మరియు దివ్య ఆనందపు ప్రత్యక్ష అనుభవం లభిస్తుంది. దీనితో ఎటువంటి సందేహానికీ తావు లేకుండా బుద్ధి భగవంతుని యందే స్థిరముగా నిలుస్తుంది.