Bhagavad Gita: Chapter 3, Verse 13

యజ్ఞశిష్టాశినః సంతో ముచ్యంతే సర్వకిల్బిషైః ।
భుంజతే తే త్వఘం పాపా యే పచంత్యాత్మకారణాత్ ।। 13 ।।

యజ్ఞ-శిష్ట — యజ్ఞ శిష్టాన్నమును (భగవత్ నివేదన చేయగా మిగిలిన అన్నము); అశినః — భుజించేవారు; సంతః — సత్పురుషులు; ముచ్యంతే — విముక్తి చేయబడతారు; సర్వ-కిల్బిషైః — అన్ని రకాల పాపముల నుండి; భుంజతే — ఆస్వాదించుట; తే — వారు; తు — కానీ; అఘం — పాపములు; పాపాః — పాపాత్ములు; యే — ఎవరైతే ; పచంతి — వండుదురో (అన్నమును); ఆత్మ-కారణాత్ — తమ స్వీయ భోగం కోసమే.

Translation

BG 3.13: యజ్ఞములో ముందుగా నివేదించగా మిగిలిన ఆహారమునే భుజించే, ఆధ్యాత్మిక చింతనగల సత్పురుషులు సర్వ పాపముల నుండి విముక్తులవుతారు. తమ భోగమునకే అన్నం వండుకునే వారు పాపమునే భుజింతురు.

Commentary

వైదిక సాంప్రదాయంలో, అన్నము (ఆహారము) ను భగవంతుని నివేదన కోసమే అన్న దృక్పథం తోనే వండేవారు. ఆహార పదార్థాలన్నీ కొంచెం కొంచెం ఒక పళ్ళెంలో ఉంచి, భగవంతుడిని వాటిని స్వీకరించమని శాబ్దిక లేక మానసిక ప్రార్థన చేస్తారు. అలా నైవేద్యం చేసిన తరువాత, ఆ పళ్ళెంలో ఉన్న ఆహారం 'ప్రసాదం' గా పరిగణించబడుతుంది. ఆ పళ్ళెంలో, ఇంకా పాత్రలలో ఉన్న ఆహారం, భగవత్ అనుగ్రహముగా పరిగణించబడి, ఆ దృక్పథంలోనే భుజించబడుతుంది. ఇతర మత సాంప్రదాయములు కూడా ఇటువంటి ఆచారాల్ని పాటిస్తాయి. క్రైస్తవ ఆచారంలో ‘యూకారిస్ట్ ధార్మికానుష్ఠానం’ (sacrament of the Eucharist) ఉంది, దీనిలో బ్రెడ్డు మరియు వైన్ లను మొదట నివేదించి పవిత్రం చేసిన తరువాతే, అవి స్వీకరించబడుతాయి. ముందుగా భగవంతునికి నైవేద్యం చేయబడిన ప్రసాదం తినటం మనలను పాపములనుండి విముక్తి చేస్తుంది, ఈ ప్రకారంగా, నివేదన చేయకుండా అన్నం తినేవారు పాపం చేస్తున్నట్టే అని శ్రీ కృష్ణుడు పేర్కొంటున్నాడు.

ఇక్కడ ఒక సందేహం రావచ్చు, మనం మాంసాహారాన్ని భగవంతునుకి సమర్పించి ఆ శేషాన్ని ప్రసాదం లాగా స్వీకరించవచ్చా? దీనికి సమాధానం ఏమిటంటే వేదములు, మానవులకు శాకాహార భోజనమునే నిర్దేశించాయి, అంటే ధాన్యం, దినుసులు, కూరగాయలు, పండ్లు, పాల ఉత్పత్తులు వంటివి. వైదిక సంస్కృతియే కాక, ప్రపంచ చరిత్రలో, అన్నీ సంస్కృతుల్లోఆధ్యాత్మిక ఉన్నతి నొందిన ఎందరో జీవులు, ఉదరాన్ని జంతువుల స్మశానంగా చేసే, మాంసాహారాన్ని తిరస్కరించారు. వారిలో చాలా మంది మాంసాహార కుటుంబాలల్లో జన్మించినా, ఆధ్యాత్మిక పథ పురోగతిలో వారు శాకాహారం వైపే మొగ్గు చూపారు. శాకాహారాన్ని సమర్థిస్తూ కొంతమంది ప్రఖ్యాత తత్త్వవేత్తల మరియు వ్యక్తుల మాటలను ఈ క్రింద చూడండి.

జీవ ప్రాణులకు ప్రాణభయం కలిగించకుండా ఉండటానికి, శిష్యుడిని మాంసాహారం భుజించకుండా ఉండనీ... సాధువులు భుజించే ఆహారమే వివేకవంతులైన వారికి భోజనంగా ఉండాలి; దానిలో మాంసం ఉండదు

— బుద్ధుడు

 

నీవు సహజంగానే అలాంటి ఆహారం తినటానికి అనుగుణంగా తయారుచేయబడ్డావు అని అనుకుంటే, నీవు దేనిని తినాలనుకుంటున్నావో దానిని స్వయంగా చంపు. కాకపోతే, నీకున్న సహజసిద్ధ ఉపకరణములతో మాత్రమే. కత్తి, దుడ్డుకర్ర, ఎలాంటి గొడ్డలి వంటి వాటి సహాయం లేకుండానే ఆ పని చేయుము.

— రోమ్ నగరపు ప్లూటార్క్, ‘ఆన్ ఈటింగ్ ఫ్లెష్’, అనే వ్యాసంలో

 

‘మనుష్యులు జంతువులని వధించినంత కాలం, వారు ఒకరినొకరు చంపుకుంటూనే ఉంటారు. హత్య, బాధ వంటి బీజములు నాటేవారికి ప్రేమ, ఆనందము వంటి ఫలాలు అందవు’

— పైథాగోరస్

 

‘అహింస అనేది అత్యున్నతమైన ఆదర్శాలకు దారితీస్తుంది, అదే పరిణామ క్రమ ప్రధానోద్దేశం. అన్ని జీవప్రాణులను హింసించటం ఆపేంతవరకూ, మనమందరమూ అనాగరికులమే.’

— థామస్ ఎడిసన్

 

వ్యక్తి నిజంగా మరియు తీవ్రంగా మంచి జీవితాన్ని గడపాలని కోరుకుంటే, ప్రప్రథమంగా ఆయన దూరంగా ఉండవల్సిన విషయం, మాంసాహారం. ఎందుకంటే … దాని వినియోగం ఒక నీతిబాహ్యమైన చర్య, ఎందుకంటే నైతిక విలువలకు విరుద్ధంగా చేయవల్సిన ఓ పనితో కూడుకుని ఉంటుంది – అదే చంపటం.

— లియో టాల్ స్టాయ్

 

నేను నా వయసుకు తగ్గట్టుగా ఉంటాను. ఇతరులే వారి వయస్సుకంటే ఎక్కువ ముసలిగా కనిపిస్తారు. ఇక శవాలను తినే వారికి ఇంతకంటే ఏమి ఆశించగలం?

— జార్జ్ బెర్నార్డ్ షా

 

నిజంగానే మానవుడు మృగరాజు, ఎందుకంటే క్రూరత్వంలో జంతువులను మించిపోయాడు. ఇతరుల చావుపై మనం బ్రతుకుతున్నాము. మనం శ్మశానాలమే! అందుకే నేను చిన్నతనం నుండే మాంసాన్ని త్యజించాను....

— లియోనార్డో డా విన్సి

కసాయి వాడి మాంసం మన జీవితానికి అసలేమైనా అవసరమా అని మనం సందేహించాలి... సభ్యత అంటే మనిషి కసాయివాడు ఇచ్చే మాంసాన్ని తినాలనే నియమం ఎక్కడా లేదు.

— ఆడమ్ స్మిత్

పొలంలో చచ్చి పడిఉన్న గొర్రె లేదా పశువు, తినరాని మాంసంగా పరిగణించబడుతుంది. అదే విధమైన కళేబరం మాంస విక్రయ కొట్టులో వ్రేలాడదీయబడి, ఆహారంగా అందించబడుతుంది!

— జే. హెచ్. కెల్లాగ్

శాఖాహార జీవన శైలి, కేవలం మానవుల ప్రవ్రుత్తి పై చూపే ప్రభావం చేతనే, మానవ సమాజంలో ఎంతోమందికి శ్రేయస్కరంగా ఉంటుంది, అని నా అభిప్రాయం.

— ఆల్బర్ట్ ఐంస్టీన్

ఆధ్యాత్మిక పురోగతిలో ఎక్కడో ఒక స్థాయిలో, మన శారీరక అవసరాల కోసం మనం తోటి జీవజంతువులను చంపటం ఆపేయాలి, అనే ఆవశ్యకత వస్తుంది, అని నా నిశ్చిత అభిప్రాయం.

— మహాత్మా గాంధి

ఈ శ్లోకంలో, శ్రీ కృష్ణుడు ఇంకా చెప్పాలంటే చెట్లు, చేమలలో కూడా ప్రాణం ఉంటుంది అంటున్నాడు, మరియు మన ఇంద్రియ భోగం కోసమే వాటిని తింటే ప్రాణహాని వల్ల కలిగే కర్మ బంధాలలో చిక్కుకుంటాము. ఈ శ్లోకంలో ఉపయోగించబడిన పదం 'ఆత్మ-కారణాత్', అంటే ‘తన స్వంత భోగం కోసమే’. కానీ యజ్ఞంలో భగవత్ నివేదన చేయగా మిగిలిన ఆహారాన్ని భుజించినప్పుడు, ఆ దృక్పథం మారుతుంది. మన శరీరాన్ని భగవంతుని సొత్తుగా, దాన్ని భగవంతుని సేవకోసం ఉపయోగించటానికి మన సంరక్షణలో ఉంచబడినట్టు పరిగణిస్తాము. అనుమతించబడిన ఆహారాన్ని, ఆయన అనుగ్రహంగా శరీర పోషణ కోసము స్వీకరిస్తాము. ఈ మనోభావంతో ఆ ప్రక్రియ అంతా పవిత్ర మవుతుంది. భరత ముని ఇలా పేర్కొంటున్నాడు:

వసుసతో క్రతు దక్షౌ కాల కామౌ ధృతిః కురుః
పురురవా మద్రవాశ్చ విశ్వదేవాః ప్రకీర్తితాః

‘మనకు తెలియకుండానే ఆహారం వండే ప్రక్రియలో, రోకలి, అగ్ని, రుబ్బే యంత్రములు, నీటి కుండలు మరియు చీపురు వంటి వాటి వాడకంతో ఎన్నో ప్రాణులు హింసించబడుతాయి. తమ కోసమే ఆహారం వండుకునే వారు ఈ పాపంలో చిక్కుకుంటారు. కానీ యజ్ఞం అనేది పాప ఫలితాన్ని నిర్మూలిస్తుంది (శూన్యీకరిస్తుంది).’