కర్మణైవ హి సంసిద్ధిమాస్థితా జనకాదయః ।
లోకసంగ్రహమేవాపి సంపశ్యన్కర్తుమర్హసి ।। 20 ।।
యద్యదాచరతి శ్రేష్ఠస్తత్త దేవేతరో జనః ।
స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే ।। 21 ।।
కర్మణా — విహిత కర్మలు చేయటం వలన; ఏవ — మాత్రమే; హి — తప్పకుండా; సంసిద్ధిం — పరిపూర్ణ సిద్ధి; ఆస్థితాః — పొందెను; జనక-ఆదయః — జనక మహారాజు, ఇంకా ఇతర రాజులు; లోక-సంగ్రహం — లోక హితము కోసము; ఏవ అపి — మాత్రమే; సంపశ్యన్ — దృష్టిలో ఉంచుకొని; కర్తుం — చేయటానికే; అర్హసి — నీవు తగిఉన్నావు; యత్ యత్ — ఏదైతే; ఆచరతి — చేస్తారో; శ్రేష్ఠ — శ్రేష్ఠులు; (మహాత్ములు); తత్ తత్ — అది మాత్రమే; ఏవ — తప్పకుండా; ఇతరః — ఇతరులు (సామాన్యులు); జనః — జనులు; సః — వారు; యత్ — దేనినైతే; ప్రమాణం — ప్రమాణముగా; కురుతే — చేయుదురో; లోకః — ప్రపంచము; తత్ — దానిని; అనువర్తతే — అనుసరించును.
Translation
BG 3.20-21: తమ ధర్మములను (విహిత కర్మలను) నిర్వర్తించటం ద్వారానే, జనక మహారాజు వంటి వారు సిద్ధిని పొందితిరి. ప్రపంచానికి ఒక చక్కటి ఆదర్శం చూపటానికి, నీవు కూడా నీ కర్తవ్య నిర్వహణ చేయాలి. గొప్పవారు చేసే పనులను సామాన్య జనులు అనుకరిస్తారు. వారు నెలకొల్పిన ప్రమాణాన్నే, ప్రపంచమంతా అనుసరిస్తారు.
Commentary
జనక మాహారాజు, తన రాజ ధర్మాలను నిర్వర్తిస్తూనే, కర్మయోగం ద్వారా సిద్దిని పొందాడు. మహోన్నతమైన జ్ఞానోదయ స్థితికి చేరుకున్న తరువాత కూడా, కేవలం ప్రపంచానికి ఒక మంచి ఉదాహరణ చూపటం కోసం ఆయన తన ప్రాపంచిక విధులను నిర్వర్తించాడు. ఇంకా చాలా మంది ఇతర మహాత్ములు కూడా ఇదే విధంగా చేసారు.
మహాత్ముల జీవితాలలో ఉన్న ఆదర్శాలను/నడవడిక చూసి మానవాళి ప్రభావితమౌతుంది. అటువంటి నాయకులు తమ నడవడిక ద్వారా సమాజాన్ని ఉత్తేజపరిచి జనులు అనుసరించడానికి మార్గదర్శకమౌతారు. ఈ విధంగా, సమాజంలో ఉండే నాయకులకు, తమ నడవడిక (మాటలు, చేతలు, ప్రవర్తన) ద్వారా, జనసామాన్యులకు ఉన్నతమైన ఆదర్శాలను నెలకొల్పే ఒక నైతిక బాధ్యత ఉంది. ఎప్పుడైతే సత్ప్రవర్తన కలిగిన నాయకులు ముందుంటారో, సహజంగానే మిగతా సమాజం కూడా నీతిప్రవర్తన, నిస్వార్థం మరియు ఆధ్యాత్మిక బలంలో పుంజుకుంటారు. కానీ, ఎప్పుడైతే నియమబద్ధమైన నాయకత్వం లోపిస్తుందో, మిగతా సమాజం కూడా, వారికి అనుసరించే ప్రమాణం లేక, స్వార్థ పూరితంగా, అనైతికతతో, మరియు ఆధ్యాత్మిక అనాసక్తతతో దిగజారి పోతుంది. కాబట్టి మహాత్ములు ఎప్పుడూ కూడా ప్రపంచానికి ఒక ప్రమాణం నిల్పటానికి అత్యంత ఆదర్శప్రాయంగా వ్యవహరించాలి. వారు తమ వరకు ఆధ్యాత్మిక జ్ఞానోదయ స్థాయి చేరుకుని, వేద విహిత కర్మలు చేయనవసరం లేకున్నా, అవి చేయటం వలన, వారు ఇతరులకు వేద విహిత కర్మలు చేయటంలో ఒక ఆదర్శం/ఉదాహరణ చూపినట్టు ఉంటుంది.
సమాజంలో ఒక గొప్ప నాయకుడు కర్మ సన్యాసి అయి, పనులను విడిచిపెడితే, అది ఇతరులకు ఒక అయోమయ దృష్టాంతం చూపినట్టు అవుతుంది. ఆ నాయకుడు, పరిపూర్ణ ఆధ్యాత్మిక దృక్పథంలో ఉండి, విహిత కర్మలను త్యజించి, పూర్తిగా ఆధ్యాత్మిక పథంలో నడవటానికి అర్హుడై ఉండవచ్చు. కానీ, సమాజంలో మిగతావారు, వారి దృష్టాంతం చూపి, దానిని, పని తప్పించుకోవటానికి (పలాయనవాదం) ఉపయోగించవచ్చు. ఇలాంటి పనితప్పించుకునేవారు, మహోన్నత కర్మ సన్యాసులైన, శంకరాచార్యులు, మధ్వాచార్యులు, నింబార్కాచార్యులు మరియు చైతన్య మహాప్రభు వంటి వారి చర్యలను ఉదహరిస్తుంటారు. వారి ఉత్కృష్టమైన అడుగు జాడల్లో నడవబోయి, ఈ వేషగాళ్ళు కూడా, కావలసిన చిత్త శుద్ధి సాధించకుండానే, ప్రాపంచిక విధులను త్యజించి ‘సన్యాసం’ తీసుకుంటారు. భారత దేశంలో ఇలాంటి సాధువులు వేలమంది ఉంటారు. వారు కాషాయ వస్త్రములను ధరించి ఉంటారు - కానీ దానికి అనుగుణమైన అంతర్గత జ్ఞానోదయం, ఆధ్యాత్మికానందం లేకుండానే, మహాత్ములైన సన్యాసులని అనుకరిస్తుంటారు. బాహ్యంగా సన్యసించినా, వారి స్వస్వభావమే వారిని ఆనందాన్వేషణకి పురిగొల్పుతుంది. భగవంతుని దివ్యానంద ప్రాప్తి లేని కారణంగా నీచస్థాయి భోగాలైన మత్తు/నిషా పదార్థాలతో మునిగిపోతారు. ఈ విధంగా వారు, ఈ క్రింద ఉదహరించిన శ్లోకంలో చెప్పినట్టుగా, గృహస్తులుగా ఉన్న వారి కంటే తక్కువ స్థాయికి దిగజారి పోతారు.
బ్రహ్మ జ్ఞాన జాన్యో నహీఁ, కర్మ దియే చ్చితకాయ,
తులసీ ఐసీ ఆత్మా సహజ నరక మహ్ జాయ
సంత్ తులసీదాసు ఇలా అన్నాడు: ‘దివ్య జ్ఞానంచే ప్రకాశితమైన అంతర్గత మహోన్నత వ్యక్తిత్వం లేకుండా, ప్రాపంచిక విధులను త్యజించిన వాడు నరకానికి దగ్గరి మార్గంలో ప్రయాణించినట్టు.’
అలా కాకుండా, ఒక గొప్ప నాయకుడు కర్మ యోగిగా ఉంటే, ఆయనను అనుసరించేవారు కనీసం తమ కర్మలను చేస్తూ, బాధ్యతలను విధిగా నిర్వర్తిస్తారు. ఇది వారికి తమ మనస్సుని, ఇంద్రియములను నియంత్రణలో ఉంచుకొనటానికి మరియు నెమ్మదిగా ఆధ్యాత్మిక స్థాయిలో ఉన్నత దశ చేరుకోవటానికి దోహదపడుతుంది. కాబట్టి, సమాజానికి ఒక ఆదర్శం చూపటానికి శ్రీ కృష్ణుడు అర్జునుడిని కర్మ యోగం అభ్యాసం చేయమంటున్నాడు. ఇక తన సొంత ఉదాహరణని దీనిని విశదీకరించటానికి చెప్తున్నాడు.