ప్రకృతేః క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః ।
అహంకారవిమూఢాత్మా కర్తాఽహమితి మన్యతే ।। 27 ।।
ప్రకృతేః — భౌతిక ప్రకృతి యొక్క; క్రియమాణాని — చేయబడును; గుణైః — మూడు గుణములచే; కర్మాణి — పనులు; సర్వశః — అన్ని రకాల; అహంకార-విమూఢ-అత్మా — అహంకారంతో భ్రమకు లోనై, తాము ఈ శరీరమే అనుకునే జీవులు; కర్తా — చేసేవాడిని; అహం — నేను; ఇతి — ఈ విధంగా; మన్యతే — భావించును.
Translation
BG 3.27: అన్ని కార్యములు కూడా ప్రకృతి త్రిగుణముల చేతనే చేయబడును. కానీ, అజ్ఞానంలో, జీవాత్మ, తాను ఈ శరీరమే అన్న భ్రమతో, తానే కర్తను (చేసేవాడిని) అని అనుకుంటుంది.
Commentary
ప్రపంచంలో సహజసిద్ధంగా జరిగే పరిణామాలు మనం నిర్దేశించినవి కావని, అవి ప్రకృతిచే చేయబడినవి అని మనం గమనించవచ్చు. మన శరీరక్రియలను, మనం రెండు రకాలుగా విభజించవచ్చు 1) సహజంగానే జరిగే జీవ క్రియలు, అంటే, జీర్ణక్రియ, రక్త ప్రసరణ, హృదయస్పందన వంటివి, మనం కావాలని చేయము కానీ అవి సహజంగానే జరిగిపోతాయి. 2) మనమే ప్రయత్నపూర్వకంగా చేసే క్రియలు - మాట్లాడటం, వినటం, నడవటం, నిద్రించటం, పని చేయటం వంటివి.
ఈ రెండు రకాల పనులూ కూడా మనస్సు-శరీరం-ఇంద్రియముల వ్యవస్థ ద్వారా చేయబడుతాయి. ఈ వ్యవస్థ యొక్క అన్ని భాగాలు కూడా, సత్త్వ-రజో-తమస్సులచే కూడి ఉన్న త్రి-గుణాత్మకమైన ప్రకృతి లేదా భౌతిక శక్తితోనే తయారు చేయబడ్డాయి. ఎలాగైతే అలలు సముద్రం కన్నా వేరు కాదో, అవి సముద్రంలో భాగమో, అదే విధంగా ప్రకృతి నుండి తయారయిన ఈ శరీరం, ప్రకృతిలో భాగమే. కావున, ప్రకృతి శక్తియే అన్ని పనులకు కర్త.
మరి ఎందుకు జీవాత్మ తనే అన్ని పనులు చేసేది అనుకుంటుంది? ఎందుకంటే, ప్రబలమైన అహంకార పట్టులో, ఆత్మ తనను తాను ఈ శరీరమే అనుకుంటుంది. అందుకే, కర్తృత్వ భావన మాయలో ఉండిపోతుంది. ఉదాహరణకి రైల్వే ప్లాట్ఫారం పైన రెండు రైళ్ళు పక్కపక్కనే ఉన్నాయనుకుందాం, ఒక రైల్లోని ప్రయాణికుడు తదేకంగా పక్క రైలుని చూస్తున్నాడనుకుందాం. ఆ రెండో రైలు కదిలితే, మొదటి రైలు కదిలినట్టుఉంటుంది. అదే విధంగా కదలని జీవాత్మ కదిలే ప్రకృతియే తను అనుకుంటుంది. అందుకే, చేసే క్రియలకు తానే కర్త అనుకుంటుంది. ఆత్మ ఈ అహంకారాన్ని వదిలి, భగవత్ సంకల్పానికి శరణాగతి చేసిన మరుక్షణం, తాను కర్తను కాను అని తెలుసుకుంటుంది.
కానీ, జీవాత్మ నిజంగా కర్త కానప్పుడు, శరీరం చేసే చర్యలకు, అది కర్మ సిద్ధాంత చట్రం లో ఎందుకు చిక్కుకుంటుంది? అని ఎవరైనా అడగవచ్చు. దీనికి కారణ మేమిటంటే, జీవాత్మ తనే స్వయంగా కర్మలను చేయకపోయినా, అది ఇంద్రియమనోబుద్ధులు చేసే క్రియలను మార్గదర్శకం చేస్తుంది. ఉదాహరణకి, ఒక రథ సారథి, రథాన్ని తనే గుంజడు, కానీ గుర్రాలకు దిశానిర్దేశం చేస్తాడు. ఇప్పుడు, ఒకవేళ ప్రమాదం జరిగితే, గుర్రాలను తప్పు బట్టలేము, సారథియే బాధ్యుడు. అదే విధంగా, మనస్సు-శరీరం వ్యవస్థ చేసే పనులకు జీవాత్మయే బాధ్యత వహించవలసి ఉంటుంది ఎందుకంటే ఇంద్రియములు-మనస్సు-బుద్ధి, ఆత్మ ద్వారా వచ్చే ప్రేరణతో పని చేస్తాయి.