Bhagavad Gita: Chapter 3, Verse 4

న కర్మణామనారంభాన్నైష్కర్మ్యం పురుషోఽశ్నుతే ।
న చ సన్న్యసనాదేవ సిద్ధిం సమధిగచ్ఛతి ।। 4 ।।

న — కాదు; కర్మణామ్ — కర్మలను; అనారంభాత్ — చేయకుండా; నైష్కర్మ్యం — కర్మ ఫలముల నుండి విముక్తి; పురుషః — వ్యక్తి; అశ్నుతే — పొందుట; న — కాదు; చ — మరియు; సన్న్యసనాత్ — సన్యాసము వల్ల; ఏవ — మాత్రమే; సిద్ధిం — సిద్ధిని (పరిపూర్ణత); సమధిగచ్ఛతి — పొందుట.

Translation

BG 3.4: మనుష్యుడు కర్మలను ఆచరింపకుండా ఉండి కర్మ బంధము (ప్రతిక్రియ) ల నుండి విముక్తి పొందజాలడు. అలాగే, కేవలం బాహ్య (భౌతిక) సన్యాసము ద్వారా జ్ఞాన సిద్ధిని పొందజాలడు.

Commentary

ఈ శ్లోకం యొక్క మొదటి పాదం కర్మయోగికి (కర్మ మార్గాన్ని ఆచరించేవారికి) ఉద్దేశించబడినది, రెండవ పాదం సాంఖ్యయోగికి (జ్ఞాన మార్గాన్ని ఆచరించేవారికి) ఉద్దేశించబడినది.

మొదటి పాదంలో, శ్రీ కృష్ణుడు, ఉత్తగా కర్మలను ఆచరించకుండా ఉన్నంత మాత్రాన కర్మ ఫలితాల నుండి ముక్తి లభించదు, అంటున్నాడు. మనస్సు ప్రాపంచిక లాభాపేక్ష ఆలోచనలు చేస్తూనే ఉంటుంది, మరియు మానసిక పని కూడా కర్మగా పరిగణించబడుతుంది కనుక, భౌతిక కర్మ మాదిరిగానే, అది కూడా కర్మ బంధాలలో కట్టివేస్తుంది. నిజమైన కర్మ యోగి, కర్మ ఫలాలపై మమకార, ఆసక్తులు లేకుండా పనిచేయటం నేర్చుకోవాలి. దీనికి, బుద్ధి యందు జ్ఞానాన్ని వృద్ధిపొందించుకోవటం అవసరం. కాబట్టి, కర్మ యోగములో కూడా తత్త్వజ్ఞానం అవసరం.

రెండవ పాదంలో, శ్రీ కృష్ణుడు - ఉత్తగా ప్రపంచాన్ని త్యజించి సన్యాసి అయిపోయినంత మాత్రాన సాంఖ్య యోగి జ్ఞానోదయ స్థితిని పొందలేడు - అని అంటున్నాడు. భౌతిక ఇంద్రియార్థ విషయ-వస్తువులను త్యజించినా, మనసులో మలినాలు ఉన్నంత కాలం నిజమైన జ్ఞానం కలుగదు. పూర్వపు చింతలను పదేపదే ఆలోచించటం మనస్సుకు ఉన్న లక్షణం. అలాంటి పునరాలోచన మనస్సులో ఒక బాటగా తయారై, కొత్త ఆలోచనలు కూడా అనివార్యముగా అదే పథంలో ప్రవహిస్తాయి. పాత అలవాటు ప్రకారంగా, ప్రాపంచికముగా మలినమైన మనస్సు - ఒత్తిడి, ఆందోళన, భయము, ద్వేషము, ఈర్ష్య, మమకారం వంటి - అనేకానేక ప్రాపంచిక భావావేశాలకు లోనగుతూనే ఉంటుంది. ఈ విధంగా, కేవలం బాహ్యమైన భౌతిక సన్యాసంతో సంపూర్ణ జ్ఞానోదయం అనేది మలిన మనస్సులో ప్రకాశించదు. దానితో పాటుగా దానికి అనుగుణమైన, అంతఃకరణ (మనోబుద్ధులు) శుద్ది చేసే చర్యలు ఉండాలి. కాబట్టి, సాంఖ్య యోగములో కూడా కర్మలు అవసరమే.

తత్త్వజ్ఞానం లేకుండా ఉన్న భక్తి, ఉత్త మానసిక అభిమానమే అని మరియు భక్తి లేకుండా ఉన్న తత్త్వజ్ఞానం, మేధస్సుతో చేసే ఊహాగానాలే అని చెప్పబడింది. కర్మ యోగము మరియు సాంఖ్య యోగము రెంటిలో కూడా కర్మలు, జ్ఞానం రెండూ అవసరమే. వాటి నిష్పత్తిలో మాత్రమే తేడా ఉంది, అదే ఈ రెండు మార్గాల్లో ఉన్న భేదం.

Watch Swamiji Explain This Verse