తస్మాత్ త్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ ।
పాప్మానం ప్రజహి హ్యేనం జ్ఞానవిజ్ఞాననాశనమ్ ।। 41 ।।
తస్మాత్ — కాబట్టి; త్వం — నీవు; ఇంద్రియాణి — ఇంద్రియములను; ఆదౌ — మొదట్లోనే; నియమ్య — నియంత్రించి; భరత-ఋషభ — అర్జునా, భరతులలో శ్రేష్ఠుడా; పాప్మానం — పాపిష్టిదైన; ప్రజహి — సంహరింపుము; హి — నిజముగా; ఏనం — ఇది; జ్ఞాన — జ్ఞానము; విజ్ఞాన — అనుభవ జ్ఞానమును; నాశనం — నశింపచేసేటటువంటిది.
Translation
BG 3.41: కాబట్టి ఓ భరత శ్రేష్ఠుడా, మొదట్లోనే ఇంద్రియములను నియంత్రణ లోనికి తెచ్చి, జ్ఞాన విజ్ఞానములను నశింపచేసే ఈ పరమ పాపిష్టి కామము (కోరికలు) అనే శత్రువును నిర్మూలించుము.
Commentary
అన్ని అరిష్టములకు మూలకారణ మైన కామాన్ని ఎలా అధిగమించాలో ఇక శ్రీ కృష్ణుడు ఇప్పుడు వివరిస్తున్నాడు. కామము మానవ అత్మోద్దరణకు ఎంతో హానికరమైనది. కామము యొక్క నిక్షేప స్థానాన్ని గుర్తింపచేసిన శ్రీ కృష్ణుడు మొదట ఈ ఇంద్రియముల కోరికలను నిగ్రహించమంటున్నాడు. వాటిని పెంచుకోవటం మన దుఃఖాలకు మూలకారణం, వాటిని నిర్మూలించుకోవటం శాంతికి మార్గం. ఈ క్రింది ఉదాహరణని గమనించండి.
రమేష్, దినేష్ అనే ఇద్దరు సహ-విద్యార్థులు హాస్టల్లో ఒకే గదిలో ఉండేవారు. ఒక రోజు రాత్రి 10 గంటలకు రమేష్‌కి సిగరెట్టు తాగాలనే కోరిక కలిగింది. అతను అన్నాడు, ‘నాకు బాగా సిగరెట్టు తాగాలనిపిస్తోంది.’ అని.
దినేష్ అన్నాడు, ‘చాలా రాత్రయింది. సిగరెట్టు గురించి మర్చిపోయి పడుకో’ అని.
రమేష్ అన్నాడు ‘కాదు... కాదు... నేను పొగాకు పీల్చనిదే నిద్ర పోలేను’ అని.
దినేష్ నిద్ర పోయాడు, కానీ రమేష్ సిగరెట్టు కోసం బయటికి వెళ్ళాడు. అప్పటికే దగ్గరి కొట్లు మూసేశారు. చివరికి అతనికి సిగరెట్టు దొరికి, ధూమపానం చేసి హాస్టల్ కి తిరిగి రావటానికి రెండు గంటలు పట్టింది.
ఉదయాన్నే దినేష్ అతన్ని అడిగాడు, ‘రమేష్, ఎన్నింటికి పడుకున్నావు రాత్రి?’
‘మధ్యరాత్రి.’
‘నిజంగా! అంటే నువ్వు సిగరెట్టు కోసం రెండు గంటలు వ్యాకుల పడి, నీ ధూమపానం అయిన తరువాత మళ్లీ నువ్వు 10గంటలకు ఏ స్థితిలో ఉన్నావో అదే స్థితికి చేరుకున్నావు.’ అని.
‘అంటే, నువ్వనేదేమిటి’ అన్నాడు రమేష్.
‘చూడు, 10 గంటలప్పుడు నీకు సిగరెట్టు మీద ఎలాంటి కోరిక లేదు, అప్పుడు ప్రశాంతంగా ఉన్నావు. తర్వాత నీకు నీవే వాటి మీద కోరిక పుట్టించుకున్నావు. 10 గంటల నుండి మధ్యరాత్రి వరకు సిగరెట్టు కోసం పరితపించావు. చివరికి ధూమపానం చేసిన తరువాత, నీకునీవే పుట్టించుకున్న వాంఛ తీరింది, ఇక నిద్ర పోయావు. అదే నేను ఎలాంటి కోరికలు పుట్టించుకోలేదు, ఇక 10 గంటలకే ప్రశాంతంగా పడుకున్నాను.’
ఈ విధంగా, శారీరక ఇంద్రియ వస్తు/విషయముల కొరకై కోరికలను మనమే సృష్టించుకుంటాం, తరువాత వాటిచే ఉద్విగ్నతకు లోనవుతాము. మనకు కావలసిన వస్తువు చేజిక్కిన తరువాత మనంతమనమే సృష్టించుకున్న రోగం నిర్మూలించబడుతుంది, దాన్నే మనము ఆనందం అనుకుంటాము. కానీ, మనలని మనము జీవాత్మగా పరిగణించుకుంటే, మరియు ఆత్మ ఆనందమే మన లక్ష్యం అయితే, ఈ ప్రాపంచిక కోరికలను త్యజించటం సులువౌతుంది. తన ఇంద్రియములను నియంత్రణలోకి తెచ్చుకోమని అర్జునుడికి శ్రీ కృష్ణుడు ఉపదేశిస్తున్నాడు. ఆ విధంగా వాటిలో వసించే కామాన్ని నిర్మూలించవచ్చు. దీనిని సాధించటానికి, తదుపరి శ్లోకంలో చెప్పినట్టుగ్గా, భగవంతుడు మనకు ప్రసాదించిన ఉన్నతమైన పరికరములను వాడుకోవాలి.