కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ ।
ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారః స ఉచ్యతే ।। 6 ।।
కర్మ-ఇంద్రియాణి — కర్మేంద్రియములు; సంయమ్య — నిగ్రహించి; యః — ఎవరైతే; ఆస్తే — ఉంటారో; మనసా — మనస్సులో; స్మరన్ — ఆలోచిస్తూ; ఇంద్రియ-అర్థాన్ — ఇంద్రియ వస్తు/విషయములు; విమూఢ-ఆత్మా — అవివేకులు; మిథ్యా-ఆచారః — కపటులు; సః — వారు; ఉచ్యతే — అని చెప్పబడతారు.
Translation
BG 3.6: బాహ్యమైన కర్మేంద్రియములను అదుపులో ఉంచినా, మనస్సులో మాత్రం ఇంద్రియ విషయముల పైనే చింతన చేస్తూ ఉండే వారు తమని తామే మోసం చేసుకునే వారు, అలాంటి వారు కపటులు అనబడుతారు.
Commentary
సన్యాస జీవన శైలికి ఆకర్షింపబడి, తరచుగా జనులు, తమ వృత్తిని విడిచిపెడతారు, కానీ, తరువాత వారు తెలుసుకునేదేమిటంటే, సన్యాసంతో పాటుగా, దానికి కావలిసిన, ఇంద్రియ విషయముల మీద మానసిక/మేధో వైరాగ్యం వారికి లేవు అని. ఇది, బాహ్యంగా ఆధ్యాత్మిక శైలిని ప్రదర్శించినా అంతర్గతంగా తుచ్ఛమైన మనోభావాలతో జీవించే ఒక మిథ్యాచార/కపట స్థితికి దారితీస్తుంది. కాబట్టి, ఒక కపట సన్యాసిగా జీవించటం కన్నా, బాహ్య ప్రపంచపు పోరాటాలని ఎదుర్కుంటూ కర్మయోగిగా జీవించటమే మేలు. జీవితంలోని సమస్యల నుండి పారిపోయి తొందరపడి అపరిపక్వముగా సన్యాసం తీసుకోవటం, పరిణామక్రమం లో జీవాత్మ యొక్క ఉద్ధరణ/పురోగతికి మంచిది కాదు. సంత్ కబీర్ వ్యంగ్యంగా ఇలా అన్నాడు.
మన న రంగాయే హో,
రంగాయే యోగీ కపడా
జటవా బఢాఏ యోగీ ధునియా రమౌలే,
దహియా బఢాయే యోగీ బని గయేలే బకరా
‘ఓ సన్యాస యోగీ, నీవు కాషాయ వస్త్రాలు ధరించావు కానీ, నీ మనస్సుకి వైరాగ్యం అనే రంగుని అద్దటం విస్మరించావు. నీవు పొడుగాటి జటలని పెంచావు మరియు శరీరమంతా బూడిద వ్రాసుకున్నావు (వైరాగ్యానికి చిహ్నంగా). కానీ హృదయంలో భక్తి లేకపోతే బాహ్యంగా ఉన్న గడ్డం, నీవు మేక లాగా కనిపించటానికి మాత్రమే ఉపయోగపడుతుంది.’ బాహ్యంగా ఇంద్రియ విషయములను త్యజించినా, మనస్సులో మాత్రం వాటి గురించే ఆలోచిస్తూ ఉండే వారు కపటులు అని, తమని తామే మోసం చేసుకునే వారు, అని శ్రీ కృష్ణుడు ఈ శ్లోకంలో అంటున్నాడు.
పురాణాలలో ఈ విషయాన్ని తేటపరచటానికి తవ్రీతుడు, సువ్రీతుడు అనే ఇద్దరు సోదరుల కథ ఉంది.
గుడిలో శ్రీమద్భాగవతం ప్రవచనం వినటానికి ఈ సోదరులు ఇద్దరూ ఇంటి నుండి నడుచుకుంటూ బయలు దేరారు. దారిలో పెద్ద వర్షం మొదలవటంతో వారు అక్కడికి దగ్గరలో ఉన్న ఒక భవనం లోకి పరిగెత్తి వెళ్లారు. వారి ఖర్మకి అదొక వేశ్యా గృహం. అక్కడ అగౌరవమైన మహిళలు కొందరు అతిధుల వినోదం కోసం నృత్యం చేస్తున్నారు. పెద్దవాడైన తవ్రీతుడు దిగాలుపడి బయటకు వచ్చి వర్షంలోనే గుడికి నడుచుకుంటూ వెళ్లి పోయాడు. చిన్నవాడైన సువ్రీతుడు, వర్షంలో తడవకుండా ఉండటం కోసం కాసేపు అక్కడే ఉండటంలో తప్పు లేదనుకున్నాడు.
తవ్రీతుడు గుడికి చేరుకొని ప్రవచన శ్రవణం కోసం కూర్చున్నాడు, కానీ మనసులో మాత్రం విచారంగా ఉన్నాడు, ‘అయ్యో, ఇది ఎంత బోరింగ్ గా ఉంది! పెద్ద తప్పు చేసానే; ఆ వేశ్యాగృహం దగ్గరే ఉంటే బాగుండేది; నా సోదరుడు అక్కడ విలాసంగా భోగాలను అనుభవిస్తుండవచ్చు.’ అని అనుకున్నాడు. అటుపక్క సువ్రితుడు ఇలా అనుకుంటున్నాడు, ‘ఈ పాపిష్టి గృహంలో ఎందుకున్నాను? నా సోదరుడు ఎంత పవిత్రుడో; తన బుద్ధిని భాగవత జ్ఞానంతో శుద్ది చేసుకుంటున్నాడు. నేను కూడా ధైర్యం చేస్కొని వర్షంలో అయినా అక్కడికి చేరుకోవాల్సి ఉండేనేమో. నేనేమన్నా ఉప్పుతో చేయబడ్డానా, కొంచెం వానకే కరిగిపోవటానికి.’ అని.
వాన ఆగిపోయిన తరువాత ఇద్దరూ ఒకరి దిశగా మరొకరు బయలుదేరారు. వారు కలుసుకోగానే, ఒక పిడుగు పడి ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు. యమ దూతలు తవ్రీతుడిని నరకం తీసుకెళ్ళటానికి వచ్చారు. తవ్రీతుడు ఫిర్యాదు చేసాడు, ‘మీరు ఏదో పొరబడ్దారనుకుంటాను. నేను తవ్రీతుడిని. ఆ వేశ్యా గృహంలో ఇందాక కూర్చున్నవాడు నా సోదరుడు సువ్రీతుడు. వాడిని నరకానికి తీసుకు వెళ్ళండి.’ అని.
ఆ యమ దూతలు ఇలా బదులిచ్చారు, ‘మేమేమీ పోరబడలేదు, అతను వర్షం నుండి తప్పించుకోవటానికి అక్కడ కూర్చున్నాడు, కానీ భాగవత ప్రవచనం దగ్గర ఉండటాని కోసం తహతహ లాడాడు. అదేసమయంలో, నీవు కూర్చోని ప్రవచనం వింటున్నా, నీ మనస్సు వేశ్యా గృహం కోసమే తపించింది.’ అని.
శ్రీ కృష్ణుడు ఈ శ్లోకంలో వెల్లడించిన విధంగానే తవ్రీతుడు చేసాడు; అతను బాహ్యంగా ఇంద్రియ విషయములను త్యజించినా, మనస్సులో వాటి గురించే ఆలోచించాడు. ఇది సరియైన పరిత్యాగం కాదు. తదుపరి శ్లోకం సరియైన సన్యాస విధానాన్ని పేర్కొంటుంది.