యజ్ఞార్థాత్ కర్మణోఽన్యత్ర లోకోఽయం కర్మబంధనః ।
తదర్థం కర్మ కౌంతేయ ముక్తసంగః సమాచర ।। 9 ।।
యజ్ఞ-అర్థాత్ — యజ్ఞం కోసం; కర్మణః — కర్మల కంటే; అన్యత్ర — వేరే; లోకః — ఈ భౌతిక ప్రపంచం; అయం — ఈ యొక్క; కర్మ-బంధనః — కర్మ బంధనము; తత్ — దాని; అర్థం — కోసం; కర్మ — కర్మలు (చర్యలు); కౌంతేయ — అర్జునా, కుంతీ పుత్రుడా; ముక్త-సంగః — ఫలాసక్తి రహితంగా; సమాచర — సరిగ్గా చేయుము.
Translation
BG 3.9: పనులని ఒక యజ్ఞం లాగా, భగవత్ అర్పితంగా చేయాలి, లేదా, ఆ పనులు మనలను ఈ జగత్తులో కర్మబంధములలో కట్టివేస్తాయి. కాబట్టి, ఓ కుంతీ పుత్రుడా, నీకు నిర్దేశింపబడిన విధులను, వాటి ఫలితములపై ఆసక్తి లేకుండా, ఈశ్వర తృప్తి కోసం నిర్వర్తించుము.
Commentary
కత్తి అనే వస్తువు, బందిపోటు చేతిలో ఉంటే అది జనులను భయభీతులను చేయటానికి లేదా చంపటానికి ఆయుధమవుతుంది, అదే ఒక శస్త్ర చికిత్స వైద్యుడి దగ్గర ఉంటే, జనుల ప్రాణాలు కాపాడే పనిముట్టుగా ఉంటుంది. కత్తి దానికదే ప్రమాదకరమైనది కాదు అలాగే శుభకరమైనదీ కాదు – దాన్ని వాడే విధానం బట్టి దాని ప్రభావం ఉంటుంది. షేక్స్పియర్ అన్నట్టుగా : ‘మంచి లేదా చెడు అన్నది ఏమీ లేదు, అంతా మన ఆలోచనలోనే ఉంది’,(For there is nothing good or bad, but thinking makes it so.) అదే ప్రకారంగా, పని అనేది మంచిదా చెడ్డదా అని చెప్పలేము, మానసిక దృక్పథం బట్టి అది ఉన్నతికి కారకం కావచ్చు లేదా బంధన కారకం అవ్వచ్చు. తన ఇంద్రియ సుఖాల కోసం, అహంకార తృప్తి కోసం చేసే పని ఈ భౌతిక జగత్తులో బంధన కారకమవుతుంది. కానీ ఒక యజ్ఞం లాగా (భగవత్ అర్పితంగా), ఆ పరమాత్మ ప్రీతి కోసం చేసిన పని, మాయా బంధాలనుండి విముక్తి కలిగించి దైవానుగ్రహాన్ని ఆకర్షిస్తుంది. కర్మలు/పనులు చేయటం అనేది మన యొక్క సహజ స్వభావం కాబట్టి ఈ రెంటిలో ఏదో ఒక దృక్పథంతో పని చేయాలి. మన మనస్సు నిశ్చలంగా ఉండలేదు కాబట్టి మనం ఏదో ఒక పని చేయకుండా ఒక్క క్షణం కూడా ఉండలేము.
కర్మలను భగవత్ అర్పితముగా చేయకపోతే, మన ఇంద్రియ మనస్సుల సంతృప్తి కోసం పని చేయవలసి వస్తుంది. అలా కాకుండా, పనులను యజ్ఞంలాగా చేస్తే, మనం సమస్త ప్రపంచాన్ని, దానిలో ఉండే ప్రతిదాన్ని భగవత్ సంబంధంగా చూసి, అవి పరమాత్మ సేవలోనే ఉపయోగపడాలని భావిస్తాము. శ్రీ రామ చంద్రుడి పూర్వీకుడైన రఘు మహారాజు ఈ విషయంలో ఒక చక్కటి ఆదర్శం చూపించాడు. రఘు మహారాజు విశ్వజిత్ యజ్ఞాన్ని చేసాడు, దానిలో తనకున్న సంపదనంతా దానం చేయవలసి ఉంటుంది.
స విశ్వజితం ఆజహ్రే యజ్ఞం సర్వస్వ దక్షిణం
ఆదానం హి విసర్గాయ సతాం వారిముచాం ఇవ
(రఘువంశము 4.86)
‘మేఘములు పృథ్వి నుండి నీటిని గ్రహించటం, వాటి స్వప్రయోజనం కోసం కాకుండా, మళ్లీ ఈ పుడమి పైనే వర్షించటం కోసమే అన్నట్టుగా, ఒక మహారాజుగా తను పన్నుల రూపంలో ప్రజలనుండి సంపాదించినదంతా తన భోగాల కోసం కాకుండా, భగవంతుని ప్రీతి కోసమే అన్న భావనతో రఘు మహారాజు విశ్వజిత్ యజ్ఞాన్ని చేసాడు. కాబట్టి తన ఐశ్వర్యాన్నంతా భగవత్ ప్రీతి కోసం తన ప్రజా సేవలో వినియోగించాలని నిర్ణయించాడు.’
యజ్ఞం పరిపూర్తి అయిన తరువాత రఘువు తనకున్నదంతా తన ప్రజలకు దానం చేసేసాడు. ఆ తర్వాత, ఒక యాచకుడిగా చిరుగు వస్త్రాలతో, మట్టి పాత్ర పట్టుకుని, తిండి కోసం యాచించటానికి బయలుదేరాడు. ఓ చెట్టు క్రింద విశ్రాంతి తీస్కుంటుండగా, కొంత మంది ఇలా మాట్లాడుకోవటం విన్నాడు. ‘మన మహారాజు ఏంతో దయకలవాడు. తన కున్నదంతా దానం చేసాడు’ అని.
రఘువు తన పొడగ్త విని చాలా బాధ పడి ఇలా అన్నాడు. ‘మీరు ఏం మాట్లాడుకుంటున్నారు?’ అని.
వారు ఇలా అన్నారు, ‘మేము మా రాజు గారి గొప్పతనం చెప్పుకుంటున్నాము. ఆయనంత దానశీలురు ఈ ప్రపంచంలోనే ఎవరూ లేరు.’
రఘువు దీనికి ఇలా ప్రత్యుత్తరం ఇచ్చాడు. ‘ఇంకెప్పుడూ అలా అనకండి. రఘువు ఏమీ ఇవ్వలేదు.’
వారు అన్నారు, ‘ఏం మనిషివి నువ్వు మా రాజు గారిని విమర్శిస్తున్నావు? రఘు మహారాజు తన సంపాదనంతా దానం చేసాడని అందరికీ తెలుసు.’
రఘువు అన్నాడు ‘వెళ్లి మీ రాజుని అడగండి, ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఏమైనా ఉందా ఆయన దగ్గర అని? ఆయన ఉత్త చేతులతో పుట్టాడు. కదా? మరి ఆయనది ఏం ఉందని ఆయన ఇచ్చినట్టు?’
కర్మ యోగ దృక్పథం అంటే ఇదే, ఈ దృక్పథంలో మొత్తం ప్రపంచాన్ని భగవంతుని సొత్తుగా మనం చూస్తాము మరియు ఇదంతా భగవత్ ప్రీతి కోసమే ఉందనుకుంటాము. అప్పుడు మనం మన విధులను మన ఇంద్రియ/మనస్సుల తృప్తి కోసం కాకుండా భగవంతుని ప్రీతి కోసం చేస్తాము. విష్ణు మూర్తి ప్రచేతసుడికి ఈ విధంగా ఉపదేశించాడు:
గృహేష్వావిశతాం చాపి పుంసాం కుశలకర్మణామ్
మద్వార్తా యాతయామానం న బంధాయ గృహా మతాః
(భాగవతం 4.30.19)
‘పరిపూర్ణ కర్మ యోగులు, తమ ప్రాపంచిక/సాంసారిక విధులను నిర్వర్తిస్తూనే ఉన్నా, వారి అన్ని కర్మ ఫలాలకు నేనే భోక్తయని తెలుసుకుని, తమ పనులన్నిటినీ, నాకు యజ్ఞములా చేస్తుంటారు. వారికున్న ఎంత కొంచెం తీరిక సమయంలో నైనా నా కీర్తి/లీలలను శ్రవణం, కీర్తనం చేస్తుంటారు. అలాంటి వారు ఈ ప్రపంచంలో జీవిస్తున్నా, వారు చేసే పనుల కర్మ బంధాలలో చిక్కుకోరు.’