Bhagavad Gita: Chapter 4, Verse 10

వీతరాగభయక్రోధా మన్మయా మాముపాశ్రితాః ।
బహవో జ్ఞానతపసా పూతా మద్భావమాగతాః ।। 10 ।।

వీత — లేకుండా; రాగ — మమకారాసక్తి; భయ — భయము; క్రోధాః — కోపము; మత్-మయా — పూర్తిగా నాయందే మనస్సు లగ్నం చేసి; మామ్ — నన్ను; ఉపాశ్రితాః — ఆశ్రయించి; బహవః — పెక్కు మంది; జ్ఞాన — జ్ఞానము యొక్క; తపసా — జ్ఞానాగ్నిచే; పూతాః — పవిత్రులై; మత్-భావం — నా దివ్య ప్రేమ; ఆగతాః — పొందినారు.

Translation

BG 4.10: మమకారాసక్తి, భయము, మరియు క్రోధములు లేకుండా ఉండి, నాయందే సంపూర్ణంగా స్థితులై ఉండి, నన్నే ఆశ్రయించి, ఎంతో మంది ఇంతకు పూర్వం నా గురించిన జ్ఞానంచే పవిత్రులైనారు, మరియు ఆ విధంగా నా దివ్య ప్రేమను పొందారు.

Commentary

ఇంతకు క్రితం శ్లోకంలో, శ్రీ కృష్ణ పరమాత్మ, ఎవరైతే ఆయన యొక్క జన్మ, కర్మ(లీల)ల దివ్యత్వాన్ని యదార్థంగా తెలుసుకుంటారో వారు ఆయననే పొందుతారు అని చెప్పి ఉన్నాడు. అన్నీ యుగాల్లో ఎంతో మంది మానవులు ఈ పద్ధతిలో భగవత్-ప్రాప్తి పొందినారు అని ఇప్పుడు దృఢపరచుతున్నాడు. వారు భక్తి ద్వారా తమ మనస్సులను ప్రవిత్రమొనర్చుకుని ఈ లక్ష్యాన్ని సాధించారు. శ్రీ ఆరోబిందో దీనిని చక్కగా వివరించాడు: ‘భగవంతుడిని నీ హృదయమనే దేవాలయంలో ప్రతిష్ఠచేయాలనుకుంటే, దాన్ని పవిత్రంగా ఉంచుకొనుము’ (You must keep the temple of the heart clean, if you wish to install therein the living presence). బైబిలు ఇలా పేర్కొంటుంది: ‘పరిశుద్ధ హృదయముగలవారు ధన్యులు, ఎందుకంటే వారు భగవంతుణ్ణి చూస్తారు. (మత్తయి 5.8)’ (Blessed are the pure in heart, for they shall see God.” (Matthew 5.8))

మరిప్పుడు, మనస్సు ఎలా పరిశుద్ధమౌతుంది? మమకారానురాగాలు, భయము, మరియు కోపము త్యజించి మనస్సుని భగవంతుని యందే లగ్నం చేయటం వల్ల ఇది సాధ్యం. నిజానికి భయానికి, కోపానికి రెంటికీ కూడా కారణం మమకారాసక్తియే. మనం మమకారం పెంచుకున్న వస్తు/విషయం మన నుండి దూరమౌతుందేమో అన్న భావనే భయాన్ని కలుగచేస్తుంది. మనం మమకారం పెంచుకున్న వస్తు/విషయాన్ని పొందటంలో ఏదైనా అడ్డువచ్చినప్పుడు క్రోధము జనిస్తుంది. అందుకే, మమకారానుబంధమే మనస్సు మలినమవటానికి మూల కారణం.

ఈ మాయా ప్రపంచం ప్రకృతి యొక్క త్రి-గుణములచే సమ్మిళితమై ఉంటుంది – సత్త్వము, రజస్సు, మరియు తమస్సు. అన్ని వస్తువులు, వ్యక్తిత్వాలు కూడా ఈ మూడు గుణముల పరిధిలోకే వస్తాయి. మన మనస్సుని ఏదోఒక భౌతిక వస్తువు లేదా వ్యక్తి తో అనుబంధం చేస్తే, మన మనస్సు కూడా త్రిగుణములచే ప్రభావితమవుతుంది. బదులుగా, అదే మనస్సుని, త్రిగుణములకు అతీతుడైన భగవంతుని యందు లగ్నం చేస్తే, అలాంటి భక్తి మనస్సుని పవిత్రం చేస్తుంది. కాబట్టి, మనస్సుని కామము, క్రోధము, లోభము, అసూయ, మరియు భ్రమ వంటి దోషముల నుండి పరిశుద్ధం చేయాలంటే, దానికి కావాల్సిన దివ్యౌషధం, ప్రాపంచిక వస్తు విషయముల నుండి మనస్సుని తొలగించి, దాన్ని భగవంతుని యందు లగ్నం చేయటమే. కాబట్టి, రామాయణం (రామచరితమానస్) లో ఇలా పేర్కొనబడినది:

ప్రేమ భగతి జల బిను రఘురాఈ

అభిఅంతర మల కబహుఁ న జాఈ

 

‘భగవంతుని యందు భక్తి లేనిదే, మనస్సుకి ఉన్న మలినం తొలగదు.’ జ్ఞాన-యోగాన్ని ఎంతో ప్రచారం చేసిన శంకరాచార్యుల వారు కూడా ఇలా పేర్కొన్నారు:

శుద్ధయతి హి నాంతరాత్మా కృష్ణపదాంభోజ భక్తిమృతే

(ప్రబోధ సుధాకర)

‘శ్రీ కృష్ణపరమాత్మ పాదారవిందాల యందు భక్తిలో నిమగ్నమవ్వకుండా, మనస్సు పరిశుద్దమవ్వదు.’

శ్రీ కృష్ణుడు తన కృపాకటాక్షములు ప్రసాదించటానికి, ప్రాపంచిక మనసున్న వారి కంటే, తన యందే మనస్సు లగ్నం చేసిన వారిపట్ల పక్షపాతం చూపిస్తున్నాడా అని, ఈ శ్లోకం చదివిన తరువాత ఒక సందేహం రావచ్చు. దేవదేవుడు దీనిని తదుపరి శ్లోకంలో నివృత్తి చేస్తున్నాడు.