Bhagavad Gita: Chapter 4, Verse 13

చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మవిభాగశః ।
తస్య కర్తారమపి మాం విద్ధ్యకర్తారమవ్యయమ్ ।। 13 ।।

చాతుః-వర్ణ్యం — నాలుగు రకాల వృత్తి ధర్మములు; మయా — నా చే; సృష్టం — సృష్టింపబడ్డాయి; గుణ — గుణముల; కర్మ— పనుల; విభాగశః — విభాగముల ప్రకారము; తస్య — దాని యొక్క; కర్తారం — సృష్టికర్త; అపి — అయినా సరే; మాం — నన్ను; విద్ధి — తెలుసుకొనుము; అకర్తారమ్ — అకర్తయని; అవ్యయమ్ — మార్పులేని.

Translation

BG 4.13: జనుల గుణములు, కార్యకలాపముల ఆధారంగా, నాలుగు రకాల వృత్తి ధర్మములు నా చేత సృష్టించబడ్డాయి. ఈ వ్యవస్థకి నేనే సృష్టికర్త అయినా నన్ను అకర్తగా మరియు సనాతనునిగా తెలుసుకొనుము.

Commentary

వేదములు జనులను నాలుగు రకాల వృత్తులవారీగా విభజించాయి, ఇవి వారి స్వభావం అనుగుణంగా చేసినవి కానీ వారి పుట్టుకను బట్టి చేసినవి కావు. ఇటువంటి వైవిధ్యం ప్రతి సమాజంలోనూ ఉంటుంది. సమత్వమే ప్రధానమైన సూత్రముగా ఉండే కమ్యూనిష్టు దేశాల్లో కూడా మానవులలో ఉండే నానావిధత్వమును తొలగించలేము. కమ్యూనిష్టు పార్టీలో మూల సిద్ధాంతకర్తలుగా ఉండే తత్త్వవేత్తలు, దేశాన్ని కాపాడే సైనిక దళాలు, వ్యవసాయం చేసుకునే రైతులు, కర్మాగారాల్లో పనిచేసే కార్మికులు; వీరంతా ఉంటారు.

వైదిక శాస్త్రం ఈ వైవిధ్యాన్ని మరింత శాస్త్రీయ పద్ధతిలో విశదీకరించింది. దాని ప్రకారం, భౌతిక శక్తి మూడు గుణములతో సమ్మిళితమై ఉంటుంది : సత్త్వ గుణము, రజో గుణము, తమో గుణము. బ్రాహ్మణులు అంటే సత్త్వ గుణం ప్రధానంగా ఉన్నవారు. వారికి స్వాభావికంగా బోధన మరియు భగవత్ ఆరాధన అంటే మొగ్గు చూపుతారు. క్ష్యత్రియులు రజో గుణ ప్రధానముగా ఉండి, స్వల్పంగా సత్వ గుణం మిళితమై ఉంటారు. వీరు పరిపాలన మరియు యాజమాన్యం వైపు మొగ్గు చూపుతారు. వైశ్యులు రజో గుణము మరియు కొంత తమో గుణము మిళితమై ఉంటారు. కాబట్టి వారు వ్యాపారము మరియు వ్యవసాయం ప్రధానంగా ఉంటారు. తరువాత, శూద్రులు, వీరు తమో గుణ ప్రధానంగా ఉంటారు. వీరు శ్రామిక వర్గముగా ఉంటారు. ఈ వర్గీకరణ అనేది జన్మతహా వచ్చినవి కావు లేదా మార్చలేనివి కావు. ఈ వర్ణాశ్రమ వర్గీకరణ అనేది జనుల స్వభావము మరియు చేష్టల ఆధారంగా ఉంటుంది అని శ్రీ కృష్ణుడు అంటున్నాడు.

భగవంతుడు ఈ ప్రపంచ వ్యవస్థకి సృష్టికర్త అయినా, ఆయన అకర్తగా ఉంటాడు. ఇది వర్షము వంటిది. అడవిలో వర్షపాతం అంతటా సమానంగా పడినా, కొన్ని విత్తనాల నుండి పెద్ద మర్రి చెట్లు వస్తాయి, మరికొంత విత్తనాల నుండి అందమైన పుష్పములు పూస్తాయి, మరివేరే వాటినుండి ముళ్ళపొదలు వస్తాయి. ఆ వర్షం అన్నిటిపట్ల పక్షపాతం లేకుండా సమంగా కురుస్తుంది, ఈ వ్యత్యాసానికి బాధ్యత దానిది కాదు. ఇదే విధంగా, భగవంతుడు జీవులకు కర్మలను చేసే శక్తిని ప్రసాదిస్తాడు, కానీ ఆ శక్తితో వారు ఏమి చేస్తారో వారికి పూర్తి స్వేచ్ఛ ఉంది. వారి చర్యలకు భగవంతుడు కారణం కాదు.

Watch Swamiji Explain This Verse