Bhagavad Gita: Chapter 4, Verse 17

కర్మణో హ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః ।
అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతిః ।। 17 ।।

కర్మణః — చేయవలసిన (విహిత) కర్మలు; హి — నిజముగా; అపి — కూడా; బోద్ధవ్యం — తెలుసుకొనుము; బోద్ధవ్యం — అర్థం చేసుకొనుము; చ — మరియు; వికర్మణః — నిషిద్ధ కర్మలు; అకర్మణః — అకర్మలు; చ — మరియు; బోద్ధవ్యం — అర్థం చేసుకొనుము; గహనా — గంభీరమైనది; కర్మణః — పనుల; గతిః — నిజమైన మార్గము.

Translation

BG 4.17: కర్మ, వికర్మ, మరియు అకర్మ - నీవు ఈ మూడింటి యొక్క స్వభావాన్ని గురించి తప్పకుండా తెలుసుకోవాలి – వీటి గురించి ఉన్న యదార్థం నిగూఢమైనది మరియు అర్థం చేసుకోవటానికి క్లిష్టమైనది.

Commentary

పని అనేది శ్రీ కృష్ణుడిచే మూడు రకాలుగా వర్గీకరించబడినది – కర్మ, వికర్మ మరియు అకర్మ.

కర్మ: ఇంద్రియ నియంత్రణ మరియు చిత్తశుద్దికి దోహదపడే విధంగా ఉండే శాస్త్ర విహితమైన మంగళప్రద పనులు.

వికర్మ: శాస్త్రములచే నిషేధింపబడిన ఆశుభకరమైన పనులు; ఇవి హాని కారకమైనవి మరియు ఆత్మ అధఃపతనానికి దారితీసేవి.

అకర్మ: ఫలాసక్తి లేకుండా కేవలం భగవంతుని ప్రీతి కోసం మాత్రమే చేసే పనులు. వీటికి కర్మ ప్రతిక్రియలు ఉండవు మరియు ఇవి జీవాత్మను బంధించవు.