Bhagavad Gita: Chapter 4, Verse 24

బ్రహ్మార్పణం బ్రహ్మ హవిర్బ్రహ్మాగ్నౌ బ్రహ్మణా హుతమ్ ।
బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మసమాధినా ।। 24 ।।

బ్రహ్మా — బ్రహ్మన్; అర్పణం — యజ్ఞము యందు ఉపయోగించే గరిటె (స్రువము) మరియు ఇతర అర్పితములు; బ్రహ్మా — బ్రహ్మన్; హవిః — హోమద్రవ్యము; బ్రహ్మా — బ్రహ్మన్; అగ్నౌ — యజ్ఞాగ్ని యందు; బ్రహ్మణా — అతనిచే; హుతమ్ — సమర్పించి; బ్రహ్మ — బ్రహ్మన్; ఏవ — నిజముగా; తేన — దానిచే; గంతవ్యం — పొందబడును; బ్రహ్మ — బ్రహ్మన్; కర్మ — సమర్పణ; సమాధినా — సంపూర్ణముగా భగవత్ ధ్యాసలోనే ఉన్నవారు.

Translation

BG 4.24: సంపూర్ణ భగవత్ ధ్యాస లోనే నిమగ్నమైన వారికి, హోమ ద్రవ్యము బ్రహ్మమే, దానిని యజ్ఞంలో సమర్పించడానికి ఉపయోగించే స్రువము బ్రహ్మమే, యజ్ఞ కర్మ బ్రహ్మమే, యజ్ఞాగ్ని కూడా బ్రహ్మమే. ప్రతిదాన్నీ కూడా ఆవిధంగా భగవంతునిగా చూసే వారు భగవంతుడిని సునాయాసంగా పొందుతారు.

Commentary

నిజానికి ఈ ప్రపంచపు వస్తువులన్నీ భగవంతుని మాయ అనే భౌతిక శక్తి ద్వారా తయారుచేయబడ్డాయి. శక్తి అనేది శక్తిమంతునికి అభేదమైనది మరియు అదేసమయంలో ఆయన కంటే వేరైనది కూడా. ఉదాహరణకి, వెలుగు అనేది అగ్ని యొక్క శక్తి. అది అగ్ని కంటే వేరైనది అనుకోవచ్చు ఎందుకంటే అది అగ్నికి బాహ్యంగా ఉంటుంది. దానిని అగ్నిలో భాగమే అనికూడా అనుకోవచ్చు. కాబట్టి సూర్య కిరణాలు కిటికీ గుండా లోపటికి వచ్చినప్పుడు, జనులు, ‘సూర్యుడు వచ్చాడు’ అని అంటారు. ఇక్కడ సూర్య కిరణాలను సూర్యుడిని ఒక్కలాగే చూస్తున్నారు. శక్తి అనేది శక్తివంతునికి కన్నా వేరైనది మరియు ఆయనలో భాగమే కూడా.

ఆత్మ కూడా భగవంతుని శక్తి రూపమే — అది ఆధ్యాత్మిక శక్తి, దానినే జీవ శక్తి అంటారు. ఇదే విషయాన్ని శ్రీ కృష్ణుడు 7.5వ శ్లోకంలో వివరించాడు. చైతన్య మహాప్రభు ఇలా అన్నాడు:

జీవ-తత్త్వ శక్తి, కృష్ణ-తత్త్వ శక్తిమాన్
గీతా–విష్ణుపురాణాది తాహాతే ప్రమాణ

(చైతన్య చరితామృతము, ఆది లీల, 7.117)

 

‘శ్రీ కృష్ణుడు శక్తిమంతుడు, ఆత్మ అతని శక్తి. భగవద్గీత, విష్ణు పురాణం మొదలైన వాటిలో ఈ విషయం చెప్పబడింది.’ ఈ విధంగా ఆత్మ అనేది ఏక కాలంలో భగవంతుని నుండి వేరైనది కాదు మరియు భగవంతుని కన్నా భేదమే. కాబట్టి భగవంతుని యందే మనస్సు నిమగ్నమైనవారు, ఈ జగత్తుని అంతా భగవంతునితో ఒక్కటిగా, ఆయనకన్నా అభేదమైనదిగా చూస్తారు. శ్రీమద్ భాగవతం ప్రకారం:

సర్వ-భూతేషు యః పశ్యేద్ భగవద్-భావమాత్మనః
భూతాని భగవత్యాత్మన్యేష భాగవతోత్తమః (11.2.45)

‘భగవంతుడినే అంతటా చూసేవాడు, అందరిలో భగవంతుడినే చూసేవాడే, అత్యుత్తమ భాగవతుడు (ఆధ్యాత్మికవేత్త).’ భగవంతుని యందే ఎల్లప్పుడూ మనస్సు నిమగ్నమై ఉన్న ఇటువంటి ఉన్నతమైన ఆధ్యాత్మిక సాధకులకు, యజ్ఞము ఆచరించే వాడు, యజ్ఞ ద్రవ్యము, హోమ పరికరాలు, హోమ అగ్ని, యజ్ఞ ప్రక్రియ, ఇవన్నీ భగవంతుని కంటే అభేదమైనవే.

ఎలాంటి దృక్పథంతో యజ్ఞం ఆచరించాలో వివరించిన తరువాత, శ్రీ కృష్ణుడు ఇప్పుడు ఈ లోకంలో జనులు చిత్తశుద్ధి కోసం ఆచరించే వివిధ రకాల యజ్ఞాలని వివరిస్తున్నాడు.