Bhagavad Gita: Chapter 4, Verse 36

అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః ।
సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి ।। 36 ।।

అపి — అయినా సరే; చేత్ — ఒకవేళ; అసి — నీవు; పాపేభ్యః — పాపాత్ములు; సర్వేభ్యః — అందరిలో; పాప-కృత్-తమః — పరమ పాపిష్టి; సర్వం — అందరిలో; జ్ఞాన-ప్లవేన — దివ్య ఆధ్యాత్మిక జ్ఞానమనే పడవతో; ఏవ — ఖచ్చితంగా; వృజినం — పాపము; సంతరిష్యసి — నీవు దాటిపోగలవు.

Translation

BG 4.36: పాపాత్ములందరి కంటే పరమ పాపిష్ఠి వారు అని పరిగణించబడిన వారు కూడా ఈ ప్రాపంచిక భవసాగరాన్ని ఆధ్యాత్మిక దివ్య జ్ఞానమనే పడవలో స్థితులై ఉండి దాటిపోవచ్చు.

Commentary

భౌతిక ప్రాపంచిక జగత్తు ఒక మహా సాగరం వంటిది, దీనిలో జన్మ, మృత్యు, జరా, వ్యాధి అనే అలలు మనలను అటూ ఇటూ త్రోసి వేస్తుంటాయి. భౌతిక శక్తి, అందరినీ మూడు రకాల క్లేశములకు (కష్టాలకు) గురి చేస్తుంది: ఆదిఆత్మిక: తన స్వంత శరీరం, మనస్సు పెట్టే బాధలు; ఆదిభౌతిక – ఇతర ప్రాణుల నుండి కలిగే బాధలు; ఆదిదైవిక – వాతావరణ మరియు పర్యావరణ సంబధిత పరిస్థితుల బాధలు. ఈ యొక్క భౌతిక బద్ద స్థితిలో, జీవాత్మకి ఎలాంటి ఉపశమనం ఉండదు, మరియు ఈ బాధలు భరిస్తూ అనంత జన్మలు గడిచిపోయినవి. మైదానంలో ఒక ఫుట్-బాల్ అటూ ఇటూ తన్నబడినట్టుగా, ఆత్మ, తన యొక్క పుణ్య, పాప కర్మానుసారం, స్వర్గాది లోకాలకు పంపబడుతుంది, నరకాది లోకాలలో వదిలివేయబడుతుంది, మరియు తిరిగి భూలోకంలోకి తీసుకు రాబడుతుంది.

ఆధ్యాత్మిక దివ్య జ్ఞానం ఈ భౌతిక భవ సాగరాన్ని దాటటానికి ఒక పడవని ఇస్తుంది. అవివేకులు కర్మలు చేసి వాటి బంధములలో చిక్కుకుంటారు. అవే కర్మలను భగవత్ యజ్ఞముగా చేయటం ద్వారా జ్ఞానులు ముక్తి సాధిస్తారు. ఈ విధంగా, జ్ఞానం అనేది భౌతిక బంధాలను త్రుంచివేయటానికి సహకరిస్తుంది. కఠోపనిషత్తు ఇలా పేర్కొంటున్నది:

విజ్ఞానసారథిర్యస్తు మనః ప్రగ్రహవాన్ నరః
సోఽధ్వనః పారమాప్నోతి తద్విష్ణోః పరమం పదం (1.3.9)

‘భవ సాగరాన్ని దాటటానికి మరియు భగవత్ ధామాన్ని చేరుకోవటానికి, నీ బుద్ధిని దివ్య జ్ఞానంతో ప్రకాశింపచేయుము; అప్పుడు ఆ ప్రకాశిత బుద్ధితో, చంచలమైన మనస్సుని నియంత్రించుము.’