పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్ ।
ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ।। 8 ।।
పరిత్రాణాయ — రక్షించుటకు; సాధూనాం — ధర్మపరులను; వినాశాయ — నాశనంచేయటానికి; చ — మరియు; దుష్కృతామ్ — దుష్టులను; ధర్మ — సనాతన ధర్మమును; సంస్థాపన-అర్థాయ — మళ్ళీ స్థాపించుటకు; సంభవామి — నేను ప్రకటమవుతాను; యుగే యుగే — ప్రతి యుగము నందు.
Translation
BG 4.8: ధర్మాత్ములను కాపాడటానికి, దుష్టులను నిర్మూలించటానికి, మరియు ధర్మ సూత్రములను తిరిగి ప్రతిష్ఠాపించటానికి నేను ఈ లోకంలో ప్రతి యుగము నందు అవతరిస్తాను.
Commentary
పూర్వ శ్లోకం లో భగవంతుడు అవతరిస్తుంటాడు అని చెప్పిన శ్రీ కృష్ణుడు, ఇప్పుడు దానికి ఉన్న మూడు కారణాలను వివరిస్తున్నాడు: 1) దుష్టులను సంహరించుట కొరకు 2) సాధు జనులను రక్షించుట కొరకు 3) ధర్మాన్ని స్థాపించుట కొరకు. కానీ, వీటిని నిశితంగా పరిశీలిస్తే ఈ మూడు కారణాలు కూడా నమ్మకంగా అనిపించవు.
సాధు జనులను రక్షించుట కొరకు: పరమాత్మ తన భక్తుల హృదయాల్లో స్థితుడై ఉంటాడు, లోపలనుండి వారిని ఎల్లప్పుడూ పరిరక్షిస్తూనే ఉంటాడు. ఈ పని కోసం ఒక అవతారం తీసుకోవలసిన అవసరం లేదు.
దుష్టులను సంహరించుట కొరకు: భగవంతుడు సర్వ-శక్తివంతుడు, దుష్టులను తన సంకల్ప మాత్రంచేతనే సంహరింపగలడు. దీనికోసం ఒక అవతారం ఎత్తవలసిన అవసరం ఏమున్నది?
ధర్మాన్ని స్థాపించుట కొరకు: అనాది కాలం నుండి వేదములలో ధర్మము వివరించబడింది. భగవంతుడు దానిని ఒక మహాత్ముని ద్వారా తిరిగి స్థాపించవచ్చు. దీనిని సాధించటం కోసం తానే ఒక రూపంలో అవతరించాల్సిన అవసరం లేదు.
మరైతే, ఈ శ్లోకంలో చెప్పబడిన కారణాలను మరెలా అర్థం చేసుకోవాలి? శ్రీ కృష్ణుడు ఏం చెప్తున్నాడో కొంచెం లోతుగా వెళ్లి అర్థం చేసుకుందాం.
జీవాత్మ చేయ గలిగే అత్యున్నత ధర్మం, భగవంతుని భక్తిలో నిమగ్నమవ్వటమే. దీనినే భగవంతుడు తన అవతారం ద్వారా వృద్ది నొందిస్తాడు. భగవంతుడు ఈ లోకంలో అవతరించినప్పుడు తన దివ్య రూపములు, నామములు, గుణములు, లీలలు, ధామములు, మరియు సహచరులను ఆవిష్కరిస్తాడు. ఇది జీవాత్మలకు భక్తి కోసం ఒక సులువైన ఆధారాన్ని అందిస్తుంది. మనస్సుకి ధ్యానం చేయటానికి, అనుసంధానమవటానికి ఒక రూపం అవసరం, అందుకే భగవంతుని నిరాకార తత్త్వం, ఆరాధించటానికి చాలా కష్టతరమైనది. అదే సమయంలో, సాకార రూపంలో ఉన్న భగవంతునిపై భక్తి అనేది, సామాన్య జనులకు అర్థం చేసుకోవటం తేలిక, ఆచరించటానికి సులువైనది, మరియు ఎంతో మధురమైనది.
ఈ విధంగా, ఐదు వేల సంవత్సరాల క్రితం కృష్ణుడు అవతరించినప్పటి నుండి, కొన్ని కోట్ల జీవులు (జీవాత్మలు) కృష్ణుడి దివ్య లీలలను తమ భక్తికి ఆధారంగా వాడుకుని, తమ మనస్సులను సునాయాసంగా, ఆహ్లాదంగా పవిత్రమొనర్చుకున్నారు. ఇదే విధంగా, రామాయణం కూడా ఎన్నో శతాబ్దాలుగా జీవాత్మల భక్తికి, ఎంతో జనాదరణ పొందిన ఆధారంగా ఉపయోగపడింది. భారతదేశంలో ఆదివారాల్లో టీవీలో రామాయణం మొదలయిన రోజుల్లో, దేశంలో అన్ని వీధులు నిర్మానుష్యమయ్యేవి. రామచంద్రుని లీలలు జనులకు ఎంత ముగ్ధమోహనముగా ఉండేవంటే, ప్రజలు తమ టెలివిజన్ తెరలకు, ఆ లీలలను చూడటానికి, అతుక్కుపోయేవారు. శ్రీరామచంద్రుని అవతారం, చరిత్రలో ఎన్నో కోట్ల జీవాత్మలకు తమ భక్తికి ఒక ఆధారాన్ని అందించింది. రామాయణం ఇలా పేర్కొంటున్నది:
రామ ఏక తాపస తియ తారీ, నామ కోటి ఖల కుమతి సుధారీ
‘తన అవతార సమయంలో, రామచంద్ర మూర్తి ఒక్క అహల్యకే (గౌతమ ముని భార్య, ఆమెను రాముడు ఒక రాతి శరీరంనుండి విడిపించాడు) సహాయపడ్డాడు. కానీ, అప్పటి నుండి “రామ” నామము జపించి, కోట్ల మంది పతితులైన జీవులు తమను తాము ఉద్ధరించుకున్నారు.’ కాబట్టి, ఈ శ్లోకానికి నిగూఢమైన అర్థం ఏమిటంటే :
ధర్మాన్ని స్థాపించటం కోసం: జీవాత్మలకు భక్తిలో నిమగ్నమై తమ అంతఃకరణ శుద్దికి సహకరించటానికి, తన నామములు, రూపములు, లీలలు, గుణములు, ధామములు, మరియు సహచరులను ప్రకటించటం ద్వారా, భక్తి అనే ధర్మాన్ని స్థిరపరచటానికి భగవంతుడు అవతరిస్తాడు.
దుష్టులను సంహరించటం: భగవంతుని లీలలలో పాలు పంచుకోవటానికి, ఆయనతో పాటుగా కొంతమంది ముక్త మహాత్ములు కూడా అవతరించి, దుర్మార్గులుగా నటిస్తారు. ఉదాహరణకి, రావణ-కుంభకర్ణులు నిజానికి భగవత్ దివ్య ధామము నుండి దిగివచ్చిన జయ-విజయులే. వారు రాక్షసులుగా నటించారు మరియు రాముడినే ఎదిరించి పోరాడారు. వారు దివ్య పురుషులు కాబట్టి మరెవ్వరి చేత సంహరింపబడలేరు. కాబట్టి, భగవంతుడే అటువంటి రాక్షసులను తన లీలలలో భాగంగా సంహరించాడు. అలా సంహరించి, వారిని తన దివ్య ధామానికి పంపించాడు, ఎందుకంటే వారు నిజానికి అక్కడి నుండి వచ్చిన వారే.
ధర్మాత్ములను రక్షించటం: ఎన్నో జీవాత్మలు, భగవంతుడిని తమ ఎదురుగా దర్శించటానికి తగినంత ఉన్నతిని సాధనలో పొందిఉన్నారు. ఈ అర్హత సంపాదించిన జీవాత్మలు, శ్రీ కృష్ణుడు ఈ లోకంలో అవతరించినప్పుడు, భగవంతుని లీలలలో పాలు పంచుకోవటానికి మొదటి అవకాశాన్ని పొందాయి. ఉదాహరణకి, కొంతమంది గోపికలు (శ్రీ కృష్ణుడు తన లీలలను ప్రదర్శించిన బృందావనానికి చెందిన మహిళలు) నిజానికి శ్రీ కృష్ణుని లీలలలో సహకరించటానికి ఆయన దివ్య ధామము నుండి దిగివచ్చిన ముక్త జీవులు. మరికొంత మంది గోపికలు, మొదటి సారి భగవంతుని కలిసి, సేవించుకుని, ఆయన లీలలలో పాలు పంచుకునే అవకాశమొచ్చిన, భౌతిక బంధములో ఉన్న జీవులు. కాబట్టి శ్రీ కృష్ణుడు ఈ లోకంలో అవతరించినప్పుడు, అలాంటి పరిపక్వత కలిగిన జీవాత్మలకు, ఆయన లీలలలో భాగస్వాములై, తమ భక్తిని పరిపూర్ణమొనర్చుకునే అవకాశం కలిగింది.
ఇది, ఈ శ్లోకం యొక్క నిగూఢమైన అర్థం. అదే సమయంలో, ఎవరైనా ఈ శ్లోకాన్ని ఉన్నదున్నట్లుగానే అర్థం చేసుకోవటంలో కూడా తప్పు లేదు.