అర్జున ఉవాచ ।
సంన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి ।
యఛ్చ్రేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితమ్ ।। 1 ।।
అర్జున ఉవాచ — అర్జునుడు పలికెను; సన్న్యాసం — సన్యాసము; కర్మణాం — కర్మల యొక్క; కృష్ణ — శ్రీ కృష్ణ; పునః — మరల; యోగం — కర్మ యోగం గురించి; చ — మరియు; శంససి — ప్రశంసించావు; యత్ — ఏదైతే; శ్రేయః — ఎక్కువ శేయస్కరమో; ఏతయో — ఈ రెంటిలో; ఏకం — ఒకటి; తత్ — అది; మే — నాకు; బ్రూహి — దయచేసి చెప్పుము; సు-నిశ్చితమ్ — నిర్ణయాత్మకముగా.
Translation
BG 5.1: అర్జునుడు అన్నాడు : ఓ శ్రీ కృష్ణా, నీవు కర్మ సన్యాసమును (పనులను త్యజించుట) ప్రశంసించావు మరియు కర్మ యోగమును (భక్తితో పనిచేయుట) కూడా చేయమన్నావు. ఈ రెంటిలో ఏది శ్రేయస్కరమో ఖచ్చితముగా తేల్చి చెప్పుము?
Commentary
అర్జునుడు అడిగిన పదహారు ప్రశ్నలలో ఇది ఐదవది. శ్రీ కృష్ణుడు పనులను త్యజించటమును మరియు భక్తితో పని చేయటమును రెంటినీ ప్రశంసించాడు. పైకి విరుద్ధంగా అనిపించే ఈ రెండు ఉపదేశములతో అర్జునుడు తికమక పడి, ఈ రెంటిలో ఏది తనకు ఎక్కువ శ్రేయస్సుని కలుగచేసేదో తెలుసుకోవాలనుకుంటున్నాడు. ఈ ప్రశ్న ఏ సందర్భంలో వచ్చిందో ఒకసారి చూద్దాం.
మొదటి అధ్యాయం, అర్జునుడి శోకం యొక్క తీరు వివరించి, శ్రీ కృష్ణుడు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఉపదేశించటానికి ఒక చక్కటి వాతావరణం కలిగించింది. రెండవ అధ్యాయంలో, శ్రీ కృష్ణుడు అర్జునుడికి ఆత్మ జ్ఞానాన్ని తెలియపరిచాడు; ఆత్మ నిత్యమైనది, నాశము లేనిది కాబట్టి, ఎవరూ నిజానికి యుద్ధంలో చనిపోరు, కాబట్టి శోకించటం తెలివితక్కువ పని అని చెప్పాడు. తదుపరి, అర్జునుడికి ఒక వీరుడిగా తన కర్మ (సామాజిక విధి), యుద్ధంలో ధర్మ పక్షం వైపు పోరాడటమే అని చెప్పాడు. కానీ, కర్మ అనేది వ్యక్తులను కర్మ-ఫల బంధములకు కట్టివేస్తుంది కాబట్టి అర్జునుడిని తన కర్మ ఫలములను భగవత్ అర్పితము చేయమన్నాడు, శ్రీ కృష్ణుడు. అప్పుడు అతని పనులు కర్మ యోగమవుతాయి, అంటే ‘పనుల ద్వారా భగవత్ సంయోగము.’
మూడవ అధ్యాయంలో, కర్తవ్య నిర్వహణ చేయటం అవశ్యకమైనది ఎందుకంటే అది మన అంతఃకరణ శుద్ధికి చాలా దోహద పడుతుంది అని ఆ పరమాత్మ చెప్పాడు. కానీ, అంతఃకరణ శుద్ధి సాధించిన వ్యక్తి ఎలాంటి సామాజిక విధులను నిర్వర్తించే అవసరం లేదు అని కూడా చెప్పాడు (శ్లోకం 3.17).
నాలుగవ అధ్యాయంలో భగవంతుడు చాల రకాల యజ్ఞముల (భగవత్ ప్రీతి కొరకు చేసే కార్యములు) గురించి విశదీకరించాడు. యాంత్రికమైన కర్మకాండలతో కూడిన యజ్ఞము కంటే జ్ఞానముతో కూడిన యజ్ఞము శ్రేయస్కరమైనదని చెప్పాడు. అన్ని యజ్ఞములు కూడా చివరకి మనకు భగవంతునితో ఉన్న సంబంధము యొక్క జ్ఞానాన్ని తెలియజేయుటకే దారి తీస్తాయి అని చెప్పాడు. చివరికి 4.41వ శ్లోకంలో, కర్మ సన్యాస విషయాన్ని పరిచయం చేసాడు; దీనిలో కర్మకాండలు మరియు సామాజిక విధులు త్యజించి వ్యక్తి పూర్తిగా శరీరము, మనస్సు, మరియు ఆత్మతో భక్తి పూరిత సేవలోనే నిమగ్నమౌతాడు.
ఈ ఉపదేశాలన్నీ అర్జునుడిని అయోమయానికి గురి చేసాయి. అతను కర్మ సన్యాసము మరియు కర్మ యోగము రెండూ విరుద్ధ స్వభావాలతో కూడినవి అనుకున్నాడు, మరియు ఈ రెంటినీ ఒకేసారి చేయలేమనుకున్నాడు. కాబట్టి, తన సందేహాన్ని శ్రీ కృష్ణుని దగ్గర వ్యక్తం చేస్తున్నాడు.