Bhagavad Gita: Chapter 5, Verse 14

న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః ।
న కర్మఫలసంయోగం స్వభావస్తు ప్రవర్తతే ।। 14 ।।

న — కాదు; కర్తృత్వం — చేసేది నేనే అన్న అహంకారము; న — కాదు; కర్మాణి — కర్మలు; లోకస్య — జనుల యొక్క; సృజతి — సృష్టించును; ప్రభుః — భగవంతుడు; న — కాదు; కర్మ-ఫల — కర్మ ఫలముల; సంయోగం — కలయిక; స్వభావః — వ్యక్తియొక్క స్వభావము; తు — కానీ; ప్రవర్తతే — ప్రవర్తిల్లును.

Translation

BG 5.14: కర్తృత్వ భావన కానీ, కర్మల స్వభావం కానీ భగవంతునిచే సృష్టించబడవు; కర్మ ఫలములను సృష్టించేది కూడా ఆయన కాదు. భౌతిక ప్రకృతి గుణములే వీటన్నిటిని ప్రవర్తిల్లచేయును.

Commentary

ఈ శ్లోకంలో, భగవంతుడే సర్వలోక నాయకుడు అని సూచించటానికి, 'ప్రభు' అన్న పదం భగవంతునికి వాడబడింది. ఆయన సర్వశక్తిమంతుడు మరియు సమస్త విశ్వమును నియంత్రణ చేసేవాడు. అయినా సరే, ఈ విశ్వం యొక్క కార్యకలాపాలు ఆయనే నిర్వహించినా, ఆయన అకర్తగా ఉంటాడు. మన క్రియలను నిర్దేశించే వాడు కాదు, లేదా మనం ఏదైనా మంచి పని లేదా చెడు పని చేయాలా/వద్దా అని శాసించే వాడూ కాదు. ఒకవేళ ఆయనే నిర్వాహకుడు అయి ఉంటే, ఏది మంచి లేదా ఏది చెడు అనే దాని మీద ఇంత విస్తారమైన ఉపదేశాలు అవసరం లేదు. సమస్త శాస్త్రాలు ఓ మూడు చిన్న వాక్యాలతో సరిపోయేవి: ‘ఓ జీవాత్మలారా, నేనే, మీ యొక్క సమస్త కర్మలకు నిర్వాహకుడిని. కాబట్టి ఏది మంచో, ఏది చెడో తెలుసుకొనే అవసరం మీకు లేదు. నా ఇష్టప్రకారంగా మీతో పనులు చేపిస్తాను.’ అని.

అదే విధంగా, మనం కర్తృత్వ భావనలో ఇరుక్కుపోవటానికి భగవంతుడు కారణం కాదు. ఆయనే కావాలని ఆ గర్వాన్ని మనలో కలుగ చేసి ఉంటే, మళ్ళీ మన తప్పుడు చేష్టలకు ఆయననే దోషుడిగా చేసేవాళ్ళం. నిజానికి, జీవాత్మనే తన అజ్ఞానంచే ఆ కర్తృత్వ భావనని తనకు కలుగచేసుకుంటుంది. ఒకవేళ, జీవాత్మ ఆ అజ్ఞానాన్ని వదిలించుకోవాలని చూస్తే, అప్పుడు భగవంతుడు తన కృపతో దానిని నిర్మూలించటానికి సహాయపడుతాడు.

ఈ విధంగా, కర్తృత్వ భావనను త్యజించటం అనేది జీవాత్మ యొక్క బాధ్యత. ఈ శరీరము ప్రకృతి యొక్క త్రిగుణములచే కూడి ఉన్నది మరియు అన్ని కర్మలు కూడా ఆ త్రిగుణములచే చేయబడతాయి. కానీ అజ్ఞానంలో ఉన్న జీవాత్మ, తను ఈ శరీరమే అనుకోని, కర్మల యొక్క కర్తగా ఇరుక్కుపోతుంది, నిజానికి అవి ప్రకృతి గుణములచే చేయబడుతాయి. (శ్లోకం 3.27)

Watch Swamiji Explain This Verse