Bhagavad Gita: Chapter 5, Verse 15

నాదత్తే కస్యచిత్పాపం న చైవ సుకృతం విభుః ।
అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః ।। 15 ।।

న, ఆదత్తే — స్వీకరించడు; కస్యచిత్ — ఏ ఒక్కని యొక్క; పాపం — పాపము; న — కాదు; చ — మరియు; ఏవ — తప్పకుండా; సు-కృతం — పుణ్య కర్మలను; విభుః — సర్వవ్యాపియైన భగవంతుడు; అజ్ఞానేన — అజ్ఞానముచే; ఆవృతం — ఆవరింపబడి; జ్ఞానం — వివేకము/జ్ఞానము; తేన — దానిచే; ముహ్యంతి — మోహితులై భ్రమకు లోనగుచున్నారు; జంతవః — జీవులు.

Translation

BG 5.15: సర్వాంతర్యామియైన భగవంతుడు, ఏ ఒక్కని పాపపు లేదా పుణ్యకర్మల యందు కూడా పాలు పంచుకోడు. జీవుల వివేకము అజ్ఞానముచే కప్పబడిపోవటం వలన వారు భ్రమకు లోనగుతున్నారు.

Commentary

భగవంతుడు ఏ ఒక్కని పుణ్య, పాప పనులకు భాధ్యుడు కాడు. ఈ విషయంలో భగవానుని యొక్క పని మూడు అంచెలుగా ఉంటుంది: 1) ఆయన జీవాత్మకు కర్మలు చేసే శక్తి ఇస్తాడు 2) మనకు ఇవ్వబడిన శక్తితో, మనం పనులు చేయగానే మనం చేసినదాన్ని నోట్ చేసుకుంటాడు. 3) మనం చేసిన పనుల కర్మఫలములను అందజేస్తాడు.

ప్రతి జీవాత్మకు తన స్వంత నిర్ణయం ద్వారా మంచి లేదా చెడు పనులు చేయటానికి పూర్తి స్వేచ్ఛ ఉంది. ఆ స్వతంత్రచిత్తమే సృష్టి కేళికి మూలాధారము మరియు ఎన్నో జీవాత్మల మధ్య ఉన్న వైవిధ్యానికి మూల కారణం. ఒక క్రికెట్ మ్యాచ్ లో అంపైర్‌లా ఉంటుంది భగవంతుని పని. ఫలితములను ఇస్తూనే ఉంటాడు, ‘నాలుగు పరుగులు!’, ‘ఆరు పరుగులు!’, ‘అతను ఔట్!’ అలా. నిర్ణయాలకు అంపైర్‌ని దోషుడిగా చేయలేము, ఎందుకంటే అవి ఆటగాడి ఆట తీరుని బట్టి ఉంటాయి.

భగవంతుడు, జీవులకు స్వతంత్ర-చిత్తమును (free-will) ఎందుకు ఇచ్చాడు అన్న సందేహము రావచ్చు. ఇది ఎందుకంటే, భగవంతుడు అభిజ్ఞ స్వరాట్ (సర్వ స్వతంత్రుడు), కాబట్టి జీవాత్మ కూడా, తన ఇంద్రియమనోబుద్ధులను తన ఇష్టానుకూలంగా ఉపయోగించుకోవటంలో అణుమాత్ర స్వతంత్రత కలిగి ఉంటుంది.

అంతేకాక, స్వతంత్ర చిత్తము లేకుండా ప్రేమ ఉండదు. ఒక యంత్రము ప్రేమించలేదు ఎందుకంటే దానికి నిర్ణయించుకునే స్వతంత్రత ఉండదు. స్వతంత్రంగా నిర్ణయించుకునే వ్యక్తిత్వానికే ప్రేమించగలిగే అవకాశం ఉంటుంది. ఆయనను మనం ప్రేమించాలానే ఉద్దేశంతోనే మనలను ఆ భగవంతుడు సృష్టించాడు కాబట్టి మనకు స్వతంత్ర చిత్తమును ప్రసాదించాడు. మన స్వతంత్ర చిత్తమును వాడుకోవటం వలన మంచి లేదా చెడు కర్మలు చేయబడుతాయి, అంతేకాని ఎప్పుడూ కూడా భగవంతుడిని తప్పు పట్టరాదు.

అజ్ఞానంతో కొందరు జీవులు, వారికి తమ కార్యకలాపములు చేసుకునే స్వేచ్ఛ తమకు ఉందని తెలుసుకోక, తమ తప్పులకు భగవంతుడిని బాధ్యుడిని చేస్తారు. మరికొందరు, స్వేచ్ఛాచిత్తము ఉందని తెలుసుకుంటారు, కానీ, శారీరక అహంకారం లో కర్తృత్వభావన కలిగి ఉంటారు (చేసేది నేనే అన్న భావన). ఇది కూడా అజ్ఞానానికి చిహ్నమే. ఈ అజ్ఞానాన్ని ఎట్లా నిర్మూలించుకోవాలో తదుపరి శ్రీ కృష్ణుడు వివరిస్తున్నాడు.

Watch Swamiji Explain This Verse