Bhagavad Gita: Chapter 5, Verse 23

శక్నోతీహైవ యః సోఢుం ప్రాక్శరీర విమోక్షణాత్ ।
కామక్రోధోద్భవం వేగం స యుక్తః స సుఖీ నరః ।। 23 ।।

శక్నోతి — చేయగలడు; ఇహ ఏవ — ఈ ప్రస్తుత శరీరం లోనే; యః — ఎవరైతే; సోఢుమ్ — నిగ్రహించి/తట్టుకోని; ప్రాక్ — పూర్వమే; శరీర — శరీరము; విమోక్షణాత్ — త్యజించుట; కామ — కోరిక; క్రోధ — కోపము; ఉద్భవం — (నుండి) జనించిన; వేగం — ఉద్వేగమును; సః — ఆ వ్యక్తి; యుక్తః — యోగి; సః — ఆ వ్యక్తి; సుఖీ — సంతోషము కల; నరః — మనిషి.

Translation

BG 5.23: ఈ శరీరమును విడిచి పెట్టక ముందే ఎవరైతే కామ-క్రోధ శక్తులను నియంత్రణ చేయగలరో వారు యోగులు మరియు వారు మాత్రమే నిజమైన సుఖసంతోషములు గలవారు.

Commentary

మానవ శరీరం అనేది, ఆత్మకి, అత్యున్నత లక్ష్యం అయిన భగవత్ ప్రాప్తిని సాధించేందుకు ఉన్న ఒక అద్భుతమైన అవకాశం. ఈ శరీరంలో, మనకు వివేచనా శక్తి ఉంటుంది, కానీ జంతువులు తమ సహజ స్వభావంచే ప్రవర్తిస్తాయి. శ్రీ కృష్ణుడు ఈ విచక్షణా శక్తిని వాడుకోవటం ద్వారా కామ-క్రోధముల యొక్క ఉద్వేగమును నియంత్రించాలి అని ఉద్ఘాటిస్తున్నాడు.

'కామము' అంటే ఒక అర్థం స్త్రీ-పురుషుల మధ్య ఉండే వాంఛ, కానీ ఈ శ్లోకంలో, 'కామము' అన్న పదానికి అర్థం, 'భౌతిక సుఖాల కోసం ఉన్న అన్ని రకాల శారీరక, మానసిక కోరికలు' అని. తనకు కావలసిన వస్తువు ఎప్పుడైతే దొరకదో, అప్పుడు మనస్సు తన స్థితిని క్రోధము వ్యక్తం చేయటానికి మార్చుకుంటుంది. కామ-క్రోధముల ఆవేశం, నది ప్రవాహంలా చాలా ప్రబలంగా ఉంటుంది. జంతువులు కూడా ఈ ఆవేశాలకు లోనగుతాయి, కానీ మనుష్యుల లాగ కాకుండా, ఆయా ఆవేశాలను నియంత్రించే విచక్షణా శక్తి వాటికి లేదు. కానీ, మనుష్య బుద్ధికి వివేచనా శక్తి ప్రసాదించబడింది. '

సోఢుం' అన్న పదానికి అర్థం 'తట్టుకొని నిలబడటం'. ఈ శ్లోకం మనకు కామ-క్రోధ ఉద్వేగాలని అదుపులో ఉంచుకొని తట్టుకొని ఉండమని ఉపదేశిస్తున్నది. కొన్ని సార్లు మనం, సిగ్గుపడి మనస్సుని నియంత్రిస్తాము. ఒక ఆసామి విమానాశ్రయంలో కూర్చొని ఉన్నాడు అనుకోండి. ఒక అందమైన ఆవిడ వచ్చి ఆయన పక్కన కూర్చుంది. అతని మనస్సు, ఆమె చుట్టూ చేయి వేసే సుఖాన్ని కోరుకుంటుంది, కానీ అతని బుద్ధి ఈ తలంపుతో దానిని నియంత్రిస్తుంది, ‘ఇది మంచి ప్రవర్తన కాదు. ఆవిడ నా చెంపఛెళ్ళు మనిపించవచ్చు కూడా.’ ఆ అవమానం పొందకుండా, తనను తాను నిగ్రహించుకుంటాడు. ఇక్కడ సిగ్గుపడో, అవమానానికో, భయానికో మనస్సుని నియంత్రణ చేయమనటం లేదు, జ్ఞానంచే కలిగిన విచక్షణచే మనస్సుని నిగ్రహించమంటున్నాడు, శ్రీ కృష్ణుడు.

మనస్సుని నియంత్రించటానికి దృఢమైన బుద్ధిని వాడుకోవాలి. ఏదైనా భౌతిక సుఖాన్ని ఆస్వాదించాలనే తలంపు రాగానే, వెంటనే బుద్ధికి, అవి దుఃఖహేతువులు అని గుర్తురావాలి. శ్రీమద్ భాగవతం ఇలా పేర్కొంటున్నది:

నాయం దేహో దేహ-భాజాం నృలోకే
కష్టాన్ కామాన్ అర్హతే విద్-భుజాం యే
తపో దివ్యం పుత్రకా యేన సత్త్వం
శుద్ధ్యేద్ యస్మాద్ బ్రహ్మ సౌఖ్యం త్వనంతం (5.5.1)

‘మానవ శరీరంలో, ప్రాపంచిక సుఖాల కోసం ఎంతో కష్ట పడనవసరం లేదు, ఇవి మలమును భక్షించే జీవులకు (సూకరములు) కూడా లభించును. బదులుగా, ఈ విశిష్ట శరీరంతో తపస్సుని ఆచరించి, అంతఃకరణ శుద్ధి సాధించి, అనంతమైన బ్రహ్మానందమును అనుభవింపవలెను.’ ఈ వివేకముతో కూడిన విచక్షణ కేవలం మానవ శరీరంలోనే లభిస్తుంది మరియు ఈ దేహంలో ఉన్నప్పుడే కామ-క్రోధ ఆవేశాలను నియంత్రణలో ఉంచినవాడే యోగి అవుతాడు. అటువంటి వాడు మాత్రమే, దివ్యానందాన్ని రుచి చూసి సుఖంగా ఉంటాడు.