Bhagavad Gita: Chapter 6, Verse 1

శ్రీ భగవానువాచ ।
అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః ।
స సన్న్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియః ।। 1 ।।

శ్రీ భగవానువాచ — భగవంతుడు పలికెను; అనాశ్రితః — ఆశించకుండా; కర్మఫలం — పనుల యొక్క ఫలితములు; కార్యం — చేయవలసిన; కర్మ — పని; కరోతి — నిర్వర్తించుట; యః — ఎవరైతే; సః — ఆ మనిషి; సంన్యాసీ — సన్యసించిన; చ — మరియు; యోగీ — యోగి; చ — మరియు; న — కాదు; నిః — లేకుండా; అగ్ని — అగ్ని; న — కాదు; చ — మరియు; అక్రియః — క్రియా రహితంగా

Translation

BG 6.1: భగవంతుడు పలికెను: ఫలాపేక్ష లేకుండా కర్తవ్య కర్మలను (చేయవలసిన విధులను), చేసిన వారే నిజమైన సన్యాసులు, యోగులు. అంతేకాని, కేవలం అగ్ని హోత్ర యజ్ఞం వంటివి చేయటం ఆపివేసిన వారు లేదా శారీరిక క్రియలు త్యజించిన వారు కాదు.

Commentary

వేదాలలో అగ్ని హోత్ర యజ్ఞముల వంటి కర్మ కాండలు చెప్పబడినవి. సన్యాసాశ్రమంలో ప్రవేశించిన వారు కర్మ కాండలు చేయకూడదనే నియమాలు ఉన్నాయి, నిజానికి వారు అగ్నిని తాకరాదు, వంట కోసంకూడా తాకరాదు. భిక్ష అన్నాన్ని మాత్రమే స్వీకరించాలి. కానీ, కేవలం అగ్నిని విడిచిపెట్టినంత మాత్రాన, వ్యక్తి సన్యాసి అయిపోడు, అని అంటున్నాడు శ్రీ కృష్ణుడు.

నిజమైన యోగులు ఎవరు, మరియు నిజమైన సన్యాసులు ఎవరు? ఈ విషయంపై చాలా అయోమయం ఉంది. జనులు అనుకుంటారు, ‘ఈ స్వామీజీ, ఫలాహారి (అంటే పండ్లు తప్ప ఇంకా ఏమీ తిననివాడు), కాబట్టి ఈయన ఒక ఉన్నతమైన యోగి.’ ‘ఈ బాబాజీ, దూధాహారి (పాల మీదనే బ్రతుకుతాడు), కాబట్టి ఇంకా ఉన్నతమైన యోగి.’ ‘ఈ గురూజీ, పవనాహారి (ఏమీ తినరు, కేవలం శ్వాస మీదనే జీవిస్తాడు), కాబట్టి తప్పకుండా భగవత్ ప్రాప్తి నొంది ఉండాలి.’ ‘ఈ సాధువు నాగాబాబా (వస్త్రములు కట్టుకోని సాధువు), కాబట్టి సంపూర్ణంగా సన్యాసం స్వీకరించినట్టే.’ కానీ, శ్రీ కృష్ణుడు ఈ అన్ని దృక్పథాలని ఖండిస్తున్నాడు. కేవలం బాహ్యమైన సన్యాస శకలు ఎవరినీ సన్యాసిని కానీ యోగిని కానీ చేయవు. ఎవరైతే తమ కర్మ ఫలములను భగవంతుకే అర్పిస్తారో వారే నిజమైన సన్యాసులు, యోగులు.

ఈ మధ్య కాలంలో, 'యోగా' అనేది పాశ్చ్యాత్య దేశాల్లో చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఎన్నెన్నో యోగా స్టూడియోస్ ప్రతి దేశంలో, ప్రతి ఊర్లో వచ్చేసాయి. గణాంకాల ప్రకారం అమెరికాలో ప్రతి పది మందిలో ఒకరు యోగాభ్యాసము చేయుచున్నారు. కానీ, ఈ 'యోగా' అన్న పదం సంస్కృత వాఙ్మయంలో లేదు; అసలైన పదం ఏమిటంటే అది 'యోగ్', అంటే ఏకమవ్వటం. ఇది జీవాత్మ పరమాత్మతో ఏకమవ్వటాన్ని సూచిస్తుంది. ఇంకో విధంగా చెప్పాలంటే, యోగి అంటే మనస్సు పూర్తిగా భగవంతునితో ఏకమయినవాడు అని అర్థం. అంటే, అటువంటి యోగి మనస్సు సహజంగానే ఈ ప్రపంచం నుండి ఉపసంహరించబడి ఉంటుంది. కాబట్టి, ఒక నిజమైన యోగి ఒక నిజమైన సన్యాసి కూడా.

కర్మ యోగమును పాటించే వారు తమ అన్ని కార్యములను, ఫలాపేక్ష లేకుండా, భగవంతుని పట్ల వినయ విధేయ సేవా దృక్పథంతోనే చేస్తారు. వారు గృహస్థులైనా అటువంటి వ్యక్తులు నిజమైన యోగులు మరియు అసలైన సన్యాసులు.