Bhagavad Gita: Chapter 6, Verse 10

యోగీ యుంజీత సతతమాత్మానం రహసి స్థితః ।
ఏకాకీ యతచిత్తాత్మా నిరాశీరపరిగ్రహః ।। 10 ।।

యోగీ — ఒక యోగి; యుంజీత — ధ్యానములో నిమగ్నమై ఉండవలెను; సతతం — ఎల్లప్పుడూ; ఆత్మానం — ఆత్మ; రహసి — ఏకాంతములో; స్థితః — ఉంటూ; ఏకాకీ — ఒక్కడే; యత-చిత్త-ఆత్మా — మనస్సు-శరీరము నియంత్రణలో ఉంచుకొని; నిరాశీ: — కోరికలు లేకుండా; అపరిగ్రహః — భోగ వస్తువులను సమకూర్చుకోవాలనే వాంఛ లేకుండా.

Translation

BG 6.10: యోగ స్థితిని పొందగోరే వారు ఏకాంతంలో ఉండాలి, నియంత్రించబడిన మనస్సు-శరీరంతో, కోరికలను, భోగవస్తువులను త్యజించి, నిత్యమూ భగవత్ ధ్యానంలో నిమగ్నమైఉండాలి.

Commentary

యోగ స్థితిని సాధించిన వాని లక్షణములు చెప్పిన పిదప, శ్రీ కృష్ణుడు దాని కోసం కావలసిన సాధన గురించి చెప్తున్నాడు. ఏదేనీ విషయంలో నైపుణ్యత సాధించాలంటే ప్రతిరోజూ సాధన అవసరం. కేవలం కాలనీలో ఉన్న ఈత కొలనుకి వారానికోసారి ప్రతి శనివారం సాయంత్రం వెళ్ళినవాడు, ఒలింపిక్ ఈత పోటీలో విజయుడు కాలేడు. ప్రతిరోజూ చాలా గంటలు అభ్యాసం చేసిన వ్యక్తే ఒలింపిక్ విజేత అవ్వగలిగే ప్రావీణ్యత సాధిస్తాడు. అభ్యాసం అనేది ఆధ్యాత్మిక ప్రావీణ్యతకి కూడా చాలా అవసరం. ప్రతిరోజూ ధ్యాన అభ్యాసము ద్వారా ఆధ్యాత్మిక ప్రావీణ్యత సాధించే పద్ధతిని, వివరిస్తున్నాడు, ఇప్పుడు శ్రీ కృష్ణుడు. శ్రీ కృష్ణుడు చెప్పే మొదటి విషయం ఏకాంత ప్రదేశం యొక్క అవసరం. రోజంతా మనం ప్రాపంచిక వాతావరణంచే చుట్టుముట్టబడి ఉంటాము; ఈ ప్రాపంచిక కార్యక్రమాలు, జనులు, మరియు మాటలు, మన మనస్సుని ఇంకా ఇంకా ప్రాపంచికంగా చేస్తాయి. మనస్సుని భగవంతుని వైపు ఉద్ధరించటానికి, కొంత సమయాన్ని ప్రతిరోజూ ఏకాంత సాధనకు ఉపయోగించాలి.

పాలు మరియు నీళ్ళ ఉదాహరణ ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పటానికి సహాయపడచ్చు. పాలను నీళ్ళలో పోస్తే అది తన స్వీయ-అస్తిత్వాన్ని నిలుపుకోలేదు, ఎందుకంటే నీరు దానితో కలిసి పోతుంది. కానీ, అదే పాలను నీటి నుండి వేరుగా ఉంచి, దాన్ని పెరుగు చేసి, పెరుగునుండి వెన్న తీస్తే, ఆ వెన్న కలిసిపోదు (నీటిలో). అది ఇప్పుడు నీటిని సవాలు చేయవచ్చు – ‘నీ నెత్తి మీద కూర్చొని తేలుతాను; నీవు ఏమీ చేయలేవు ఎందుకంటే నేను ఇప్పుడు వెన్న అయిపోయాను.’ అని. మన మనస్సు పాల వంటిది మరియు ఈ ప్రపంచం నీళ్ళ వంటిది. ఈ ప్రపంచంతో సాన్నిహిత్యం వలన మనస్సు దానిచే ప్రభావితమై, ప్రాపంచికంగా అవుతుంది. కానీ, ఇంద్రియ వస్తువిషయములతో అతితక్కువ సంబంధం కలిగిఉండే, ఏకాంత వాతావరణం, మనస్సుని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళి, భగవంతునిపై కేంద్ర్రీకరించటానికి అనుకూలంగా ఉంటుంది. ఒకసారి, భగవంతునితో తగినంత అనుబంధం ఏర్పడిన తరువాత, ఈ ప్రపంచాన్ని సవాలు చేయవచ్చు, ‘నేను ఈ మాయా ద్వందముల మధ్యనే నివసిస్తాను, కానీ వాటిని నాకు అంటనివ్వను’ అని.

ఈ ఏకాంతంగా ఉండమనే ఉపదేశం శ్రీ కృష్ణుడిచే మరల 18.52వ శ్లోకంలో చెప్పబడింది. ‘వివిక్తసేవీ లఘ్వాశీ’ ‘ ఏకాంత ప్రదేశంలో ఉండుము; ఆహారాన్ని మితంగా భుజించుము.’ మన వృత్తిపరమైన, సామాజిక పనులకు ఎలాంటి భంగం కలుగకుండా, ఈ ఉపదేశాన్ని ఆచరించటానికి ఒక చక్కటి పద్ధతి ఉంది. మన రోజువారీ దిన చర్యలో, కొంత సమయాన్ని సాధన అంటే ఆధ్యాత్మిక అభ్యాసానికి కేటాయించవచ్చు; అంటే మనం ప్రాపంచిక గందరగోళం లేని ఒక ఏకాంత ప్రదేశంలో ఉండాలి. ప్రాపంచికత్వం నుండి పూర్తిగా విడివడి, మన మనస్సుని పరిశుద్ధి చేసుకోవటానికి మరియు భగవంతునిపై కేంద్రీకరించటానికి 'సాధన' చేయాలి. ఈ విధంగా రోజుకి ఒకటి లేదా రెండు గంటలు అభ్యాసం చేస్తే, ప్రాపంచిక పనులలో నిమగ్నమై ఉన్నా, దాని ఫలం రోజంతా ఉంటుంది. ఈ విధంగా, ఏకాంతంలో రోజువారీ సాధనా ద్వారా సంపాదించుకున్న ఉన్నతమైన ఆధ్యాత్మిక స్పృహని కాపాడుకోవచ్చు.