ప్రశాంతాత్మా విగతభీః బ్రహ్మచారివ్రతే స్థితః ।
మనః సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసీత మత్పరః ।। 14 ।।
ప్రశాంత — ప్రశాంతమైన; ఆత్మా — మనస్సు; విగత-భీః — నిర్భయముగా; బ్రహ్మచారి-వ్రతే — బ్రహ్మచర్య వ్రతములో; స్థితః — స్థితుడై; మనః — మనస్సు; సంయమ్య — నియంత్రణలో ఉంచుకొని; మత్-చిత్తః — నా పై ధ్యానం చేయుము; యుక్తః — నిమగ్నమై; ఆసీత — కూర్చుని; మత్-పరః — నన్నే పరమ లక్ష్యంగా చేసుకుని.
Translation
BG 6.14: ఈ విధంగా, ప్రశాంతతతో, భయరహితంగా, మరియు నిశ్చల మనస్సుతో మరియు బ్రహ్మచర్య వ్రతంలో దృఢ సంకల్పంతో, సావధానుడైన యోగి, నేనే పరమ లక్ష్యంగా, నా పై ధ్యానం చేయాలి.
Commentary
ధ్యానంలో సాఫల్యము సాధించటానికి బ్రహ్మచర్యం పాటించటం యొక్క ఆవశ్యకతని శ్రీ కృష్ణుడు ఉద్ఘాటిస్తున్నాడు. జంతువులలో, సంతానోత్పత్తి కోసం, లైంగిక కోరికలు దోహదపడుతాయి, మరియు జంతువులు ప్రధానంగా ఈ ప్రయోజనం కోసమే ఆ చర్యలో పాల్గొంటాయి. చాలా వరకు జీవజాతుల్లో, సంభోగానికి ఒక నిర్దుష్ట కాలం ఉంటుంది; జంతువులు ఈ క్రియలో యథేచ్చగా పాల్గొనవు. మనుష్యులకు ఉన్నతమైన బుద్ధి ఉండటం చేత, యథేచ్చగా ప్రవర్తించే స్వేచ్ఛ ఉండటం చేత, సంతానోత్పత్తి కోసం ఉన్న క్రియ ఒక విచ్చలవిడి భోగంగా మార్చివేయబడింది. కానీ, వేద శాస్త్రాలు బ్రహ్మచర్య ఆచరణకు చాలా ప్రాధాన్యతనిచ్చాయి. మహర్షి పతంజలి ఇలా పేర్కొన్నాడు:
బ్రహ్మచర్యప్రతిష్ఠాయామ్ వీర్య లాభః (యోగ సూత్రములు 2.38)
‘బ్రహ్మచర్యం పాటించటం వలన శక్తి చాలా వృద్ధి చెందుతుంది.’
ఆయుర్వేదం, భారతీయ వైద్య శాస్త్రం, దాని యొక్క అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల వలన, బ్రహ్మచర్యాన్ని ఏంతో కీర్తించింది. ధన్వంతరి యొక్క శిష్యులలో ఒకరు, తన సంపూర్ణ ఆయుర్వేద విద్యాభ్యాసం పూర్తయిన తరువాత తన గురువు గారి దగ్గరికి వచ్చి ఇలా అడిగాడు: ‘ఓ మహర్షీ, దయచేసి ఇప్పుడు నాకు ఆరోగ్య రహస్యాన్ని తెలియచేయుము.’ ధన్వంతరి ఇలా బదులిచ్చాడు: ‘ఈ వీర్యశక్తి నిశ్చయంగా ఆత్మయే. ఈ శక్తిని కాపాడుకోవటంలోనే ఆరోగ్య రహస్యం దాగి ఉంది. ఎవరైతే ఈ ముఖ్యమైన, అమూల్యమైన శక్తిని వృధా చేస్తారో, వారికి భౌతిక, మానసిక, నైతిక, మరియు ఆధ్యాత్మిక అభివృద్ధి ఉండదు.’
ఆయుర్వేద శాస్త్రం ప్రకారం, తమ వీర్యాన్ని (రేతస్సు) వృధా చేసుకునేవారు స్థిమితంలేని మరియు ఉద్విగ్నమైన 'ప్ర్రాణం' కలిగి ఉంటారు. వారు శారీరిక, మానసిక శక్తిని కోల్పోయి, తమ జ్ఞాపక శక్తిని, మనస్సుని మరియు బుద్ధిని బలహీనపరుచుకుంటారు. బ్రహ్మచర్యం పాటించటం వలన శారీరిక శక్తి పెరగటం, బుద్ధిలో స్పష్టత, మహోన్నత సంకల్పబలం, చక్కటి జ్ఞాపకశక్తి, మరియు చురుకైన ఆధ్యాత్మిక బుద్ధి కలుగుతాయి. అది కళ్ళలో తళుకు, బుగ్గల్లో మెరుపు కలుగచేస్తుంది.
బ్రహ్మచర్యం అంటే కేవలం శారీరిక భోగక్రియనే ఆపటం అని కాదు. 'అగ్ని పురాణం' ప్రకారం సంభోగానికి సంభందించిన ఈ ఎనిమిది రకాల క్రియలను నియంత్రించాలి: 1) దాని గురించి ఆలోచించటం. 2) దాని గురించి మాట్లాడటం, 3) దాని గురించి జోకులు వేయటం. 4) దానిని ఊహించటం. 5) దానిని కోరుకోవటం. 6) ఎవరినైనా దాని గురించి ప్రలోభ పెట్టటం. 7) దాని మీద ఆసక్తి ఉన్నవారిని ఆకర్షించటం. 8) దానిలో పాల్గొనటం. ఎవరినైనా బ్రహ్మచారి అనాలంటే వారు ఇవన్నిటినీ త్యజించాలి. ఈ విధంగా, బ్రహ్మచర్యం అంటే కేవలం లైంగిక మైథునం నుండి దూరంగా ఉండటమే కాకుండా, హస్తప్రయోగము, మరియు ఇంకా అన్ని లైంగిక వ్యవహారాల నుండి దూరంగా ఉండటం కూడా.
ఇంకా, ధ్యాన విషయం కేవలం భగవంతుడే ఉండాలి అని అంటున్నాడు శ్రీ కృష్ణుడు. ఈ విషయం మళ్ళీ వచ్చే శ్లోకంలో ఇంకోమారు చెప్పబడింది.