యుక్తాహారవిహారస్య యుక్తచేష్టస్య కర్మసు ।
యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖహా ।। 17 ।।
యుక్త — మితమైన; ఆహార — భుజించటం; విహారస్య — వినోదము; యుక్త చేష్టస్య కర్మసు — పనిలో సమతుల్యత; యుక్త — నియంత్రణతో ; స్వప్న-అవబోధస్య — నిద్ర మరియు మేల్కొని ఉండుట; యోగః — యోగము; భవతి — అగును; దుఃఖ-హా — దుఖముల వినాశకారి.
Translation
BG 6.17: కానీ ఎవరైతే తినటంలో మరియు వినోదాలలో మితంగా ఉంటారో, పనిలో సమతుల్యతతో, నిద్రలో క్రమబద్ధతతో ఉంటారో, వారు యోగాభ్యాసముతో అన్ని దుఃఖములను ఉపశమింపచేయవచ్చు.
Commentary
యోగం అంటే ఆత్మ భగవంతునితో ఎకమవ్వటమే. యోగమునకు వ్యతిరేకమైనది భోగము, అంటే ఇంద్రియ సుఖాలలో నిమగ్నమవ్వటం. భోగాలలో నిమగ్నమవ్వటం శరీరం యొక్క సహజ సూత్రాలను ఉల్లంఘిస్తుంది, మరియు అది రోగాలకి దారి తీస్తుంది. ఇంతకు క్రితం శ్లోకంలో చెప్పినట్టు, శరీరం రోగగ్రస్త మయితే, అది యోగాభ్యాసాన్ని కుంటుపడేస్తుంది. ఈ విధంగా, శారీరిక కార్యకలాపాలలో మితంగా ఉండి, యోగాభ్యాసము చేయటం వలన మనము అన్ని శారీరిక, మానసిక దుఃఖాల నుండి విముక్తి పొందవచ్చు, అని శ్రీ కృష్ణుడు పేర్కొంటున్నాడు.
ఇదే ఉపదేశం, శ్రీ కృష్ణుడి తరువాత రెండున్నర వేల సంవత్సరముల అనతరం, గౌతమ బుద్ధుడిచే మళ్లీ చెప్పబడింది; ఆయన తీవ్ర నిష్ఠలు మరియు ఇంద్రియ భోగముల మధ్య ఒక చక్కటి మధ్యేమార్గాన్ని సూచించాడు. ఈ విషయంపై ఒక అధ్బుతమైన కథ ఉంది:
జ్ఞానోదయం కాకముందు గౌతమ బుద్ధుడు ఓసారి తినటం, త్రాగటం మానివేసి, ధ్యానంలో కూర్చున్నాడు అని చెప్తారు. కానీ, కొద్ది రోజులు ఇలా అభ్యాసం చేసిన తరువాత, పోషణ లేకపోవటం అతనిని బలహీనంగా మరియు తలతిరుగుతున్నట్లుగా చేసింది, దీనితో ఆయనికి ధ్యానంలో మనస్సుని నిలకడగా ఉంచటం అసాధ్యమయింది. అదే సమయంలో, కొంతమంది గ్రామీణ మహిళలు అటుగా వెళ్ళటం జరిగింది. వారు దగ్గరి నదిలో నీటిని కుండల్లో నింపుకొని తమ తలపై కుండలను మోసుకెల్తూ, పాట పాడుకుంటూ వెళ్తున్నారు. ఆ పాటకి అర్థం ఇలా ఉంది: ‘తాన్పురా (తంబూరా) యొక్క తీగలను బిగించుము. కానీ, మరీ తీగలు తెగేట్టుగా బిగించకు.’ వారి మాటలు గౌతమ బుద్ధుడి చెవులలో ప్రవేశించాయి, మరియు బుద్ధుడు ఇలా ఆశ్చర్యపడ్డాడు, ‘ఈ ఏమీ చదువుకోని గ్రామీణ మహిళలు ఇంత పాండిత్యముతో కూడిన మాటలు పాడుతున్నారు. వాటిలో మానవ జాతికి అంతా ఒక చక్కటి సందేశం ఉంది. మనం కూడా మన శరీరాలని బిగించాలి (నిష్ఠగా అభ్యసించి), కానీ మరీ శరీరం పాడైపోయేంతగా కాదు.’
బెంజమిన్ ఫ్రాంక్లిన్, అమెరికా సంయుక్త రాష్ట్రాల జాతి పితలలో ఒకరు, స్వయం కృషితో ఎదిగినాడని ఎంతో గౌరవింపబడ్డాడు. తన వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవటానికి, ఇరవైవ ఏట నుండే, ఒక డయరీ రాసుకునేవాడు. పదమూడు విషయాలలో తను వృద్ధి చెందుతూ ఉండాలని తన పనితీరుని ఆ డయరీలో రాసుకునేవాడు. అందులో మొదటి విషయం ‘పరిమితంగా ఉండాలి: మరీ బద్దకంగా అయ్యేంతవరకూ తినకు; మరీ నిశాఎక్కే వరకూ తాగకు.’ (Temperance: Eat not to dullness; drink not to elevation).