Bhagavad Gita: Chapter 6, Verse 20

యత్రోపరమతే చిత్తం నిరుద్ధం యోగసేవయా ।
యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి ।। 20 ।।

యత్ర — ఎప్పుడైతే; ఉపరమతే — ఆంతర సుఖాన్ని రమించునో; చిత్తం — మనస్సు; నిరుద్ధం — నియంత్రించబడిన; యోగ-సేవయా — యోగ అభ్యాసము చేత; యత్ర — ఎప్పుడు; చ — మరియు; ఏవ — నిజముగా; ఆత్మనా — పవిత్రమైన మనస్సు ద్వారా; ఆత్మానం — ఆత్మ; పశ్యన్ — దర్శించుచూ; ఆత్మని — ఆత్మ యందే; తుష్యతి — సంతృప్తి గా ఉండును.

Translation

BG 6.20: ఎప్పుడైతే, మనస్సు, ప్రాపంచిక కార్యకలాపాల నుండి నిగ్రహింపబడి, యోగాభ్యాసము ద్వారా నిశ్చలంగా ఉండునో, అప్పుడు ఆ యోగి పరిశుద్ధమైన మనస్సు ద్వారా ఆత్మను దర్శించగలడు మరియు ఆంతర ఆనందంలో రమించును.

Commentary

ధ్యానం చేసే పద్ధతిని మరియు ధ్యానం యొక్క పరిపూర్ణ సిద్ధి స్థితిని వివరించిన పిదప, శ్రీకృష్ణుడు ఇక ఇప్పుడు, దాని పరిశ్రమ యొక్క ఫలితాలను తెలియపరుస్తున్నాడు. మనస్సు ఎప్పుడైతే శుద్ధి చేయబడుతుందో, అప్పుడు వ్యక్తి ఆత్మను శరీర-మనో-బుద్దుల కంటే వేరుగా తెలుసుకోగలుగుతాడు. ఉదాహరణకి, గ్లాసులో మురికి నీరు ఉంటే, దానిగుండా మనము చూడలేము. కానీ, ఆ నీటిలో పటిక వేస్తే, మురికి వేరైపోయి క్రిందికి దిగి, నీరు స్వచ్ఛంగా అయిపోతుంది. అదే ప్రకారంగా, మనస్సు మురికిగా ఉన్నప్పుడు, అది ఆత్మ దర్శనాన్ని తెలియకుండా చేస్తుంది; మరియు ఆత్మ యొక్క శాస్త్ర పరిజ్ఞానం, పుస్తకజ్ఞాన స్థాయిలోనే ఉండిపోతుంది. కానీ ఎప్పుడైతే, మనస్సు పవిత్రం అవుతుందో ఆత్మ అనేది అంతర్గత విజ్ఞానం ద్వారా నేరుగా అనుభవం లోనికి వస్తుంది.