ఆరురుక్షోర్మునేర్యోగం కర్మ కారణముచ్యతే ।
యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే ।। 3 ।।
ఆరురుక్షోః — ప్రారంభదశలో ఉన్నవారు; మునేః — మునికి; యోగం — యోగమునకు; కర్మ — ఫలాపేక్ష లేకుండా కర్మలు చేయటం; కారణం — కారణము; ఉచ్యతే — అందురు; యోగ-ఆరూఢస్య — యోగంలో ఉన్నత స్థాయి చేరుకున్నవారు; తస్య — వారి; ఏవ — నిజముగా; శమః — ధ్యానము; కారణం — కారణము; ఉచ్యతే — అంటారు.
Translation
BG 6.3: యోగంలో పరిపూర్ణత సాధించే యత్నంలో ఉన్న (ప్రారంభ-దశ) జీవాత్మకు ఫలాపేక్ష లేకుండా పని చేయటమే సాధనం అంటారు; యోగంలో ఉన్నత స్థాయి చేరుకున్న మునికి ధ్యానంలో ప్రశాంతతయే సాధనం అంటారు.
Commentary
3వ అధ్యాయ 3వ శ్లోకంలో, శ్రీ కృష్ణుడు, శ్రేయస్సు కోసం రెండు మార్గాలు - జ్ఞాన యోగము, కర్మ యోగము - ఉన్నాయని, చెప్పిఉన్నాడు. ఈ రెంటిలో కర్మ-యోగ మార్గమునే అనుసరించమని అర్జునుడికి సిఫారసు చేసాడు. మరల 5వ అధ్యాయ 2వ శ్లోకంలో, అదే సరియైన మార్గమని ఉద్ఘాటించాడు. అంటే మనం ఈ జీవితాంతం పనులు చేస్తూనే ఉండాలా? ఇలాంటి ప్రశ్న వస్తుందని ముందే ఊహించిన శ్రీ కృష్ణుడు, దీనికి పరిమితి విధించాడు. కర్మ యోగము ఆచరించినప్పుడు, అది అంతఃకరణ శుద్ధికి మరియు ఆధ్యాత్మిక జ్ఞాన పరిపక్వతకి దారి తీస్తుంది. కానీ, మనస్సు పవిత్రమైన తరువాత మరియు యోగంలో పురోగతి సాధించిన తరువాత మనము కర్మ యోగము విడిచి పెట్టి కర్మ సన్యాసము తీసుకోవచ్చు. ఇక భౌతిక ప్రాపంచిక కార్య కలాపాలతో ఏ ప్రయోజనం ఉండదు, మరియు ధ్యానమే సాధనమవుతుంది.
కాబట్టి, మనం అనుసరించే మార్గం మన అర్హతను బట్టే ఉంటుంది. శ్రీ కృష్ణుడు ఈ అర్హతకి కావలసిన యోగ్యతని ఈ శ్లోకంలో వివరిస్తున్నాడు. యోగ సాధనకి అకాక్షించే వారికి కర్మ యోగమే యుక్తమైనది; మరియు యోగసాధనలో ఉన్నతమైన స్థాయి చేరుకున్నవారికి, కర్మ సన్యాసమే ఎక్కువ అనుగుణమైనది.
'యోగం' అన్న పదం, లక్ష్యాన్ని మరియు లక్ష్యాన్ని చేరుకునే విధానానికి రెంటినీ సూచిస్తుంది. దాన్ని లక్ష్యము అని సూచించటానికి వాడినప్పుడు, యోగం అంటే ‘భగవంతునితో ఏకమవ్వటం.’ దాన్ని ఒక ప్రక్రియా విధానము అని సూచించటానికి వాడినప్పుడు, యోగం అంటే భగవంతునితో ఎకమవ్వటానికి 'మార్గము' అని అర్థం.
ఈ రెండవ సందర్భంలో, యోగం అంటే భగవంతుని చేరుకోవటానికి ఎక్కే నిచ్చెన. అన్నిటి కన్నా క్రింద మెట్టులో, జీవాత్మ ప్రాపంచికత్వంలో చిక్కుకొని, లౌకిక విషయాల పట్ల నిమగ్నమై ఉంటుంది. యోగమనే నిచ్చెన జీవాత్మను ఆ నిమ్నస్థాయి నుండి భగవంతునిలోనే ఎప్పుడూ స్థితమై ఉండే స్థాయికి తీసుకెళ్తుంది. ఆ నిచ్చెనకుండే మెట్లకు వేరువేరు పేర్లు ఉన్నాయి, కానీ యోగం అన్న పదం అన్నిటికీ వర్తిస్తుంది. 'యోగ-ఆరురుక్షు' అంటే అప్పుడే నిచ్చెన ఎక్కటం మొదలు పెట్టిన, భగవంతునితో సంయోగానికి కృషి చేస్తున్న సాధకులు. యోగ-ఆరూఢ అంటే నిచ్చెనపై ఉన్నతమైన స్థానంలో ఉన్నవారు అని.
మరైతే, యోగ శాస్త్రములో ఉన్నతమైన స్థాయిలో వ్యక్తి ఉన్నాడా లేదా అని తెలుసుకోవటం ఎలా? శ్రీ కృష్ణుడు తదుపరి వివరిస్తున్నాడు.