Bhagavad Gita: Chapter 6, Verse 33

అర్జున ఉవాచ ।
యోఽయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన ।
ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరామ్ ।। 33 ।।

అర్జున ఉవాచ — అర్జునుడు పలికెను; యః — ఏదైతే; అయం — ఈ యొక్క; యోగః — యోగ విధానము; త్వయా — నీ చేత; ప్రోక్తః — చెప్పబడెనో ; సామ్యేన — సమత్వము చే; మధు-సూదన — శ్రీ కృష్ణ, మధు అనే రాక్షసుడిని సంహరించిన వాడా; ఏతస్య — ఈ యొక్క; అహం — నేను; న పశ్యామి — చూడలేకున్నాను; చంచలత్వాత్ — చంచలమైనది కావున; స్థితిం — పరిస్థితి; స్థిరామ్ — నిలకడగా.

Translation

BG 6.33: అర్జునుడు పలికెను: ఓ మధుసూదనా, నీవు చెప్పిన ఈ యోగ విధానము, ఈ చంచలమైన మనస్సు వలన, నాకు ఆచరింపశక్యముకానిది మరియు అసాధ్యమైనది అనిపిస్తున్నది.

Commentary

అర్జునుడు ఈ శ్లోకాన్ని 'యోఽయం' , అంటే ‘ఈ యోగ విధానము’, అంటే 6.10వ శ్లోకం నుండి చెప్పిన పద్దతిని సూచిస్తూ, మాట్లాడుతున్నాడు. యోగములో పరిపూర్ణసిద్ధి కొరకు మనము తప్పకుండా ఈ క్రిందివి ఖచ్చితంగా చేయాలని శ్రీ కృష్ణుడు చెప్పి ఉన్నాడు:

– ఇంద్రియములను నిగ్రహించుము

– అన్ని కోరికలను త్యజించుము

– మనస్సుని భగవంతుని పైనే నిమగ్నం చేయుము

– ఆయననే అచంచలమైన మనస్సుతో స్మరించుము

– అందరినీ సమ దృష్టితో చూడుము

అర్జునుడు, తాను విన్న దాని గురించి నిర్మొహమాటముగా, అది ఆచరింపశక్యము కాదేమో అని, తన సందేహాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఈ పైన చెప్పినవేవీ మనస్సుని నియంత్రించకుండా సాధ్యము కావు. మనస్సు చంచలముగా ఉంటే, ఈ యోగ విషయాలన్నీ కూడా అసాధ్యమే అవుతాయి.