Bhagavad Gita: Chapter 6, Verse 36

అసంయతాత్మనా యోగో దుష్ప్రాప ఇతి మే మతిః ।
వశ్యాత్మనా తు యతతా శక్యోఽవాప్తుముపాయతః ।। 36 ।।

అసంయత-ఆత్మనా — మనస్సు అదుపులో లేనివానికి; యోగః — యోగము; దుష్ప్రాపః — కష్టతరమైనది; ఇతి — ఈ విధంగా; మే — నా యొక్క; మతిః — అభిప్రాయము; వశ్య-ఆత్మనా — మనస్సు నియంత్రణలో ఉన్నవానికి; తు — కానీ; యతతా — గట్టిగా ప్రయత్నించే వాడు; శక్యః — సాధ్యమే; అవాప్తుం — సాధించటానికి; ఉపాయతః — సరియైన పద్దతి ద్వారా.

Translation

BG 6.36: మనస్సు అదుపులో లేనివానికి యోగము కష్టతరమైనది. కానీ, మనస్సుని నిగ్రహించటం నేర్చుకున్నవారు, మరియు సరియైన పద్దతిలో పరిశ్రమ చేసేవారు, యోగములో పరిపూర్ణత సాధించవచ్చు. ఇది నా అభిప్రాయము.

Commentary

శ్రీ కృష్ణ పరమాత్మ ఇప్పుడు మనోనిగ్రహానికి మరియు యోగంలో సాఫల్యానికి ఉన్న సంబంధాన్ని తెలియచెప్తున్నాడు. అభ్యాసము మరియు వైరాగ్యముల ద్వారా మనస్సుకి కళ్ళెం వేయటం నేర్చుకోనివారు యోగాభ్యాసములో చాలా కష్టాలని ఎదుర్కుంటారు, అని అంటున్నాడు. కానీ, మనస్సుని నిరంతర ప్రయత్నం ద్వారా తమ నియంత్రణలోకి తెచ్చుకున్న వారు సరియైన పద్దతిని అవలంబించటం ద్వారా విజయాన్ని సాధించవచ్చు. ఈ నిర్దుష్ట పద్దతి 6.10వ శ్లోకం నుండి 6.32వ శ్లోకం వరకు ఆయనచే విశదీకరించబడింది. ఇంద్రియములను నిగ్రహించటం, కోరికలను త్యజించటం, మనస్సుని భగవంతునిపైన మాత్రమే కేంద్రీకరించటం, అచంచలమైన మనస్సుతో ఆయన గురించే తలంచటం, మరియు అందరినీ సమదృష్టి తో చూడటం అనే విషయములతో 6.33వ శ్లోకంలో ఇది సంక్షిప్తముగా చెప్పబడింది.

ఈ ఉపదేశం, మనస్సుని అదుపు చేయలేని సాధకుని గురించి ఒక సందేహాన్ని అర్జునుడి మనస్సులో సృష్టించింది; అదే విషయాన్ని ఇప్పుడు శ్రీ కృష్ణుడిని అడుగుతున్నాడు.