ప్రయత్నాద్యతమానస్తు యోగీ సంశుద్ధకిల్బిషః ।
అనేకజన్మసంసిద్ధః తతో యాతి పరాం గతిమ్ ।। 45 ।।
ప్రయత్నాత్ — కఠిన కృషితో; యతమానః — పరిశ్రమిస్తూ; తు — మరియు; యోగీ — ఒక యోగి; సంశుద్ధ — పరిశుద్ధుడై; కిల్బిషః — ప్రాపంచిక కోరికల నుండి; అనేక జన్మ — చాలా చాలా జన్మల అనంతరం; సంసిద్ధః —పరిపూర్ణ సిద్ధిని సాధించును; తతః — అప్పుడు; యాతి — పొందును; పరాం — అత్యున్నత; గతిమ్ — గతి.
Translation
BG 6.45: అనేక పూర్వ జన్మల నుండి సంపాదించుకుంటూ వచ్చిన యోగ్యతలతో, ఎప్పుడైతే ఈ యోగులు మనఃపూర్వకంగా మరింత పురోగతి కోసం శ్రమిస్తారో, అప్పుడు వారు ప్రాపంచిక కోరికల నుండి పవిత్రమై (స్వేచ్ఛ పొంది), ఈ జన్మ లోనే సిద్ధి (పరిపూర్ణత) పొందుతారు.
Commentary
ఎన్నో పూర్వ జన్మలలో ఆర్జించిన అభ్యాసం, ఆధ్యాత్మిక పురోగతి కొరకు, చక్కటి వీచేగాలిలా సహకరిస్తుంది. పూర్వజన్మ నుండి కొనసాగిస్తూ, ఈ జన్మలో యోగులు, ఈ వీచేగాలిలో, తమ పరిశ్రమ రూపంలోని, తెరచాపని ఎగిరేస్తారు. శ్రీ కృష్ణుడు ‘ప్రయత్నాద్ యతమానస్తు’ అన్న పదాలు వాడుతున్నాడు, అంటే, ‘ఇంతకు పూర్వం కంటే ఎక్కువ పరిశ్రమ చేయటం.’ 'తు' అన్న పదం - వారి ప్రస్తుత పరిశ్రమ, ఇంతకు క్రితం, వారు ప్రయాణాన్ని పూర్తి చేయలేకపోయిన జన్మల పరిశ్రమ కంటే తీవ్రంగా ఉంటుంది - అని సూచిస్తుంది.
ఈ విధంగా, వారు పూర్వ జన్మల నుండీ వచ్చిన ఉరవడిని సహాయంగా తీసుకుంటూ, ఈ అనుకూల పవనాలతో లక్ష్యం వైపుగా తీసుకు వెళ్ళబడుతారు. చూసేవారికి, మెత్తం ప్రయాణాన్ని వీరు ఈ జన్మలోనే పూర్తి చేసినట్టు ఉంటుంది, కానీ శ్రీ కృష్ణుడు అంటున్నాడు: 'అనేకజన్మసంసిద్ధః', ‘యోగములో పరిపూర్ణ సిద్ధి అనేది అనేక జన్మల అభ్యాసంతో ఆర్జించిన ఫలితము.’ అని.