Bhagavad Gita: Chapter 6, Verse 5

ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ।
ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః ।। 5 ।।

ఉద్ధరేత్ — ఉద్ధరించుకోనుము; ఆత్మనా — మనస్సు ద్వారా; ఆత్మానం — నిన్ను నీవే; న — కాదు; ఆత్మానం — నిన్ను; అవసాదయేత్ — పతనం చేసుకొనుట; ఆత్మా — మనస్సు; ఏవ — ఖచ్చితంగా; హి — నిజముగా; ఆత్మనః — మన యొక్క; బంధు: — మిత్రుడు; ఆత్మా — మనస్సు; ఏవ — నిజముగా; రిపుః — శత్రువు; ఆత్మనః — మన యొక్క.

Translation

BG 6.5: నీ మనస్సు యొక్క శక్తిచే నిన్ను నీవు ఉద్దరించుకోనుము, అంతేకాని పతనమైపోవద్దు. ఎందుకంటే మనస్సే మన మిత్రుడు మరియు మనస్సే మన శత్రువు అవ్వచ్చు.

Commentary

మన ఉన్నతికి లేదా పతనానికి మనమే కారణం. మన కోసం వేరెవ్వరూ భగవత్ ప్రాప్తి మార్గాన్ని ప్రయాణించటం కుదరదు. గురువులు, మహాత్ములు మనకు మార్గం చూపుతారు, కానీ మనమే స్వయంగా ఆ పథంలో ప్రయాణించాలి. హిందీలో ఒక నానుడి ఉంది. ‘ఏక్ పేడా దో పక్షీ బైఠే, ఏక్ గురు ఏక్ చేలా, అపనీ కరనీ గురు ఉతరే, అపనీ కరనీ చేలా’, అంటే, ఒక చెట్టు మీద రెండు పక్షులున్నాయి- ఒకటి గురువు మరియు ఇంకోటి శిష్యుడు. గురువు తన ప్రయత్నంతో తానే దిగివస్తాడు, శిష్యుడు కూడా తన స్వంత కర్మల వల్లనే దిగి రాగలుగుతాడు.’

ఈ జన్మకు ముందు మనకు అనంతమైన జన్మలు గడిచిపోయాయి, మరియు భగవత్ ప్రాప్తి నొందిన మహాత్ములు ఈ భూమిపై ఎల్లప్పుడూ ఉన్నారు. ఏ సమయంలో అయినా ఈ లోకంలో అటువంటి మహాత్ములు లేకపోతే, ఆ సమయపు జీవులు భగవత్ ప్రాప్తి పొందలేరు. మరైతే వారు భగవంతుడిని పొందే తమ జీవిత లక్ష్యాన్ని ఎలా సాధిస్తారు? అందుకే, దేవుడు, చిత్తశుద్ధిగల సాధకులకు దిశానిర్దేశం చేయటానికి, మానవ జాతికి స్ఫూర్తినివ్వటానికి, భగవత్-ప్రాప్తి నొందిన మహాత్ములు ప్రతి కాలంలో ఉండేట్టుగా చూసుకుంటాడు. కాబట్టి అనంతమైన పూర్వ జన్మలలో చాలాసార్లు భగవత్ ప్రాప్తి నొందిన మహాత్ములను కలినే ఉంటాము, అయినా భగవత్ ప్రాప్తి పొందలేక పోయాము. అంటే సరియైన మార్గదర్శకత్వం లేకపోవటం సమస్య కాదు, దానిని స్వీకరించటం పోవటం లేదా దానిని ఆచరించక పోవటమే సమస్య. మనం పురోగతి సాధించే ముందు, మన ప్రస్తుత ఉన్న అధ్యాత్మిక స్థాయికి, లేదా అది లేకపోవటానికి మనమే బాధ్యులం అని ఒప్పుకోవాలి. అప్పుడే మనకు, మన ప్రస్తుత పురోగతి స్థాయి మన ప్రయంత్నం ద్వారానే సాధించాము, కాబట్టి మరింత పరిశ్రమ ద్వారా మనలను ఇంకా ఉద్ధరించుకోవచ్చు, అన్న ధైర్యం వస్తుంది.

ఆధ్యాత్మిక పురోగతి పథంలో ప్రతికూలతలు ఎదురైనప్పుడు, ఇతరులు మనకు తీవ్ర అన్యాయం చేసారు అని, వారే మనకు శత్రువులని ఫిర్యాదు చేస్తాము. కానీ, మన మనస్సే మన ప్రధాన శత్రువు. పరిపూర్ణ సిద్ధి కోసం మనం చేసే ప్రయత్నాలకు అవరోధం కల్పించే వినాశకారి అదే. ఒక పక్క, జీవాత్మ యొక్క గొప్ప శ్రేయిభిలాషిలా, మనకు అత్యంత శ్రేయస్సుని కలుగ చేసే శక్తి, మనస్సుకి, ఉంది; మరో పక్క, మన ప్రగాఢ శత్రువుగా, మనకు తీవ్ర హాని చేసే శక్తి కూడా దానికి ఉంది. నియంత్రించబడిన మనస్సు ఏంతో మేలు కలుగ చేయవచ్చు, అదేవిధంగా, నిగ్రహింపబడని మనస్సు తుచ్ఛమైన తలంపులతో జీవాత్మను పతనానికి గురి చేయవచ్చు.

ఒక మిత్రునిగా ఉపయోగించుకోవటానికి, మనస్సు యొక్క పనితీరుని అర్థం చేసుకోవటం ముఖ్యం. మన మనస్సు నాలుగు స్థాయిల్లో పని చేస్తుంది.

మనస్సు: అది ఆలోచనలు, భావోద్వేగాలు, కోరికలు, ఇష్టాలు, మరియు ద్వేషాలను సృష్టిస్తుంది.

బుద్ధి: ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం దీని పని. ఇది అర్థం చేసుకుంటుంది, నిర్ణయిస్తుంది, మరియు ఏది మంచి ఏది చెడు అని వివేచిస్తుంది.

చిత్తము: ఇది జ్ఞాపకాల మరియు అనుభవాల నిక్షేప స్థానం. ఏదేని ఒక వస్తువు లేదా వ్యక్తితో అనుబంధం ఏర్పరుచుకునేట్టు చేస్తుంది.

అహంకారము: ‘నేను’ అన్న భావన ఇది. శరీరానికి సంబంధించిన వాటితో స్వీయ-గుర్తింపును కలుగచేసి, గర్వాన్ని సృష్టిస్తుంది.

ఇవన్నీ నాలుగు వేర్వేరు అస్థిత్వాలు కావు. ఇవి ఒకే మనస్సు యొక్క నాలుగు నిర్వహణా స్థాయిలు. కాబట్టి వీటన్నిటినీ కలిపి మనస్సు అని చెప్పవచ్చు లేదా మనస్సు-బుద్ధి, లేదా మనస్సు-బుద్ధి-అహంకారము, లేదా మనస్సు-బుద్ధి-చిత్తము-అహంకారము అనవచ్చు. ఇవన్నీ ఒకే దానిని సూచిస్తాయి.

'అహంకారము' (ఇగో , ego) అన్న పదం ఇక్కడ ఫ్రూడియన్ మనస్తత్వశాస్త్రం (Freudian psychology) లో చెప్పిన దానికన్నా వేరైనది. సిగ్మండ్ ఫ్రాయిడ్ (1856 – 1939), అనే ఆస్ట్రియాకు చెందిన నాడీశాస్త్ర నిపుణుడు, మనస్సు ఏ విధంగా పని చేస్తుందో అన్న విషయంపై, మనస్తత్వశాస్త్రం యొక్క మొదటి సూత్రాన్ని, ప్రతిపాదించాడు. ఆయన సిద్ధాంతం ప్రకారం, అహంకారము అనేది 'నిజమైన నేను'; అది వశములోలేని/తీరని కోరికలకు (Id), బాల్యంలో నేర్చుకున్న విలువలకు (Superego) మధ్య ఉన్న అంతరాన్ని పూర్తిస్తుంది.

వైదిక వాఙ్మయంలో చాలా చోట్ల, సందర్భాన్ని బట్టి మనస్సుని ఈ నాలుగు రకాల అర్థాల్లో వాడుతారు. ఇవన్నీ ఒకే అంతర్గత ఉపకరణాన్ని సూచిస్తున్నాయి, వీటిని కలిపి అంతఃకరణ లేదా మనస్సు అంటారు. ఉదాహరణకి:

పంచదశీ, ఈనాలుగింటిని కలిపి మనస్సు అంటుంది, ఇదే భౌతిక బంధానికి మూల కారణం అని పేర్కొంటుంది.

భగవద్గీతలో, శ్రీ కృష్ణుడు ఎన్నో సార్లు మనస్సు, బుద్ధి రెండు భిన్నమైనవని అని, మరియు ఆ రెండింటినీ కూడా భగవంతునికి శరణాగతి చేయాలి అని అంటున్నాడు.

యోగ దర్శనములో, ప్రకృతి యొక్క వివిధ మూలతత్త్వములను విశ్లేషించేటప్పుడు, అది మూడు అస్తిత్వాలను పేర్కొంటుంది: మనస్సు, బుద్ధి, మరియు అహంకారము.

శంకరాచార్యులు, ఆత్మకు అందుబాటులో ఉన్న సూక్ష్మ ఉపకరణాలను విశదీకరిస్తూ, మనస్సుని నాలుగు రకాలుగా విభజించారు - మనస్సు, బుద్ధి, చిత్తము, మరియు అహంకారము.
 

కాబట్టి, శ్రీ కృష్ణుడు, మనము మనస్సుని ఉపయోగించుకొని ఆత్మ ఉద్ధరణ చేసుకోవాలి అన్నప్పుడు, దాని అర్థం ఏమిటంటే, ఉన్నత మనస్సుని ఉపయోగించుకొని, నిమ్న మనస్సుని ఉద్ధరించుకోవాలి, అని. వేరే మాటల్లో చెప్పాలంటే, బుద్ధిని ఉపయోగించుకొని మనస్సుని నియంత్రించాలి. ఇది ఎలా చేయాలి అన్న విషయాన్ని 2.41 నుండి 2.44 శ్లోకాలలో మరియు 3.43 శ్లోకంలో విశదంగా వివరింపబడింది.