Bhagavad Gita: Chapter 7, Verse 1

శ్రీ భగవానువాచ ।
మయ్యాసక్తమనాః పార్థ యోగం యుంజన్ మదాశ్రయః ।
అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు ।। 1 ।।

శ్రీ భగవాన్ ఉవాచ — భగవంతుడు ఇలా పలికెను; మయి — నా పట్ల; ఆసక్త-మనాః — ఆసక్తి కలిగిన మనస్సు తో; పార్థ — అర్జున, ప్రిథ పుత్రుడా; యోగం — భక్తి యోగము; యుంజన్ — అభ్యాసము చేస్తూ; మద్-ఆశ్రయః — నన్ను శరణుజొచ్చి ; అసంశయం — సందేహము లేకుండా; సమగ్రం — పూర్తిగా; మాం — నన్ను; యథా — ఎట్లా; జ్ఞాస్యసి — నీవు తెలుసుకొనగలవో; తత్ — అది; శృణు — వినుము.

Translation

BG 7.1: భగవంతుడు పలికెను: ఓ అర్జునా, నాయందు మాత్రమే మనస్సు నిలిపి, భక్తి యోగ అభ్యాసము ద్వారా నాకు శరణాగతి చేసి నీవు ఎట్లా నన్ను సంపూర్ణముగా, సందేహానికి తావు లేకుండా తెలుసుకొనగలవో, ఇప్పుడు వినుము.

Commentary

మనస్సు తన యందు అనన్య భక్తితో లగ్నం చేసి భక్తితో తనను సేవించువారు, యోగులలో శ్రేష్ఠులు అని 6వ అధ్యాయం ముగింపులో, శ్రీ కృష్ణుడు చెప్పి ఉన్నాడు. సహజంగా ఈ ప్రతిపాదన కొన్ని ప్రశ్నలకు దారితీయవచ్చు: భగవంతుడిని గూర్చి తెలుసుకునే మార్గం ఏమిటి? ఆయనపై ధ్యానం చేయటం ఎలా? భక్తుడు భగవత్ ఆరాధన ఎలా చేయాలి? అర్జునుడు ఈ ప్రశ్నలను అడగకపోయినా, తన కరుణచే, భగవంతుడు ముందే ఊహించి చెప్పటం ప్రారంభిస్తున్నాడు. ఆయన 'శృణు' అన్న పదం వాడాడు, అంటే ‘వినుము’ అని అర్థం, అంతేకాక మద్-ఆశ్రయః అని కూడా లక్షణం చేర్చాడు అంటే ‘నీ మనస్సు నాయందే లగ్నంచేసి’ అని అర్థం.