Bhagavad Gita: Chapter 7, Verse 10

బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనమ్ ।
బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్తేజస్వినామహమ్ ।। 10 ।।

బీజం — విత్తనము; మాం — నేను; సర్వ-భూతానాం — సమస్త ప్రాణులకు; విద్ధి — తెలుసుకొనుము; పార్థ — అర్జునా, ప్రిథ పుత్రుడా; సనాతనమ్ — నిత్య శాశ్వతమైన; బుద్ధిః — బుద్ధి; బుద్ధి-మతాం — తెలివైనవారిలో (బుద్ధిమంతులలో); అస్మి — నేను; తేజః — తేజస్సు; తేజస్వినామ్ — తేజోవంతులలో; అహమ్ — నేను.

Translation

BG 7.10: ఓ అర్జునా, సమస్త ప్రాణులకూ సనాతనమైన మూల బీజము నేనే అని తెలుసుకొనుము. ప్రజ్ఞావంతులలో ప్రజ్ఞను నేనే, తేజోవంతులలో తేజస్సుని నేనే.

Commentary

కారణమే కార్యమునకు బీజము అని చెప్పబడుతుంది. కాబట్టి, సముద్రమే మేఘములకు బీజం అని చెప్పవచ్చును; మేఘములే వర్షానికి బీజము. సమస్త ప్రాణుల సృష్టికి తానే బీజము అని శ్రీ కృష్ణుడు అంటున్నాడు.

జగత్తులో ఉన్న సమస్త పదార్థమూ భగవంతుని శక్తి స్వరూపమే కాబట్టి, మహోన్నత వ్యక్తులలో కనిపించే అద్భుతమైన గుణాలు, వారిలో వ్యక్తమైన భగవంతుని శక్తులే. తెలివికలవారు తమ ఆలోచన మరియు ఉపాయములలో ఉన్నతమైన ప్రజ్ఞ ప్రదర్శిస్తారు. వారి ఆలోచనలు తేజోవంతముగా, విశ్లేషణాత్మకంగా చేసే సూక్ష్మ శక్తి, తనే అని భగవంతుడు అంటున్నాడు.

ఎప్పుడైనా ఎవరైనా ఈ ప్రపంచాన్ని మెరుగుపరిచే విధంగా అత్యద్భుతమైన ప్రతిభా పాటవాలని ప్రదర్శించినప్పుడు, భగవంతుని శక్తి వారి ద్వారా ఆవిధంగా పనిచేస్తున్నట్టు మనం తెలుసుకోవాలి. విలియం షేక్స్పియర్ ఆంగ్ల సాహిత్యంలో తిరుగులేని తేజోవంతమైన ప్రజ్ఞని ప్రదర్శించాడు, ఈ నాటికి కూడా అంతగొప్ప సాహిత్యం లేదు. బహుశా, ప్రపంచంలో ఒక ప్రధాన భాషైన ఆంగ్ల భాష సాహిత్యాన్ని మరింత ఇనుమడింపచేయటానికి భగవంతుడే ఆయన బుద్ధిని ప్రేరేపించి ఉండవచ్చు. బ్రిటిష్ సామ్రాజ్యం యొక్క ప్రయోజనం ఏమిటంటే ప్రపంచాన్ని ఒక్క భాషతో ఏకీకృతం చేయటమే, అని స్వామీ వివేకానంద అన్నాడు. విండోస్ ఆపరేటింగ్ సిస్టంని, విపణిలో తొంభై శాతం వాటాతో అగ్రగామిగా చేయటానికి బిల్ గేట్స్ ఏంతో వ్యాపార తెలివిని ప్రదర్శించాడు. ఇదే గనక జరగక ఉండి ఉంటే, ప్రపంచం మొత్తం ఉన్న కంప్యూటర్స్ లో ఎన్నెన్నో ఆపరేటింగ్ సిస్టంలు ఉండి ఉండేవి; దీనితో చాలా గందర గోళం అయిఉండేది. బహుశా, సునాయాస సమాచార మార్పిడి కోసం, ప్రపంచంలో ఒక ప్రధాన ఆపరేటింగ్ సిస్టం ఉండాలని భగవంతుడు సంకల్పించాడో ఏమిటో, ఆయన ఒక వ్యక్తి యొక్క ప్రజ్ఞని ఈ పని కోసం పెంపొందించాడు.

మహాత్ములు, సహజంగానే, తమ పని యొక్క అందాన్ని, ప్రజ్ఞను మరియు జ్ఞానాన్ని భగవత్ కృపకే ఆపాదించారు. మహర్షి తులసీదాసు ఇలా అన్నాడు:

న మైఁ కియా న కరి సకూఁ, సహిబ కర్తా మోర్
కరత కరావత ఆప హైఁ, తులసీ తులసీ శోర్

‘నేను కాదు రామాయణం రాసినది, నాకు రాసే శక్తి కూడా లేదు. ఇది చేసేవాడు భగవంతుడే. ఆయనే నా పనులు నిర్దేశిస్తాడు, నా ద్వారా పనిచేస్తాడు, కానీ, ప్రపంచం తులసీదాసు చేస్తున్నాడు అనుకుంటుంది.’ ఇక్కడ, శ్రీ కృష్ణుడు స్పష్టంగా చెప్పేదేమిటంటే, ప్రజ్ఞావంతులలో ప్రజ్ఞ తనే మరియు తెలివికలవారిలో తెలివి తానే, అని.