న మాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః ।
మాయయాపహృతజ్ఞానా ఆసురం భావమాశ్రితాః ।। 15 ।।
న — కాదు; మాం — నాకు; దుష్కృతినః — పాపపు పనులు చేసేవారు; మూఢాః — మూఢులు; ప్రపద్యంతే— శరణాగతి చేసెదరు; నర-అధమాః — సోమరితనంతో తన నిమ్న స్థాయి స్వభావాన్ని అనుసరించే వాడు; (అధములు); మాయయా — భగవంతుని భౌతిక శక్తి చే; అపహృత జ్ఞానాః — మోహము/భ్రమకు లోనైన బుద్ధి తో; ఆసురం — ఆసుర (రాక్షస); భావం — స్వభావము; ఆశ్రితాః — ఆశ్రయించెదరు.
Translation
BG 7.15: నాలుగు రకాల మనుష్యులు నాకు శరణాగతి చేయరు — జ్ఞానము లేని వారు, నన్ను తెలుసుకునే సామర్థ్యం ఉన్నా సోమరితనంతో తమ నిమ్న స్థాయి స్వభావాన్ని అనుసరించేవారు, బుద్ధి భ్రమకు గురైనవారు, మరియు ఆసురీ ప్రవృత్తి కలవారు.
Commentary
భగవంతునికి శరణాగతి చేయని నాలుగు రకాల మనుష్యుల గురించి శ్రీ కృష్ణుడు ఇక్కడ చెప్తున్నాడు:
1) అజ్ఞానులు. వీరు ఆధ్యాత్మిక జ్ఞానం లేని వారు. వారు తాము నిత్యసనాతన ఆత్మలము, అన్న నిజ స్వరూపాన్ని ఎరుగరు, జీవిత లక్ష్యం, భగవత్ ప్రాప్తి అని ఎరుగరు, ప్రేమయుక్త భక్తితో ఈశ్వరునికి శరణాగతి చేసే ప్రక్రియ ఎరుగరు. జ్ఞానం లేకపోవటమే వారిని శరణాగతి చేయనివ్వదు.
2) సోమరితనంతో తమ నీచ స్థాయి స్వభావాన్నే అనుసరించేవారు. వీరు సాధారణ ఆధ్యాత్మిక జ్ఞానం కలిగి ఉంటారు మరియు ఏమి చేయ్యాలో వారికి తెలుసు. కానీ, వారు నిమ్న స్థాయి జడత్వంచే శరణాగతి చేయటానికి తగినంత పరిశ్రమ చెయ్యరు. ఆధ్యాత్మిక సూత్రాలను పాటించటం కోసం పరిశ్రమించటానికి అవరోధంగా ఉన్న ఈ సోమరితనం, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న పెద్ద అవరోధం. ఒక సంస్కృత నానుడి ఇలా పేర్కొంటున్నది:
ఆలస్య హి మనుష్యాణాం శరీరస్థో మహాన్ రిపుః
నాస్త్యుద్యమసమో బంధుః కృత్వా యం నావసీదతి
‘సోమరితనం/బద్దకము అనేది ఒక పెద్ద శత్రువు, అది మన శరీరంలోనే ఉంటుంది. పని అనేది మానవులకు మంచి స్నేహితుడు వంటిది, అది ఎన్నటికీ మనలని అధోగతి పాలుకానివ్వదు.’
3) బుద్ధి భ్రమకు లోనయినవారు. వీరు తమ బుద్ధి పట్ల ఎంతో గర్వంతో ఉంటారు. వీరు మహాత్ముల మరియు శాస్త్రాల ఉపదేశాలను విన్నా సరే వాటిని విశ్వాసంతో ఒప్పుకోవటానికి అంగీకరించరు. ఏదేమైనా, అన్ని ఆధ్యాత్మిక సత్యాలు వెంటనే అర్థం కావు. ప్రారంభంలో మనం ఈ మార్గంపై విశ్వాసం కలిగి ఉండాలి మరియు అభ్యాసం మొదలెట్టాలి, అప్పుడే మనం అంతర్గత విజ్ఞానం ద్వారా ఆ ఉపదేశాలను అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం కనిపించే వాటిని తప్ప వేరే వాటిని ఎవరైతే నమ్మరో, వారు ఇంద్రియములకు గోచరించని భగవంతునికి శరణాగతి చేయరు. శ్రీ కృష్ణుడు వీరిని మూడవ కోవలోని వారిగా పరిగణించాడు.
4) ఆసురీ స్వభావము కలవారు. ఈ కోవకు చెందిన వారికి భగవంతుడు ఉన్నాడని తెలుసు, కానీ దుర్మార్గంగా, ఈ లోకంలో భగవంతుని సంకల్పానికి పూర్తి విరుద్ధంగా పని చేస్తుంటారు. తెలియపరచబడిన భగవంతుని వ్యక్తిత్వాన్ని, తమ రాక్షస ప్రవృత్తి కారణంగా అసహ్యించుకుంటారు. ఎవరైనా ఆయన కీర్తిని పాడుతున్నా లేక ఆయన పట్ల భక్తిలో నిమగ్నమై ఉన్నా, వారు తట్టుకోలేరు. స్పష్టంగానే, ఇలాంటి వారు భగవంతునికి శరణాగతి చేయరు.