చతుర్విధా భజంతే మాం జనాః సుకృతినోఽర్జున ।
ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీ చ భరతర్షభ ।। 16 ।।
చతుః-విధా — నాలుగు రకాల; భజంతే — భజింతురు; మాం — నన్ను; జనాః — జనులు; సు-కృతినః — ధర్మ పరాయణులు; అర్జున — అర్జునా; ఆర్తః — ఆపద/దుఃఖం లో ఉన్నవారు; జిజ్ఞాసుః — జ్ఞానాన్ని అన్వేషించేవారు; అర్థ-అర్థీ — భౌతిక సంపత్తి ఆశించేవారు; జ్ఞానీ — జ్ఞానములో స్థితులై ఉన్నవారు; చ — మరియు; భరత-ఋషభ — భరత వంశీయులలో శ్రేష్ఠుడా, అర్జునా.
Translation
BG 7.16: ఓ భరతశ్రేష్ఠుడా, నాలుగు రకముల ధర్మ-పరాయణులు నా పట్ల భక్తితో నిమగ్నమౌతారు — ఆపదలో ఉన్నవారు, జ్ఞాన సముపార్జన కోసం ప్రయత్నించేవారు, ప్రాపంచిక వస్తువుల సంపాదన కోసం చూసేవారు, మరియు జ్ఞానము నందు స్థితులై ఉన్న వారు.
Commentary
తనకు శరణాగతి చేయని నాలుగు రకాల జనుల గురించి చెప్పిన శ్రీ కృష్ణుడు, ఇక ఇప్పుడు తనను ఆశ్రయించే వారి వర్గీకరణ చేస్తున్నాడు.
1) ఆపదల్లో/కష్టాల్లో ఉన్నవారు. కొంతమంది జనులకు, ప్రాపంచిక కష్టాలు ఎక్కువై పోయినప్పుడు, ఈ ప్రాపంచికత్వం వెంట పడి పరుగులు పెట్టటం వ్యర్థమనే నిశ్చయానికి వచ్చి, భగవంతుడినే ఆశ్రయించటం మేలు అని అనుకుంటారు. అదే ప్రకారంగా, ప్రాపంచిక ఆధారాలేవీ వారిని రక్షించలేకపోయినప్పుడు, వారు రక్షణ కోసం భగవంతుడిని ఆశ్రయిస్తారు. శ్రీ కృష్ణుడికి ద్రౌపది చేసిన శరణాగతి ఇటువంటి కోవకు చెందిన శరణాగతియే. కౌరవ సభలో ద్రౌపది వివస్త్ర చేయబడుతున్నప్పుడు, ఆమె మొదట తన భర్తలు రక్షిస్తారనుకున్నది. వారు ఎప్పుడైతే ఏమీ చేయలేక ఉత్తగా ఉండిపోయారో, సభలో ఉన్న ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, భీష్ముడు, మరియు విదురుడు వంటి పుణ్యాత్ములైన పెద్దల మీద, వారు కాపాడుతారని ఆశ పెట్టుకుంది. వారు కూడా రక్షించలేకపోయినప్పుడు, తన పళ్ళ మధ్యలో చీరను గట్టిగా పట్టుకుంది. ఈ స్థితి వరకు శ్రీ కృష్ణుడు ద్రౌపది రక్షణకు రాలేదు. చివరగా, దుశ్శాసనుడు ఆమె చీరను ఒక్కసారిగా గుంజినప్పుడు, అది ఆమె పంటి పట్టు నుండి జారి పోయింది. ఆ సమయంలో, ఆమెకు ఇక ఇతరుల రక్షణ మీద నమ్మకం పోయింది, ఇంకా తన సొంత బలాన్ని కూడా నమ్ముకోలేదు. ఆమె సంపూర్ణముగా శ్రీ కృష్ణుడికి శరణాగతి చేసింది, వెనువెంటనే ఆయన సంపూర్ణ రక్షణ అందించాడు. ఆమె చీరను ఇంకా ఇంకా పొడుగు పెంచటం ద్వారా అడ్డుకున్నాడు. దుశ్శాసనుడు ఎంత గుంజినా, ద్రౌపదిని వివస్త్రను చేయలేక పోయాడు.
2) జిజ్ఞాసువులు. (జ్ఞాన సముపార్జన కోసం ప్రయత్నించేవారు) కొంత మంది ఆధ్యాత్మికత, దేవుడి గురించి తెలుసుకోవాలనుకునే ఉత్సుకతతో భగవంతుడిని ఆశ్రయిస్తారు. కొందరు ఆధ్యాత్మిక క్షేత్రంలో మోక్షము/పరమానందము సాధించారు అని విని ఉండటం వలన, అదేంటో తెలుసుకోవాలని కుతూహలముతో ఉంటారు. కాబట్టి, వారి కుతూహలాన్ని తీర్చుకోవటం కోసం వారు భగవంతుడిని ఆశ్రయిస్తారు.
3) ప్రాపంచిక సంపత్తిని కోరేవారు. ఇంకొంత మంది తమకు ఏమి కావాలో స్పష్టతతో ఉంటారు, కానీ, భగవంతుడు మాత్రమే తమకు అవి ఇవ్వగలడని నమ్మకంతో ఉంటారు, అందుకే ఆయనను ఆశ్రయిస్తారు. ఉదాహరణకి, ధృవుడు, తన తండ్రి, మహారాజు ఉత్తానపాదుని కంటే ఉన్నతుడు అవ్వాలనే కోరికతో తన భక్తిని ప్రారంభించాడు. కానీ, అతని భక్తి పరిపక్వమై, భగవంతుని దర్శనం అయినతరువాత, అమూల్యమైన దివ్య ప్రేమ వైఢూర్యాలు ఉన్నవాని నుండి, తాను కోరుకున్నది, ఒక ముక్కలైన గాజు వక్కల వంటిది అని తెలుసుకున్నాడు. తదుపరి, భగవంతుడిని తనకు పవిత్రమైన నిస్వార్థ భక్తిని ప్రసాదించమని కోరాడు.
4) జ్ఞానులు. చివరగా కొందరు జీవులు, తాము భగవంతుని అణు-అంశములమని, తమ సనాతనమైన శాశ్వతమైన ధర్మం, భగవంతుడిని ప్రేమించి, సేవించటమే అన్న నిశ్చయానికి చేరుకుంటారు. వీరు నాల్గవ కోవకి చెందిన తన భక్తులని శ్రీ కృష్ణుడు అంటున్నాడు.