అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరామ్ ।
జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్ ।। 5 ।।
అపరా — నిమ్నమైన; ఇయం — ఈ యొక్క; ఇతః — దీనికంటే; తు — కానీ; అన్యాం — వేరైన; ప్రకృతిం — శక్తి; విద్ధి — తెలుసుకొనుము; మే — నా యొక్క; పరామ్ — ఉన్నతమైనది; జీవ-భూతాం — ప్రాణులు; మహా-బాహో — గొప్ప బాహువులు కలవాడా; యయా — ఎవరిచే; ఇదం — ఈ యొక్క; ధార్యతే — ఆధారము; జగత్ — భౌతిక జగత్తు.
Translation
BG 7.5: ఇది నాయొక్క తక్కువ స్థాయి శక్తి. కానీ, దానికి అతీతంగా, ఓ గొప్ప బాహువులు కల అర్జునా, నాకు ఒక ఉన్నతమైన శక్తి ఉంది. అదే జీవ శక్తి (ఆత్మ శక్తి), అది ఈ జగత్తు యందు ఉన్న జీవరాశులకు మూలాధారమైన జీవాత్మలను కలిగి ఉంటుంది.
Commentary
శ్రీకృష్ణుడు ఇక ఇప్పుడు పూర్తిగా భౌతిక శాస్త్ర పరిధి దాటి పోతున్నాడు. ఇంతకు క్రితం శ్లోకంలో పేర్కొన్న ఎనిమిది అంగముల ప్రకృతి తన తక్కువ స్థాయి భౌతిక శక్తి అని వివరిస్తున్నాడు. కానీ, ఉన్నది అది మాత్రమే కాదు. ఉన్నతమైన ఆధ్యాత్మిక శక్తి ఇంకోటి కూడా ఉంది, ఇది జడ పదార్థం కంటే పూర్తిగా అతీతమైనది. ఈ శక్తియే 'జీవ శక్తి', ఇది జగత్తు లోని సమస్త ఆత్మలను కలిగి ఉంటుంది.
జీవుడికి (జీవాత్మ), మరియు భగవంతుడికి మధ్య ఉన్న సంబంధం భారత దేశం యొక్క మహోన్నత తత్త్వవేత్తలచే ఎన్నో రకాల దృక్పథాల ద్వారా వివరించబడింది. అద్వైత తత్త్వవేత్తలు ఇలా పేర్కొంటారు : జీవో బ్రహ్మైవ నాపరః , ‘ఆత్మయే భగవంతుడు.’ కానీ, ఈ వాదన ఎన్నో జవాబు ఇవ్వలేని ప్రశ్నలను కలిగిస్తుంది:
– భగవంతుడు సర్వ శక్తిమంతుడు మరియు మాయ ఆయన అధీనంలో ఉండే శక్తి. జీవాత్మయే భగవంతుడయితే, అది మాయకి ఎలా వశం అయిపోయింది? మాయ అనేది భగవంతుని కంటే శక్తివంతమయినదా?
– మనందరికీ, ఆత్మ అజ్ఞానంచే బాధించబడుతున్నదని తెలుసు. కాబట్టి, దానికి భగవద్గీత వంటి శాస్త్రముల మరియు సత్పురుషుల ఉపదేశం యొక్క అవసరాన్ని అది గ్రహిస్తుంది. ఈ అజ్ఞానపూరితంగా ఉండే ఆత్మ సర్వజ్ఞుడైన భగవంతునిలా ఎలా అవుతుంది?
– భగవంతుడు జగత్తులో సర్వ వ్యాపి. ఇది వేదాల్లో పదే పదే చెప్పబడింది. ఒకవేళ ఆత్మయే భగవంతుడైతే ఆత్మ అన్ని సమయాల్లో అన్ని చోట్ల ఉండాలి; కాబట్టి మరణించిన పిదప స్వర్గానికి పోవటం లేదా నరకానికి పోవటం అన్న ప్రశ్న ఎక్కడిది?
– ఆత్మలు అసంఖ్యాకముగా ఉంటాయి, మరియు వాటన్నిటికీ తమతమ వ్యక్తిగత అస్తిత్వం ఉంది. కానీ, భగవంతుడు ఒక్కడే. ఇప్పుడు, ఆత్మయే దేవుడయితే, మరి ఎన్నెన్నో దేవుళ్ళు ఉండాలి.
ఈ విధంగా, ఆత్మయే భగవంతుడు అన్న అద్వైత తత్త్వవేత్తల ప్రతిపాదన, అర్థరహితమైనదిగా మనం గ్రహించవచ్చు. అదే సమయంలో, ద్వైత తత్త్వవేత్తలు ఆత్మ భగవంతుని కంటే వేరైనదిగా చెప్తారు. ఇది పైనున్న వాటిల్లో కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తుంది, కానీ, శ్రీ కృష్ణుడు ఈ శ్లోకంలో చెప్తున్న దానితో పోలిస్తే, అది అసంపూర్ణ అవగాహనే అవుతుంది. ఆత్మ భగవంతుని యొక్క ఆధ్యాత్మిక శక్తిలో భాగమే అని ఆయన అంటున్నాడు.
వేద శాస్త్రములు మనకు ఉపదేశించేది ఏంటంటే, భగవంతుడు సర్వోన్నత శక్తిమంతుడు, మరియు ఉన్నదంతా - ఆధ్యాత్మికమైనా, భౌతికమైనా - ఆయన నిమ్న స్థాయి లేదా ఆయన ఉన్నత స్థాయి శక్తులతో కూడుకున్నదే.
ఏక-దేశ-స్థితస్యాగ్నే:జ్యోత్స్నా విస్తారిణీ యథా
పరస్య బ్రహ్మణః శక్తి: తథేదమ్ అఖిలం జగత్
(విష్ణు పురాణం 1.22.53)
‘ఎలాగైతే సూర్యుడు ఒక చోటే ఉన్నా, కానీ, తన సూర్య కిరణములచే ఈ సౌర కుటుంబమంతా ఎలా వ్యాపిస్తాడో, అదే విధంగా ఉన్నది ఒక్కడే భగవంతుడు, తన అనంతమైన శక్తులచే ఈ మూడు లోకాలలో వ్యాపించి ఉంటాడు.’ చైతన్య మహాప్రభు అన్నాడు:
జీవ-తత్త్వ శక్తి, కృష్ణ-తత్త్వ శక్తిమాన్
గీతా-విష్ణుపురాణాది తాహాతే ప్రమాణ
(చైతన్య చరితామృతము, ఆది లీల, 7.117)
‘ఆత్మ అనేది భగవంతుని శక్తి స్వరూపము, మరియు ఆయనే సర్వోన్నత శక్తిమంతుడు.’
ఒక్కసారి, మనం ఆత్మ అనేది భగవంతుని శక్తి స్వరూపమని ఒప్పుకున్నప్పుడు, ఆ తదుపరి, సమస్త సృష్టి యొక్క అద్వైతం అవగతమవుతుంది. ఏదేని శక్తి, ఏకకాలంలో శక్తివంతుని కన్నా భేదమే మరియు అభేదమే. ఉదాహరణకి, అగ్ని మరియు దాని వేడిమి, వెలుగులను - అగ్ని కంటే వేరుగా చూడవచ్చు లేదా ఈ రెంటినీ ఒకటిగానే చూడవచ్చు. ఈ విధంగా మనం ఆత్మను, భగవంతుడిని - శక్తి, శక్తిమంతుడు అన్న దృక్పథం తో ఒక్కటి గానే చూడవచ్చు, కానీ, ఆత్మ, భగవంతుడు - లను వేరువేరుగా కూడా చూడవచ్చు, ఎందుకంటే శక్తి, శక్తిమంతుడు విభిన్న అస్తిత్వములే కాబట్టి.
శ్రీ కృష్ణుడు 7.4వ మరియు 7.5వ శ్లోకాలలో చెప్పినమాటని పొందుపరుస్తూ, జగద్గురు శ్రీ కృపాలుజీ మహారాజ్ గారు, తన భక్తి శతకంలో, ఈ విషయాన్ని చాలా చక్కగా వ్యక్తపరిచారు:
జీవు, మాయా దుఇ శక్తి హైఁ, శక్తిమాన్ భగవాన్
శక్తిహిఁ భేద్ అభేద్ భీ, శక్తిమాన్ తే జాన్
(భక్తి శతకము, 42వ శ్లోకము)
‘జీవాత్మ మరియు మాయ రెండూ కూడా భగవంతుని శక్తులే. కాబట్టి, అవి రెండూ భగవంతునికి అభేదమే మరియు భగవంతుని కంటే వేరు కూడా.’
శక్తులు మరియు శక్తిమంతుడు ఒకటే అన్న దృక్పథంతో, సమస్త జగత్తు కూడా భగవంతుని కంటే అభేదమే. ఈ విధంగా, సమస్త జగత్తు యదార్థ భగవత్ స్వరూపమే అని చెప్పబడింది.
సర్వం ఖల్విదం బ్రహ్మ (ఛాందోగ్య ఉపనిషత్తు 3.14.1)
‘సర్వం బ్రహ్మమే.’
ఈశావాస్యం ఇదం సర్వం (ఈశోపనిషత్తు 1)
‘ఈ జగత్తులో ఉన్నదంతా బ్రహ్మమే.’
పురుష ఏవేదం సర్వం (శ్వేతాశ్వతర ఉపనిషత్తు 3.15)
‘ఉన్నదంతా ఆ సర్వోన్నతమైన దివ్య మంగళ స్వరూపమే’
ఇవన్నీ వేద మంత్రములు కూడా, ఉన్నది ఒక్కడే భగవంతుడు, మరివేరే ఇతరమైనది ఏదీ లోకంలో లేదు అని పేర్కొంటున్నాయి. అదే సమయంలో, శక్తి మరియు శక్తిమంతుడుకి ఉన్న భిన్నత్వం పరంగా, ఈ ఏకత్వం లోనే బ్రహ్మాండమైన వైవిధ్యం కూడా ఉంది, అని మనం అర్థం చేసుకోవచ్చు. జీవాత్మ వేరు; పదార్థం వేరు; భగవంతుడు వేరు. పదార్థం అచేతనమైనది (జడమైనది), అదే సమయంలో ఆత్మ చైతన్యవంతమయినది, కానీ భగవంతుడు సర్వోత్కృష్ట చైతన్యవంతమై ఉండి, ఆయనే సమస్త పదార్థద్రవ్యములకు, ఆత్మలకు రెంటికీ మూల ఉత్పత్తిస్థానము. సృష్టిలో ఉన్న మూడు అస్తిత్వాల గురించి చాలా వేద మంత్రములు చెప్తున్నాయి:
క్షరం ప్రధానమమృతాక్షరం హరః
క్షరాత్మానావీషతే దేవ ఏకః
తస్యాభిధ్యానాద్ యోజనాత్ తత్త్వభావద్
భూయశ్చాంతే విశ్వమాయానివృత్తిః
(శ్వేతాశ్వతర ఉపనిషత్తు 1.10)
‘మూడు అస్తిత్వాలు ఉన్నాయి: 1) పదార్థము/ద్రవ్యము, ఇది నశించేది. 2) జీవాత్మలు, ఇవి నాశము లేనివి. 3) భగవంతుడు, ఈయన పదార్థము మరియు ఆత్మ లను కూడా నియంత్రించే వాడు. భగవంతుని పై ధ్యానం చేయటం వలన, ఆయనతో ఏకమవటం వలన మరియు ఆయనలా అవటం వలన, ఆత్మ, ఈ ప్రపంచపు మాయ నుండి స్వేచ్ఛ పొందుతుంది.’
అద్వైత మరియు ద్వైత మంత్రముల రెంటినీ కూడా వేదములు అర్థవివరణచేయటం మనం గమనించవచ్చు. జగద్గురు శ్రీ క్రుపాలు జీ మహారాజ్, ఈ ఆత్మ-పరమాత్మల ఏకకాల అచింత్య భేదాభేద వాదననే బలపరిచాడు.