అవ్యక్తాద్వ్యక్తయః సర్వాః ప్రభవంత్యహరాగమే ।
రాత్ర్యాగమే ప్రలీయంతే తత్రైవావ్యక్తసంజ్ఞకే ।। 18 ।।
అవ్యక్తాత్ — అవ్యక్తము నుండి; వ్యక్తయః — వ్యక్తమైనవి; సర్వాః — సమస్త; ప్రభవంతి — ఉద్భవించును; అహః-ఆగమే — బ్రహ్మ యొక్క పగలు అయినప్పుడు; రాత్రి-ఆగమే — బ్రహ్మ యొక్క రాత్రి ప్రారంభమైనప్పుడు; ప్రలీయంతే — విలీనమైపోతాయి; తత్ర — దానిలో; ఏవ — నిజముగా; అవ్యక్త-సంజ్ఞకే — ఆ అవ్యక్తము అనబడే దాంట్లోకి.
Translation
BG 8.18: బ్రహ్మ యొక్క పగలు ప్రారంభంకాగానే, సమస్త ప్రాణులు అవ్యక్త మూలం నుండి ఉద్భవిస్తాయి. మరియు ఆయన రాత్రి మొదలైనంతనే, అన్ని జీవాత్మలూ తమ అవ్యక్త రూపంలోకి లీనమై పోతాయి.
Commentary
మహాద్భుతమైన విశ్వ క్రీడలో, వివిధ లోకాలు వాటి యొక్క గ్రహ వ్యవస్థలు మళ్లీ మళ్లీ - సృష్టి, స్థితి, ప్రళయ చక్రానికి గురిఅవుతూనే ఉంటాయి. బ్రహ్మ యొక్క ఒక పగలు అయిపోయేటప్పటికి, అంటే ఒక కల్పము యొక్క 4,320,000,000 సంవత్సరములలో, మహర్లోకం వరకు ఉన్న అన్ని గ్రహ వ్యవస్థలు నాశనం చెందుతాయి. దీనినే నైమిత్తిక ప్రళయం (పాక్షిక లయము) అంటారు. శ్రీమద్భాగవతంలో, శుకదేవుడు పరీక్షిత్తుకి ఇలా చెప్పాడు, ‘ఎలాగైతే ఒక పిల్లవాడు పగలు ఆడుకునేటప్పుడు బొమ్మలతో నిర్మాణాలు చేసి, పడుకునేటప్పుడు వాటిని మళ్లీ తీసేస్తాడో, అదే విధంగా, బ్రహ్మ లేచినప్పుడు ఈ విశ్వ-గ్రహాల వ్యవస్థని వాటి యందు జీవ రాశులని సృష్టించి, పడుకునే ముందు వాటి అన్నింటిని లయం చేస్తాడు.
బ్రహ్మ యొక్క 100 సంవత్సరముల జీవన కాలం ముగిసే సమయానికి, సమస్త విశ్వము లయం చేయబడుతుంది. ఈ సమయంలో మొత్తం భౌతిక సృష్టి లయం చేయబడుతుంది. పంచ-మహాభూతములు, పంచ-తన్మాత్రలలో విలీనమవుతాయి. పంచ తన్మాత్రలు అహంకారములో విలీనమవుతాయి. అహంకారము మహాన్ (మహత్తు) యందు విలీనమవుతుంది, మరియు, మహత్తు ప్రకృతిలోకి విలీనము అవుతుంది. ప్రకృతి అనేది భౌతిక శక్తి, మాయ - యొక్క సూక్ష్మ రూపము. మాయ - దాని యొక్క ఆదిమ రూపంలో, అప్పుడు వెళ్లి మహా విష్ణువు యొక్క శరీరంలో కూర్చుంటుంది. దీనినే ప్రాకృతిక ప్రళయం లేదా మహా ప్రళయం అంటారు. తిరిగి మహా విష్ణువు సృష్టి చేయటానికి ఎప్పుడైతే సంకల్పిస్తాడో, ఆయన ప్రకృతి రూపంలో ఉన్న భౌతిక శక్తి వైపు తన చూపు ప్రసరిస్తాడు, కేవలం ఆయన దృష్టి సారించినంతనే, అది ఆవిష్కరించటం మొదలవుతుంది. ప్రకృతి నుండి మహాన్ వస్తుంది: మహాన్ నుండి అహంకారము వస్తుంది; అహంకారము నుండి పంచ-తన్మాత్రలు సృష్టించబడుతాయి; పంచ-తన్మాత్రల నుండి పంచ-మహాభూతాలు సృష్టించబడుతాయి. ఈ ప్రకారంగా , అనంతమైన బ్రహ్మాండాలు సృష్టించబడుతాయి.
ఆధునిక కాల శాస్త్రవేత్తలు, మిల్కీ-వే లో, 100 బిలియన్ నక్షత్రాలు ఉన్నాయి అని అంచనా వేశారు. ఈ మిల్కీ-వే లాగా, ఈ విశ్వంలో ఒక బిలియన్ పాలపుంతలు ఉన్నాయి. ఈ విధంగా, శాస్త్రవేత్తల అంచనా ప్రకారం, మన విశ్వంలో 1020 నక్షత్రాలు ఉన్నాయి. వేదాల ప్రకారం, మన విశ్వం వంటివి, వేరు వేరు పరిమాణాలలో, లక్షణాలతో అసంఖ్యాకమైన విశ్వములు ఉన్నాయి. ప్రతి సారి, మహావిష్ణువు శ్వాస లోపలికి తీసుకున్నప్పుడు, అనంతమైన విశ్వములు ఆయన శరీర రోమకూపాల్లోంచి వ్యక్తమవుతాయి; మరియు ఆయన శ్వాస వదిలినప్పుడు, సమస్త విశ్వములు లయమై పోతాయి. అంటే, 100 సంవత్సరముల బ్రహ్మ జీవనకాలం, మహా విష్ణువు యొక్క ఒక శ్వాసకాలం మేర ఉంటుంది. ప్రతి విశ్వమునకు ఒక బ్రహ్మ, ఒక విష్ణువు, మరియు ఒక శంకరుడు ఉంటారు. కాబట్టి, అసంఖ్యాకమైన బ్రహ్మలు, విష్ణువులు మరియు శంకరులు, అసంఖ్యాకమైన విశ్వాలలో ఉంటారు. అన్నీ విశ్వముల యొక్క సమస్త విష్ణువులు కూడా శ్రీ మహా విష్ణువు యొక్క విస్తరణలే.