పురుషః స పరః పార్థ భక్త్యా లభ్యస్త్వనన్యయా ।
యస్యాంతఃస్థాని భూతాని యేన సర్వమిదం తతమ్ ।। 22 ।।
పురుషః — సర్వోత్కృష్ట దివ్య పరమ పురుషుడు; సః — అతడు; పరః — అత్యున్నతుడు; పార్థ — అర్జునా, ప్రిథ పుత్రుడా; భక్త్యా — భక్తి ద్వారా; లభ్యః — పొందగలము; తు — వాస్తవముగా; అనన్యయా — వేరేది ఏమి లేకుండా; యస్య — ఎవరికైతే; అంతః-స్థాని — లోపల స్థితమై ఉండి; భూతాని — ప్రాణులు; యేన — ఎవరిచేత నయితే; సర్వం — సమస్తమూ; ఇదం — ఇది; తతమ్ — వ్యాపింపబడి ఉన్నదో.
Translation
BG 8.22: సర్వోత్కృష్ట పరమ పురుషుడే అన్నింటికన్నా సర్వోన్నతుడు. ఆయన సర్వ వ్యాప్తుడు మరియు సర్వ ప్రాణులు ఆయన యందే స్థితమై ఉన్నా, ఆయన కేవలం భక్తి చేత మాత్రమే తెలుసుకోబడుతాడు.
Commentary
ఆధ్యాత్మిక అంతరిక్షంలో తన దివ్య-ధామములో నివసించే భగవంతుడు, స్వయంగా ఆయనే, మన హృదయములో కూడా స్థితుడై ఉన్నాడు; ఆయన భౌతిక ప్రపంచంలో ప్రతి పరమాణువులో కూడా నిండినిబిడీ కృతమై ఉన్నాడు. భగవంతుడు అంతటా సమానంగా ఉన్నాడు; సర్వ-వ్యాప్త బ్రహ్మము ఏదో ఇరవై-ఐదు శాతమే ఉంటాడు, సాకార రూప భగవానుడు వంద శాతం ఉన్నట్టు అని చెప్పలేము. ఆయన అంతటా నూటికి నూరు శాతం ఉన్నాడు. కానీ, ఆ యొక్క సర్వ-వ్యాప్త భగవానుని అస్తిత్వం మనకు ఎటువంటి ఉపయోగకారిగా ఉండదు ఎందుకంటే దాని యొక్క అనుభూతి మనకు కలుగదు. శాండిల్య ముని ఇలా పేర్కొన్నాడు:
గవాం సర్పిః శరీరస్థం న కరోత్యంగ పోషణం
(శాండిల్య భక్తి దర్శనం)
‘ఆవు శరీరంలోనే పాలు ఉంటాయి, కానీ నీరసంగా, అనారోగ్యంతో ఉన్న ఆవుకు అవి ఏమీ ఉపయోగపడవు.’ అదే పాలను ఆవు నుండి తీసి, పెరుగుగా మార్చి, ఆ పెరుగుని మిరియాల పొడితో కొద్దిగా కలిపి దానికే తినిపిస్తే , అది ఆవుని నయం చేస్తుంది.
అదే విధంగా, సర్వ-వ్యాపి భగవంతుని ఉనికికి, మన భక్తిని రంజిల్లచేసే అన్యోన్యత ఉండదు. మొదట మనం ఆయన దివ్య మంగళ స్వరూపాన్ని ఆరాధించి మన హృదయములో స్వచ్ఛత (అంతఃకరణ శుద్ధి) పెంపొందించుకోవాలి. అప్పుడు మనం భగవత్ కృపని ఆకర్షించగలము, ఆయన కృపచే మన, ఇంద్రియమనోబుద్దుల యందు తన యొక్క యోగమాయా శక్తిని ప్రవేశపెడతాడు. మన ఇంద్రియములు అప్పుడు దివ్యమైనవి అవుతాయి మరియు అప్పుడు మనము భగవంతుడిని సగుణసాకారంగా కానీ లేదా సర్వ-వ్యాప్త తత్త్వంలో కానీ, ఆయన దివ్యత్వాన్ని అర్థం చేసుకోగలము. ఈ విధంగా శ్రీ కృష్ణుడు, తాను భక్తి ద్వారా మాత్రమే తెలుసుకోబడుతాను అని పేర్కొంటున్నాడు.
భక్తి యొక్క ఆవశ్యకతని శ్రీ కృష్ణుడు భగవద్గీతలో పదేపదే నొక్కిచెప్పాడు. 6.47వ శ్లోకంలో, తనయందు భక్తి తత్పరతతో నిమగ్నమైనవారు అందరికంటే ఉత్తములు అని చెప్పిఉన్నాడు. ఇక్కడ, చాలా స్పష్టంగా ఆయన ‘అనన్య’ అన్న పదం వాడుతున్నాడు, అంటే భగవంతుడిని తెలుసుకోవటం ‘వేరే ఏ ఇతర మార్గం ద్వారా కుదరదు’ అని. చైతన్య మహాప్రభు దీన్ని చాలా అద్భుతంగా చెప్పాడు:
భక్తి ముఖ నిరీక్షక కర్మ యోగ జ్ఞాన
(చైతన్య చరితామృతం, మధ్య లీల 22.17)
‘కర్మ, జ్ఞాన, మరియు అష్టాంగ యోగములు అన్నీ భగవత్ ప్రాప్తి మార్గములే అయినా, వీటన్నిటికి తమ సాఫల్యం కోసం భక్తి యొక్క ఆధారం అవసరం.’
జగద్గురు శ్రీ కృపాలు మహారాజ్ ఇదే విషయాన్ని చెప్పారు:
కర్మ యోగ అరు జ్ఞాన సబ, సాధన యదపి బఖాన్
పై బిను భక్తి సబఇ జను, మృతక దేహ బిను ప్రాన్
(భక్తి శతకం, 8వ శ్లోకం)
‘కర్మ, జ్ఞాన మరియు అష్టాంగ యోగములు భగవత్ ప్రాప్తికి మార్గములే అయినా, వాటితో పాటు భక్తిని సమ్మిళితం చేయకపోతే, అవన్నీ ప్రాణం లేని మృత శరీరాల వంటివే.’ పలు రకాల వేదశాస్త్రములు కూడా ఇదే విషయాన్ని పేర్కొన్నాయి:
భక్త్యాహమేకయా గ్రాహ్యః శ్రద్ధయాత్మా ప్రియః సతామ్
(భాగవతం 11.14.21)
‘కేవలం నన్ను విశ్వాసం, ప్రేమతో పూజించే నా భక్తులకు మాత్రమే నేను పొందబడుతాను’
మిలహిం న రఘుపతి బిను అనురాగా,
కిఏ జోగ తప జ్ఞాన బిరాగా
(రామచరితమానస్)
‘అష్టాంగ యోగము ఆభ్యాసము చేసినా, నియమనిష్ఠలు పాటించినా, జ్ఞానాన్ని సముపార్జించినా, మరియు వైరాగ్యం పెంపొందించుకున్నా, అయినాసరే, భక్తి లేకుండా భగవంతున్ని ఎవరూ పొందలేరు.’