యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరమ్ ।
తం తమేవైతి కౌంతేయ సదా తద్భావభావితః ।। 6 ।।
యం యం — ఏదైతే; వా — లేదా; అపి — కూడా; స్మరన్ — స్మరిస్తూ; భావం — భావములను; త్యజతి — విడిచి పెట్టి; అంతే — చివరికి; కలేవరమ్ — శరీరము; తం — దానిని; తం — దానిని; ఏవ — నిజముగా; ఏతి — పొందును; కౌంతేయ — అర్జునా, కుంతీ పుత్రుడా; సదా — ఎల్లప్పుడూ; తత్ — అది (ఆ యొక్క); భావ-భావితః — తలంపుల లోనే నిమగ్నమై ఉండి.
Translation
BG 8.6: మృత్యుకాలంలో శరీరాన్ని విడిచిపెట్టే సమయంలో వ్యక్తి దేనినైతే గుర్తుచేసుకుంటాడో, ఓ కుంతీ పుత్రుడా, ఎప్పుడూ అదే ధ్యాసలో ఉండటం వలన ఆ వ్యక్తి అదే స్థితిని పొందును.
Commentary
మనము ఒక చిలుకకి, ‘గుడ్ మార్నింగ్!’ అని పలకటానికి తర్ఫీదు ఇవ్వటంలో సఫలం అవ్వచ్చు. కానీ, దాని గొంతు గట్టిగా పట్టుకుంటే అది కృత్రిమముగా నేర్చుకున్న దాన్ని మర్చిపోయి దాని యొక్క సహజ గొంతుతో 'కావ్!' మంటుంది. అదే విధముగా, మృత్యు సమయంలో, సహజంగానే మన మనస్సు, జీవితం మొత్తం అలవాటుగా తయారు చేసుకున్న ఆలోచనల ప్రవాహంలోనే పరుగు పెడుతుంది. మన ప్రయాణ ప్రణాళిక సిద్ధం చేసుకోవటానికి సమయం, మనం సామాను సర్దుకున్న తరువాత కాదు; ముందు జాగ్రత్తతో సరియైన ప్రణాళిక, ఏర్పాటు అవసరం. మరణ సమయంలో ఏదైతే మన ఆలోచనలలో ప్రధానంగా ఉంటుందో, అదే మన తదుపరి జన్మను నిర్ణయిస్తుంది. ఈ శ్లోకంలో శ్రీ కృష్ణుడు చెప్పేది ఇదే.
వ్యక్తి యొక్క రోజువారీ అలవాట్లు మరియు సాంగత్యముల ప్రకారం, తను బ్రతికున్నంత కాలం దేని గురించి తలంచాడో, ధ్యానం చేసాడో సహజంగానే ఆప్రకారంగానే వ్యక్తి యొక్క చివరి తలంపులు ఉంటాయి; పురాణాలలో భరత మహారాజు వృత్తాంతం ఈ విషయం స్పష్టంగా అర్థమయ్యేలా విశదీకరిస్తుంది.
ప్రాచీన భారతదేశంలో, భరతుడు ఒక శక్తిమంతమైన రాజు, కానీ భగవత్ ప్రాప్తి సాధన కోసం, అడవిలో తపస్విలా జీవిస్తూ, తన రాజ్యాన్ని త్యజించాడు. ఒక రోజు, గర్భంతో ఉన్న ఒక జింక, ఒక పులి గాండ్రింపు విని నీటిలోకి దూకటం చూసాడు. ఆ భయానికి, గర్భంతో ఉన్న జింక ఒక జింక-పిల్లని ప్రసవించింది. ఆ జింక పిల్ల నీటిలో తెలియాడటం చూసి భరతుడు జాలిపడి దానిని రక్షించాడు. అతను దానిని తన కుటీరముకి తీసుకువెళ్ళి దానిని పెంచటం మొదలుపెట్టాడు. అపారమైన వాత్సల్యంతో దాని యొక్క ఉల్లాసమైన ఆటపాటలను చూస్తూ ఉండేవాడు. దాని కోసం గడ్డి తెచ్చేవాడు, దానిని వెచ్చగా ఉంచటం కోసం దానిని ఆలింగనము చేసుకునేవాడు. క్రమక్రమంగా ఆయన మనస్సు భగవంతుని నుండి దూరంగా వచ్చి, ఆ జింకపై నిమగ్నమయింది. ఈ అనుబంధం ఎంత గాఢంగా అయ్యిందంటే రోజంతా ఆ జింక గురించే ఆలోచించేవాడు. ఇక ఆయన మరణించే సమయంలో, ఆ జింక ఏమైపోతుందో అని చింతిస్తూ, దానిని ప్రేమతో పిలిచాడు.
పర్యవసానంగా, భరత మహారాజు, ఆయన తదుపరి జన్మలో, ఒక జింకగా పుట్టాడు. కానీ, ఆయన ఏంతో ఆధ్యాత్మిక సాధన చేసి ఉండటం వలన, ఆయన చేసిన తప్పు యొక్క అవగాహన ఉండింది, కాబట్టి జింకగా ఉన్నా సరే, ఆయన, అడవిలో సాధు జనుల ఆశ్రమాల దగ్గరే నివసిస్తూ ఉండేవాడు. చివరికి, ఆయన తన జింక దేహాన్ని విడిచి పెట్టిన తరువాత, ఆయనకి తిరిగి మానవ శరీరం ఇవ్వబడింది. ఈ సారి, ఆయన ఒక గొప్ప ఋషి జడభరతుడు అయినాడు మరియు తన సాధన పూర్తి చేస్తూ భగవత్ ప్రాప్తి సాధించాడు.
ఈ శ్లోకం చదివిన తరువాత, ఎవరూ కూడా, అంతిమ లక్ష్యాన్ని సాధించటం కోసం, భగవంతుడిని మరణ సమయంలో ధ్యానం చేస్తే సరిపోతుందిలే అని అనుకోకూడదు. జీవితాంతం అభ్యాసం చేయకుండా, ఇది ఖచ్చితంగా అసాధ్యం. స్కంద పురాణం ప్రకారం మృత్యు సమయంలో భగవంతుడిని స్మరించటం చాలా కష్టం. మరణం చాలా బాధాపూరితమైన అనుభవం, ఆ సమయంలో వ్యక్తి యొక్క అంతర్లీనంగా ఉన్న స్వభావం వైపే మనస్సు మొగ్గు చూపుతుంది. మనస్సు భగవంతుని గురించి స్మరించాలంటే వ్యక్తి యొక్క ఆంతర స్వభావం అయన యందే లీనమై ఉండాలి. ఆంతర స్వభావం అంటే మనోబుద్ధుల లోపల నివసించి ఉండే స్మృతి. ఏదేని ఒకదాన్ని నిరంతరం ధ్యానించుతూ ఉంటేనే అది ఆంతర స్వభావంగా వ్యక్తమౌతుంది. కాబట్టి, భగవత్ స్మృతి లోనే ఉండే ఆంతర స్వభావాన్ని పెంపొందించుకోవటానికి, భగవంతుడు మన జీవతంలో ప్రతి క్షణం గుర్తుంచుకోబడాలి, జ్ఞప్తికితెచ్చుకోబడాలి మరియు ధ్యానించబడాలి. ఈ విషయాన్నే శ్రీ కృష్ణుడు తదుపరి శ్లోకంలో పేర్కొంటున్నాడు.