Bhagavad Gita: Chapter 8, Verse 9-10

కవిం పురాణమనుశాసితారమ్
అణోరణీయాంసమనుస్మరేద్యః ।
సర్వస్య ధాతారమచింత్యరూపమ్
ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ ।। 9 ।।
ప్రయాణకాలే మనసాచలేన
భక్త్యా యుక్తో యోగబలేన చైవ
భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్
స తం పరం పురుషముపైతి దివ్యమ్ ।। 10 ।।

కవిం — కవి (సర్వజ్ఞుడు); పురాణమ్ — ప్రాచీనమైన; అనుశాసితారమ్ — శాసించేవాడు; అణోః — పరమాణువు కంటే; అణీయాంసమ్ — సూక్ష్మమైన; అనుస్మరేత్ — ఎల్లప్పుడూ స్మరిస్తూ; యః — ఎవరైతే; సర్వస్య — అన్నింటి యొక్క; ధాతారమ్ — ఆధారము; అచింత్య — ఊహింపశక్యము కాని; రూపమ్ — దివ్య రూపము; ఆదిత్య-వర్ణం — సూర్యుని వంటి ప్రకాశంతో; తమసః — అజ్ఞానపు చీకటి కి; పరస్తాత్ — అతీతంగా; ప్రయాణ-కాలే — మరణ సమయంలో; మనసా — మనస్సు; అచలేన — దృఢమైన; భక్త్యా — అత్యంత భక్తితో స్మరిస్తూ; యుక్తః — ఏకమై; యోగ-బలేన — యోగ బలముతో; చ — మరియు; ఏవ — నిజముగా; భ్రువోః — రెండు కనుబొమల; మధ్యే — మధ్యలో; ప్రాణమ్ — ప్రాణములు; ఆవేశ్య — కేంద్రీకరించి; సమ్యక్ — సంపూర్ణముగా; సః — అతడు; తం — అతనికి; పరం పురుషమ్ — సర్వోత్కృష్ట పరమేశ్వరుడు; ఉపైతి — లభించును; దివ్యమ్ — దివ్యమైన.

Translation

BG 8.9-10: భగవంతుడు సర్వజ్ఞుడు, అత్యంత ప్రాచీనుడు, అందరినీ శాసించేవాడు, సూక్ష్మము కంటే సూక్ష్మమైన వాడు, అన్నింటికీ ఆధారమైన వాడు, ఊహాకందని దివ్య స్వరూపం కలవాడు; ఆయన సూర్యుడి కంటే తేజోవంతుడు మరియు సమస్త అజ్ఞానపు చీకట్లకీ అతీతుడు. ఎవరైతే మరణ సమయంలో, యోగ అభ్యాసము చేత లభించిన అచంచలమైన మనస్సుతో, ప్రాణములను కనుబొమల మధ్యే నిలిపి, నిశ్చలంగా దివ్య మంగళ భగవంతుడిని అత్యంత భక్తితో స్మరిస్తారో, వారు ఖచ్చితంగా ఆయనను పొందుతారు.

Commentary

భగవంతునిపై ధ్యానం అనేది ఎన్నో రకాలుగా ఉంటుంది. నామములు, రూపములు, గుణములు, లీలలు, ధామము, లేదా ఆయన పరివారము – వీటిపై ధ్యానము చేయవచ్చు. ఇవన్నీ భగవంతునికి సంబంధించినవే, ఆయన కన్నా అభేదములే. మన మనస్సుని వీటిలో దేనిపైన అయినా అనుసంధానం చేస్తే మనస్సు భగవత్ ప్రపంచంలోనికి ప్రవేశిస్తుంది మరియు పరిశుద్ధి చెందుతుంది. కాబట్టి వీటిలో దేనినైనా లేదా అన్నింటినైనా మన ధ్యాన విషయంగా చేసుకోవచ్చు. ఇక్కడ మనం ధ్యానం చేసుకోగలిగే భగవంతుని ఎనిమిది గుణములు వివరించబడ్డాయి.

కవి అంటే కావ్యకర్త లేదా జ్ఞాని; దాని విస్తరింపుచే, సర్వజ్ఞుడు అని కూడా చెప్పవచ్చు. 7.26వ శ్లోకంలో పేర్కొనబడినట్టు, భగవంతుడికి భూత, వర్తమాన, మరియు భవిష్యత్ కాలాలు అన్నీ తెలుసు.

పురాణ అంటే, ఆదిరహితము మరియు అత్యంత ప్రాచీనము అని. భగవంతుడే, సమస్త భౌతిక మరియు ఆధ్యాత్మిక విషయములకు ఆదిమూలము, కానీ, ఆయన మాత్రం మరొక దేనినుండో రాలేదు మరియు ఆయన కన్నా ముందు ఉన్నది ఇక ఏమీ లేదు.

అనుశాసితారం అంటే పరిపాలించేవాడు. భగవంతుడు ఈ విశ్వం నిర్వహించబడటానికి ఉన్న నియమనిబంధనలను సృష్టించేవాడు; ఆ విశ్వం యొక్క వ్యవహారాలను తనే స్వయంగా మరియు ఆయన నియమించిన దేవతల ద్వారా అజమాయిషీ చేస్తాడు. ఈ విధంగా, ప్రతీదీ ఆయన ఆధీనంలోనే ఉంటుంది.

అణోరణీయాన్ అంటే సూక్ష్మాతి, సూక్ష్మమైనది. ఆత్మ అనేది భౌతిక పదార్థము కంటే సూక్ష్మమైనది, కానీ, భగవంతుడు ఆత్మలోపల స్థితుడై ఉంటాడు, కాబట్టి ఆత్మ కన్నా సూక్ష్మమైనవాడు.

సర్వస్య ధాతా అంటే, అన్నింటికీ ఆధారమైనవాడు, అన్ని అలలకు ఆధారమైన సముద్రము అయినట్టుగా.

అచింత్య రూపా అంటే, ఊహకందని స్వరూపము ఉన్నవాడు అని. మన మనస్సు కేవలం భౌతిక రూపములు మాత్రమే గ్రహింపగలదు కాబట్టి భగవంతుడు ఈ భౌతిక మనస్సు కంటే అతీతుడు. కానీ, ఆయన కృప చేస్తే, తన యోగమాయా శక్తి చేత ఆయన మన మనస్సుని దివ్యమైనదిగా చేస్తాడు. అప్పుడు మాత్రమే, ఆయన కృప చేత, ఆయన మన ఊహకు అందుతాడు.

ఆదిత్య వర్ణ అంటే, ఆయన సూర్యుని వలె తేజోవంతుడు.

తమసః పరస్తాత్ అంటే అజ్ఞానపు చీకటి కంటే అతీతుడు. ఎలాగైతే ఒక్కోసారి మబ్బులు సూర్యుడికి అడ్డు వచ్చినా, సూర్యుడు ఎప్పటికీ మబ్బులచే కప్పివేయబడలేడో, అదేవిధంగా, భగవంతుడు కూడా, ఈ లోకంలో మాయతో కాంటాక్ట్ అయినా, భౌతికశక్తి మాయచే ఆయన, కప్పివేయబడలేడు.

భక్తి ప్రక్రియలో, మనస్సు భగవంతుని యొక్క రూపము, గుణములు, లీలలు వంటి వాటి పైనే నిమగ్నమౌతుంది. కేవలం భక్తిని మాత్రమే చేస్తే దానిని శుద్ధ భక్తి అంటారు. దానిని అష్టాంగ యోగ తో పాటుగా చేస్తే దానిని యోగ-మిశ్ర భక్తి (అష్టాంగ యోగ సాధనతో కలిపి చేసే భక్తి). పదవ శ్లోకం నుండి పదమూడవ శ్లోకం వరకు శ్రీ కృష్ణుడు యోగ మిశ్ర భక్తి ని వివరిస్తున్నాడు.

భగవద్గీత యొక్క ఒక అధ్బుతమైన గుణం ఏమిటంటే అది చాలా రకాల ‘సాధన’ లను పేర్కొన్నది; ఎన్నో రకాల వైవిధ్యం, వేరు వేరు రకాల ఆచారాలు, కుంటుంబాలు, వ్యక్తిత్వాల నుండి వచ్చిన మనుష్యులను అక్కున చేర్చుకున్నది. పాశ్చాత్య విద్యావంతులు గురువు సహాయం లేకుండా హిందూ వేద శాస్త్రాలను చదవటానికి ప్రయత్నిస్తే, వారు చాల సార్లు ఎన్నో రకాల మార్గాలు, ఉపదేశాలు, మరియు తత్త్వ కోణాలచే అయోమయానికి గురి అవుతారు. కానీ, ఈ వైవిధ్యం నిజానికి ఒక వరం. అనంతమైన పూర్వ జన్మ సంస్కారాల వలన మనందరికీ వేర్వేరు స్వభావాలు, అభిరుచులు ఉంటాయి. ఒక నలుగురు, బట్టలు కొనటానికి వెళితే, వారందరూ వేర్వేరు రంగుల, వేర్వేరు ఫాషనుల, వేర్వేరు రకాల వాటిని ఎంచుకుంటారు. ఒకవేళ కొట్టులో ఒకే రకం రంగు, ఒకే రకం రూపము ఉన్న బట్టలు ఉంటే, అది మానవులలో అంతర్గతంగా ఉన్న వైవిధ్యాన్ని తృప్తి పరచలేదు. అదే విధంగా, ఆధ్యాత్మిక పథంలో కూడా, జనులు ఎన్నో రకాల సాధనలు పూర్వ జన్మలలో చేసి ఉండవచ్చు. వైదిక శాస్త్రాలు ఆ వైవిధ్యాన్ని గౌరవిస్తాయి, అదే సమయంలో ‘భక్తి’యే వీటన్నిటినీ ఉమ్మడిగా ఉంచి ఒక్కటిగా కట్టివేసే త్రాడు అని నొక్కిచెప్పాయి.

అష్టాంగ యోగములో, ప్రాణశక్తి, వెన్నెముకలో సుషుమ్నా నాడి గుండా పైకి లేపబడుతుంది. అది, మూడవ కన్ను (ఆంతర కన్ను) స్థానమైన, కనుబొమల మధ్యకు తేబడుతుంది. తదుపరి, ఆ పరమేశ్వరుడైన భగవంతుని యందే గాఢమైన భక్తితో కేంద్రీకరించబడుతుంది.