ఏడవ మరియు ఎనిమిదవ అధ్యాయాలలో శ్రీ కృష్ణుడు, యోగ ప్రాప్తికి, భక్తియే అన్నింటికన్నా సులువైన మార్గమని, భక్తియే అత్యున్నత యోగ విధానమని ప్రకటించి ఉన్నాడు. తొమ్మిదవ అధ్యాయంలో - విస్మయాన్నీ, పూజ్యభావాన్నీ మరియు భక్తినీ ఉత్పన్నం చేసే - తన యొక్క సర్వోత్కృష్ట మహిమలను గురించి చెప్తున్నాడు. తాను అర్జునుడి ముందు తన సాకార రూపంలో నిలబడి ఉన్నా, తాను ఒక సామాన్య మానవుడినే అని అపోహ పడవద్దని తెలియచేస్తున్నాడు. తాను ఏ విధంగా, తన ఈ యొక్క భౌతిక శక్తిని ఆధీనంలో ఉంచుకొని, సృష్టి ప్రారంభంలో అనేకానేక జీవ రాశులను సృష్టించి, ప్రళయ సమయంలో తిరిగి వాటిని తనలోకే లయం చేసుకుంటాడో మరియు తదుపరి సృష్టి చక్రంలో మరల వాటిని వ్యక్తపరుస్తాడో, వివరిస్తాడు. అంతటా బ్రహ్మాండంగా వీచే గాలి కూడా ఆకాశంలోనే ఎలా స్థితమై ఉంటుందో, అలాగే సమస్త జీవ రాశులూ ఆయన యందే నివసిస్తూ ఉంటాయి. అయినా, తన దివ్య యోగ మాయా శక్తి ద్వారా, ఆయన తటస్థంగా, నిర్లిప్తంగా, ఈ అన్ని కార్యక్రమాలకు కేవలం సాక్షిగా, అన్నీ గమనిస్తూ ఉండిపోతాడు.
హిందూ ధర్మంలో ఉన్న ఎంతో మంది దేవుళ్ళ/దేవతల అయోమయాన్ని శ్రీ కృష్ణుడు ఇక్కడ - ఆరాధనా విషయముగా కేవలం ఒకే భగవంతుడు ఉంటాడు - అని వివరించటం ద్వారా పరిష్కరిస్తున్నాడు. ఆయనే లక్ష్యము, ఆధారము, ఆశ్రయము మరియు సర్వ భూతముల నిజమైన స్నేహితుడు. వేదాలలో పేర్కొనబడిన కర్మ కాండల పట్ల ఆసక్తి ఉన్నవారు స్వర్గాది లోకాలను పొందుతారు, మరియు వారి పుణ్య ఫలం క్షయం అయిపోయిన తరువాత తిరిగి భూలోకానికి చేరుకుంటారు. కానీ, ఆ పరమేశ్వరుని పట్ల అనన్య భక్తితో నిమగ్నమై ఉన్నవారు ఆయన పరంధామమునకే చేరుకుంటారు. ఈ విధంగా శ్రీ కృష్ణుడు తన పట్ల ఉండే అనన్య భక్తి యొక్క సర్వోన్నత శ్రేష్ఠతను ఎంతగానో కొనియాడాడు. ఇటువంటి భక్తిలో, మన దగ్గర ఉన్నదంతా ఆయనకే సమర్పించి మరియు ప్రతీదీ ఆయనకోసమే చేస్తూ, మనము భగవంతుని చిత్తముతో సంపూర్ణంగా ఏకమై నివసించాలి. ఇటువంటి స్వచ్ఛమైన పవిత్రమైన భక్తిచే, మనము కర్మ బంధాలనుండి విడిపింపబడి, భగవంతునితో ఆధ్యాత్మిక ఏకత్వం పొందుతాము.
ఇంకా, తను ఒకరి పట్ల అనుకూలంగా, మరొకరి పట్ల ప్రతికూలంగా ఉండను అంటున్నాడు - ఆయన సమస్త ప్రాణుల పట్ల నిష్పక్షపాతంగా వ్యవహరిస్తాడు. పరమ పాపిష్ఠి వారు అయినా సరే ఆయనను ఆశ్రయిస్తే, ఆయన వారిని ఆహ్వానించి, స్వీకరించి వారిని శీఘ్రముగా పుణ్యాత్ములుగా, పవిత్రులుగా తీర్చిదిద్దుతాడు. తన భక్తులు ఎన్నటికీ నశింపరు అని ఆయన హామీ ఇస్తున్నాడు. ఆయన వారి యందే స్థితమై ఉండి, వారికి లేనివి సమకూర్చి పెడతాడు, మరియు, వారికి ఉన్నవాటిని సంరక్షిస్తాడు. అందుకే, మనం సర్వదా ఆయనను స్మరించాలి, ఆరాధించాలి, మన మనస్సు-శరీరమును ఆయనకు సమర్పించాలి, ఆయన్నే సర్వోన్నత లక్ష్యంగా చేసుకోవాలి.
Bhagavad Gita 9.1 View commentary »
శ్రీ భగవానుడు పలికెను: ఓ అర్జునా, నీకు నామీద అసూయ లేదు కాబట్టి, ఈ యొక్క అత్యంత రహస్యమైన జ్ఞానాన్ని మరియు అనుభవపూర్వక విజ్ఞానాన్ని ఇప్పుడు నేను నీకు తెలియజేస్తాను; ఇది తెలుసుకున్న తరువాత నీవు భౌతికసంసార బాధల నుండి విముక్తి చేయబడుతావు.
Bhagavad Gita 9.2 View commentary »
ఈ జ్ఞానము అన్ని విద్యలకు రారాజు మరియు అత్యంత గోప్యమయినది. ఇది విన్న వారిని పవిత్రం చేస్తుంది. ఇది నేరుగా అనుభవపూర్వకంగా తెలుసుకోవటానికి వీలైనది, ధర్మ బద్ధమైనది, ఆచరించటానికి సులువైనది, శాశ్వతమైన ఫలితమును ఇచ్చేటటువంటిది.
Bhagavad Gita 9.3 View commentary »
ఈ ధర్మము యందు విశ్వాసము లేని జనులు, నన్ను పొందలేకున్నారు, ఓ శత్రువులను జయించేవాడా. వారు పదేపదే జనన-మరణ చక్రంలో ఈ లోకానికి తిరిగి వస్తుంటారు.
Bhagavad Gita 9.4 View commentary »
ఈ సమస్త విశ్వమూ నా అవ్యక్త స్వరూపంచే వ్యాపింపబడి ఉన్నది. సమస్త ప్రాణులు నా యందే స్థితమై ఉన్నాయి కాని నేను వాటి యందు స్థితుడనుకాను.
Bhagavad Gita 9.5 View commentary »
అయినా సరే, ప్రాణులు నాలో స్థిరముగా ఉండవు. నా దివ్య శక్తి యొక్క అద్భుతమును తిలకించుము! నేనే సమస్త ప్రాణుల సృష్టి కర్తను మరియు నిర్వాహకుడను అయినా, నేను వాటిచే కానీ లేదా భౌతిక ప్రకృతిచే కానీ ప్రభావితము కాను.
Bhagavad Gita 9.6 View commentary »
అంతటా వీచే ప్రబలమైన గాలి కూడా, ఎల్లప్పుడూ ఆకాశంలోనే స్థితమై ఉన్నట్టు, అదే విధంగా, సర్వ ప్రాణులు కూడా ఎల్లప్పుడూ నా యందే స్థితమై ఉంటాయి.
Bhagavad Gita 9.7 – 9.8 View commentary »
కల్పాంతరమున (ఒక కల్పము చివరన), సమస్త ప్రాణులు నా యొక్క ఆదిమ ప్రకృతి శక్తి యందు విలీనమవుతాయి. తదుపరి సృష్టి ప్రారంభంలో, ఓ కుంతీ పుత్రుడా, నేను వాటిని మరల వ్యక్తపరుస్తాను. నా ప్రాకృతిక (భౌతిక) శక్తిని అధీనంలో ఉంచుకొని, ఈ అసంఖ్యాకమైన జీవ రాశులను, వాటి వాటి స్వభావాల అనుగుణంగా, మరల మరల సృష్టిచేయుచున్నాను.
Bhagavad Gita 9.9 View commentary »
ఓ సిరి-సంపదలను జయించే వాడా, ఈ కార్యములు ఏవీ నన్ను బంధించలేవు. నేను ఒక తటస్థ పరిశీలకుడిగా, ఈ కర్మలు ఏవీ నన్ను అంటకుండా అనాసక్తతతో ఉంటాను.
Bhagavad Gita 9.10 View commentary »
నా యొక్క నిర్దేశంలో పని చేస్తూ, ఈ భౌతిక శక్తి, సమస్త చరాచర భూతములను జనింపచేయును, ఓ కుంతీ పుత్రుడా. ఈ కారణం వలన, భౌతిక జగత్తు మార్పుకు లోనగుచుండును (సృష్టి, స్థితి, మరియు లయములు).
Bhagavad Gita 9.11 View commentary »
నేను నా సాకారమనుష్య రూపంలో అవతరించినప్పుడు, మూఢులు నన్ను గుర్తించలేకున్నారు. సకల భూతములకు మహేశ్వరుడైన నా వ్యక్తిత్వం యొక్క దివ్యత్వము వారికి తెలియదు.
Bhagavad Gita 9.12 View commentary »
భౌతిక మాయా శక్తిచే భ్రమకు లోనైనటువంటి జనులు ఆసుర, నాస్తిక భావాలను పెంపొందించుకుంటారు. ఆ అయోమయ స్థితిలో, అభ్యుదయం/సంక్షేమం కోసం వారి ఆశలు వ్యర్థమవుతాయి, వారు ఫలాసక్తితో చేసే కర్మలు అన్ని నిష్ఫలమే మరియు వారి జ్ఞానము అయోమయ స్థితిలో ఉంటుంది.
Bhagavad Gita 9.13 View commentary »
కానీ, నా యొక్క దివ్యమైన శక్తిని ఆశ్రయించిన మహాత్ములు, ఓ పార్థ, నన్నే, శ్రీ కృష్ణ పరమాత్మనే, సమస్త సృష్టికి ఆది-మూలమని తెలుసుకుంటారు. అనన్య చిత్తముతో, కేవలం నాయందే మనస్సు లగ్నంచేసి వారు నా భక్తిలో నిమగ్నమౌతారు.
Bhagavad Gita 9.14 View commentary »
ఎల్లప్పుడూ నా దివ్య లీలలను/మహిమలను గానం చేస్తూ, దృఢ-సంకల్పముతో పరిశ్రమిస్తూ, వినయముతో నా ముందు ప్రణమిల్లుతూ, నిరంతరం వారు నన్ను ప్రేమ యుక్త భక్తితో ఆరాధిస్తుంటారు.
Bhagavad Gita 9.15 View commentary »
మరికొందరు, జ్ఞాన సముపార్జనా యజ్ఞములో నిమగ్నమై, నన్ను చాలా రకాలుగా ఆరాధిస్తారు. కొందరు నన్ను తమతో అభేదమైన ఏకత్వముగా చూస్తారు, మరికొందరు నన్ను తమకంటే వేరుగా పరిగణిస్తారు. ఇంకా కొందరు నా యొక్క విశ్వ రూపము యొక్క అనంతమైన ఆవిర్భావములలో ఆరాధిస్తారు.
Bhagavad Gita 9.16 – 9.17 View commentary »
నేనే వైదిక క్రతువును, నేనే యజ్ఞమును, మరియు పూర్వీకులకు సమర్పించే నైవేద్యమును నేనే. నేనే ఔషధ మూలికను, మరియు నేనే వేద మంత్రమును. నేనే (ఆజ్యము) నెయ్యి; నేనే అగ్ని మరియు సమర్పించే కార్యమును. ఈ జగత్తుకి, నేనే తండ్రిని; జగత్తుకి నేనే తల్లిని కూడా, సంరక్షకుడిని, పితామహుడుని నేనే. నేనే పవిత్రమొనర్చేవాడిని, జ్ఞానం యొక్క లక్ష్యమును, పవిత్ర శబ్దము ఓం కారమును నేనే. ఋగ్వేదమును, సామవేదమును, మరియు యజుర్వేదమును నేనే.
Bhagavad Gita 9.18 View commentary »
నేనే సమస్త భూతముల సర్వోన్నత లక్ష్యమును, మరియు నేనే వారి యొక్క నిర్వాహకుడను, స్వామి, సాక్షి, నివాసము, ఆశ్రయము మరియు స్నేహితుడను. నేనే సృష్టికి మూలము, అంతము, మరియు ఆధారము; నేనే శాశ్వతస్థానమును మరియు సనాతన బీజమును.
Bhagavad Gita 9.19 View commentary »
నేను సూర్యుని రూపంలో వేడిమిని ప్రసరిస్తాను, మరియు నేనే వర్షమును ఆపుతాను, కురిపిస్తాను. నేనే అమరత్వమును మరియు నేనే మృత్యు రూపంలో వస్తాను. ఓ అర్జునా, నేనే ఆత్మను, నేనే పదార్థమును కూడా.
Bhagavad Gita 9.20 View commentary »
వేదములలో చెప్పబడిన సకామ కర్మకాండల పట్ల మొగ్గుచూపేవారు, నన్ను యజ్ఞ యాగాదులచే పూజిస్తారు. యజ్ఞ శేషము అయిన సోమరస పానము చేయటం ద్వారా పాపాలన్నీ పోయి, పవిత్రులైన వీరు, స్వర్గ లోకాలకు పోవటానికి ఆశిస్తారు. వారి పుణ్య కర్మల ఫలంగా, వారు స్వర్గాధిపతి అయిన ఇంద్రుని లోకానికి వెళతారు, మరియు, దేవతల విలాసాల భోగాలన్నీ అనుభవిస్తారు.
Bhagavad Gita 9.21 View commentary »
స్వర్గ లోకము యొక్క విశాలమైన భోగములు అనుభవించుటచే వారి పుణ్య ఫలము అంతా తరిగిపోయిన తరువాత వారు తిరిగి భూలోకానికి వస్తారు. ఈ విధంగా భోగ వస్తు ప్రాప్తికై వైదిక కర్మ కాండలను ఆచరించే వారు భూలోకానికి పదేపదే వచ్చి పోతుంటారు.
Bhagavad Gita 9.22 View commentary »
ఎల్లప్పుడూ నన్నే స్మరిస్తూ మరియు నా యందు అనన్య భక్తిలో నిమగ్నమైన వారుంటారు. అలా నా యందే సతతమూ మనస్సు నిలిపిన వారికి, వారికి లేనిదేదో అది సమకూర్చి పెడతాను మరియు వారికి ఉన్నదాన్ని సంరక్షిస్తాను.
Bhagavad Gita 9.23 View commentary »
ఓ కుంతీ పుత్రుడా, ఇతర దేవతలను శ్రద్ధతో ఆరాధించే వారు కూడా నన్నే పూజిస్తారు. కానీ, అది వారు తప్పుడు పద్ధతిలో చేసినట్టు.
Bhagavad Gita 9.24 View commentary »
సమస్త యజ్ఞములకు భోక్తను, ఏకైక స్వామిని నేనే. కానీ, నా ఈ యొక్క పరమేశ్వర తత్త్వమును తెలుసుకొనని వారు తిరిగి పుట్టవలసినదే.
Bhagavad Gita 9.25 View commentary »
దేవతలను పూజించే వారు దేవతల యందు జన్మిస్తారు, పితృదేవతలను ఆరాధించేవారు పితృదేవతల దగ్గరకి వెళ్తారు, భూతప్రేతములను అర్చించువారు అలాంటి వాటిల్లో పుడతారు, మరియు నా భక్తులు నన్నే చేరుకుంటారు.
Bhagavad Gita 9.26 View commentary »
నాకు ఎవరైనా భక్తితో ఒక ఆకుగాని, ఒక పువ్వు గాని, ఒక పండు గాని, లేదా నీరైనా గాని సమర్పిస్తే, ఆ స్వచ్ఛమైన మనస్సుగల నా భక్తునిచే ప్రేమతో ఇవ్వబడిన దానిని, నేను సంతోషంగా ఆరగిస్తాను.
Bhagavad Gita 9.27 View commentary »
నీవు ఏ పని చేసినా, నీవు ఏది తిన్నా, నీవు యజ్ఞములో అగ్నికి ఏది సమర్పించినా, నీవు ఏది బహుమతిగా దానం ఇచ్చినా, మరియు ఏ నిష్ఠలను ఆచరించినా, ఓ కుంతీ పుత్రుడా, వాటిని నాకు సమర్పించినట్టుగా చేయుము.
Bhagavad Gita 9.28 View commentary »
అన్ని పనులను నాకే అర్పితం చేయటం ద్వారా, నీవు శుభ-అశుభ ఫలితముల బంధనముల నుండి విముక్తి చేయబడుతావు. సన్యాసము ద్వారా నీ మనస్సు నా యందే లగ్నమై, నీవు విముక్తి చేయబడుతావు మరియు నన్ను చేరుకుంటావు.
Bhagavad Gita 9.29 View commentary »
నేను సర్వ ప్రాణుల యందు సమత్వ బుద్ధితో ఉంటాను, నేను ఎవరి పట్ల పక్షపాతంతో కానీ లేదా విరోధ భావం తో కానీ ఉండను. కానీ, ప్రేమతో నన్ను ఆరాధించే భక్తులు నాయందే నివసిస్తారు మరియు నేను వారి యందు నివసిస్తాను.
Bhagavad Gita 9.30 View commentary »
పరమ పాపిష్ఠివారు అయినా సరే, నన్ను అనన్య భక్తితో పూజిస్తే, వారిని ధర్మాత్ములుగానే పరిగణించాలి, ఎందుకంటే వారు సరియైన నిర్ణయం తీసుకున్నారు కాబట్టి.
Bhagavad Gita 9.31 View commentary »
త్వరితగతిన వారు ధర్మాత్ములుగా అవుతారు, మరియు శాశ్వతమైన శాంతిని పొందుతారు. ఓ కుంతీ పుత్రుడా, నా భక్తుడు ఎన్నటికీ నష్టమునకు గురికాడు అని ధైర్యముగా ప్రకటించుము.
Bhagavad Gita 9.32 View commentary »
వారి జన్మ, జాతి, కులము ఏదైనా, లింగభేదం లేకుండా, సమాజము అసహ్యించుకునేవారయినా, నన్నుశరణుజొచ్చిన వారంతా పరమ పదమును పొందుతారు.
Bhagavad Gita 9.33 View commentary »
ఇక పుణ్యాత్ములైన రాజులు, మునుల గురించి ఏమి చెప్పాలి? కాబట్టి, తాత్కాలికమైన మరియు సుఖంలేని ఈ ప్రపంచం లోకి వచ్చాక, ఇక, నా యందు భక్తి తో నిమగ్నమవ్వుము.
Bhagavad Gita 9.34 View commentary »
ఎల్లప్పుడూ నన్నే స్మరించుము, నా పట్ల భక్తితో ఉండుము, నన్ను ఆరాధించుము, మరియు నాకు ప్రణామములు అర్పించుము. నీ మనస్సు మరియు శరీరము నాకు సమర్పించుటచే నీవు నా వద్దకు నిస్సందేహముగా వచ్చెదవు.