Bhagavad Gita: Chapter 9, Verse 1

శ్రీ భగవానువాచ ।
ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే ।
జ్ఞానం విజ్ఞానసహితం యజ్జ్ఞాత్వా మోక్ష్యసేఽశుభాత్ ।। 1 ।।

శ్రీ భగవాన్-ఉవాచ — శ్రీ భగవానుడు ఇలా పలికెను; ఇదం — ఇది; తు — కానీ; తే — నీకు; గుహ్య-తమం — అత్యంత గోప్యమైన; ప్రవక్ష్యామి — నేను నీకు చెప్పెదను; అనసూయవే — అసూయా రహితుడవు; జ్ఞానం — జ్ఞానము; విజ్ఞాన — అనుభవ జ్ఞానము; సహితం — సహితముగా; యత్ — ఏదైతే; జ్ఞాత్వా — తెలుసుకొన్న పిదప; మోక్ష్యసే — నీవు విముక్తుడవు చేయబడుతావు; అశుభాత్ — భౌతికసంసార బాధలు.

Translation

BG 9.1: శ్రీ భగవానుడు పలికెను: ఓ అర్జునా, నీకు నామీద అసూయ లేదు కాబట్టి, ఈ యొక్క అత్యంత రహస్యమైన జ్ఞానాన్ని మరియు అనుభవపూర్వక విజ్ఞానాన్ని ఇప్పుడు నేను నీకు తెలియజేస్తాను; ఇది తెలుసుకున్న తరువాత నీవు భౌతికసంసార బాధల నుండి విముక్తి చేయబడుతావు.

Commentary

విషయ ప్రారంభంలోనే, శ్రీ కృష్ణుడు ఈ ఉపదేశం వినటానికి ఉన్న అర్హతని తెలియచేస్తున్నాడు. ‘అనసూయవే’ అంటే అసూయ లేనివాడు అని అర్థం. అర్జునుడికి తన మీద అసూయ లేదు కాబట్టి ఈ ఉపదేశం తాను అర్జునుడికి చెప్తున్నాడు అని శ్రీ కృష్ణుడు అంటున్నాడు. కృష్ణ భగవానుడు దీని గూర్చి ఇంత స్పష్టంగా ఎందుకు చెప్తున్నాడంటే, ఇక్కడ భగవంతుడు తన కీర్తిని తానే ఎంతో అమితముగా ఇప్పుడు చెప్పుకోబోతున్నాడు. ‘అనసూయవే” అంటే ‘ఏవగించుకొనని వాడు’ అని కూడా అర్థం ఉంది. శ్రీ కృష్ణుడు తనను తానే పొగుడుకుంటున్నాడని ఆయన పట్ల ధిక్కారంతో ఉండేవారు, ఇటువంటి సందేశం విన్నా ఏమాత్రం ప్రయోజనం పొందరు. సరికదా, ‘చూడండి ఈ పొగరుబోతు వాడిని, తన గురించి తానే పోగుడుకుంటున్నాడు’ అని తలంచి, ఇంకా హాని కలుగచేసుకుంటారు.

గర్వం మరియు దురభిమానము వలన ఇటువంటి ధోరణి జనిస్తుంది మరియు అది ఒక వ్యక్తి యొక్క భక్తి పూర్వక పూజ్యభావాన్ని దెబ్బ తీస్తుంది. భగవంతునికి తనకంటూ కావలసినది ఏమీ లేదు, కాబట్టి ఆయన చేసే ప్రతి కార్యం జీవాత్మల సంక్షేమం కోసమే అన్న సామాన్య విషయాన్ని కూడా, ఈర్ష్యతో ఉన్న జనులు, అర్థం చేసుకోలేరు. జీవుల భక్తిని ఇనుమడింపచేయటానికే తన కీర్తిని తాను చెప్పుకుంటాడు, అంతేకానీ, మనకున్న అహంభావమనే ప్రాపంచిక దోషము ఆయనకు లేదు. అర్జునుడు ఉదారుడు, విశాలహృదయము కలవాడు, ఈర్ష్య అనే దోషము లేనివాడు కాబట్టి శ్రీ కృష్ణుడు ఈ అధ్యాయంలో చెప్పబోయే దానికి అర్జునుడు సంపూర్ణంగా అర్హుడే.

రెండవ అధ్యాయంలో శ్రీకృష్ణుడు ఆత్మ జ్ఞానాన్ని తెలియచెప్పాడు; అది దేహము (శరీరము) కన్నా వేరైన విలక్షణమైన తత్త్వము. అది గుహ్యమైన అంటే రహస్యమైన జ్ఞానము. ఏడవ మరియు ఎనిమిదవ అధ్యాయాల్లో, తన శక్తిసామర్థ్యముల యొక్క జ్ఞానాన్ని వివరించాడు; అది 'గుహ్యతరం' అంటే మరింత రహస్యమైనది. తొమ్మిదవ మరియు ఇంకా తదుపరి అధ్యాయాలలో శ్రీ కృష్ణుడు పవిత్రమైన తన భక్తి జ్ఞానాన్ని తెలియచేస్తాడు, ఇది గుహ్యతమము, అంటే అత్యంత రహస్యమైనది.