అవజానంతి మాం మూఢా మానుషీం తనుమాశ్రితమ్ ।
పరం భావమజానంతో మమ భూతమహేశ్వరమ్ ।। 11 ।।
అవజానంతి — నిర్లక్ష్యము చేసెదరు; మాం — నన్ను; మూఢా — తెలివితక్కువవారు; మానుషీం — మనుష్య; తనుం — రూపము; ఆశ్రితమ్ — తీసుకున్న; పరం — దివ్యమైన; భావమ్ — వ్యక్తిత్వము; అజానంతః — తెలుసుకోనివారై; మమ — నేను; భూత — సకల ప్రాణులు; మహేశ్వరమ్ — మహేశ్వరుడు.
Translation
BG 9.11: నేను నా సాకారమనుష్య రూపంలో అవతరించినప్పుడు, మూఢులు నన్ను గుర్తించలేకున్నారు. సకల భూతములకు మహేశ్వరుడైన నా వ్యక్తిత్వం యొక్క దివ్యత్వము వారికి తెలియదు.
Commentary
మంచి ఉపాధ్యాయులు ఒక్కోసారి తమ విద్యార్థులను వారి నిర్లక్ష్య ధోరణి నుండి బయటకు లాగి లోతుగా ఆలోచింపచేయటానికి, కఠినమైన పదాలు ఉపయోగిస్తుంటారు. ఇక్కడ శ్రీ కృష్ణుడు 'మూఢ' అన్న పదం వాడాడు, అంటే 'తెలివితక్కువ వాడా' అని అర్థం, దీనిని తన సాకార రూపాన్ని తిరస్కరించిన వారిని ఉద్దేశించి వాడాడు.
భగవంతుడు నిరాకారుడు మాత్రమే, సగుణసాకార రూపంలో రాలేడు అని చెప్పేవారు, భగవంతుడు సర్వసమర్థుడు సర్వశక్తిమంతుడు అనే నిర్వచనానికి విరుద్ధంగా చెప్పేవారే. పరమేశ్వరుడే, ఈ యొక్క వివిధ స్వరూపాలు, ఆకృతులు, రంగులతో నిండిన జగత్తును సృష్టించాడు. ఆయనే ఈ అసంఖ్యాకమైన జీవ స్వరూపాలను సృష్టించే అద్భుతమైన కార్యం చేసినప్పుడు, తన కోసం ఒక రూపాన్ని సృష్టించుకోలేడా? లేదా, భగవంతుడు ఇలా చెప్పాడా? ‘నాకు ఒక వ్యక్తిగత స్వరూపంలో వ్యక్తమయ్యే శక్తి లేదు, నేను కేవలం నిరాకార కాంతిని మాత్రమే’ అని. ఆయన ఒక సాకార స్వరూపం తీసుకోలేడు అని చెప్పటం, ఆయనను అసంపూర్ణుడుగా చేస్తుంది.
మనం, అతిచిన్న ఆత్మలము కూడా ఒక రూపాన్ని కలిగి ఉంటాము. ఎవరైనా, భగవంతుడు ఒక రూపాన్ని కలిగి ఉండడు అంటే, ఆయనకు మనుష్యుల కంటే తక్కువ శక్తి ఉంది అన్నట్టే. దేవుడు దోషరహితుడు మరియు సంపూర్ణుడు అవ్వటానికి, తన వ్యక్తిత్వానికి ఈ రెండు గుణాలు ఉండాలి — సాకార రూపము మరియు నిరాకార తత్త్వము. వైదిక గ్రంథాలు ఇలా పేర్కొన్నాయి:
అపశ్యం గోపాం అనిపద్యమానమా
(ఋగ్వేదం 1.22.164; 31వ సూక్తం)
‘గోపాలకుల కుటుంబంలో అవతరించి, ఎప్పటికీ వినాశము లేని, బాలుని రూపంలో, నాకు ఆ భగవంతుని దర్శనం అయింది.’
ద్విభూజం మౌన ముద్రాఢ్యమ్ వన మాలినమీశ్వరం
(గోపాల తాపని ఉపనిషత్తు 1.13)
‘పరమేశ్వరుడు అడవి-పూల మాలని ధరించి, తన వేణువుని ఊదుతాడు, తన చేతులతో మనోహరంగా మౌన ముద్ర వేసి ఉంటాడు’
గూఢం పరం బ్రహ్మ మనుష్య-లింగం
(భాగవతం 7.15.75)
‘అత్యంత నిగూఢమైన జ్ఞానం ఏమిటంటే, భగవంతుడు మనుష్య రూపం స్వీకరిస్తాడు అని తెలుసుకోవటం’
యత్రావతీర్ణో భగవాన్ పరమాత్మా నరాకృతిః
(భాగవతం 9.23.20)
‘ఆ కాలంలో, సర్వ-ఐశ్వర్యములు కలిగి ఉన్న సర్వోత్కృష్ట భగవానుడు, నరుని వంటి రూపంలో అవతరించాడు’
ఈశ్వరః పరమః కృష్ణః సచ్చిదానంద విగ్రహః
అనాదిరాదిర్ గోవిందః సర్వకారణ కారణం
(బ్రహ్మ సంహిత 5.1)
ఈ శ్లోకంలో, బ్రహ్మ గారు శ్రీకృష్ణుడిని ఈ విధంగా ప్రార్థించారు, ‘సనాతనుడూ, సర్వజ్ఞుడు, సచ్చిదానందుడూ అయిన శ్రీ కృష్ణుడి స్వరూపాన్ని నేను పూజిస్తాను. ఆయన ఆది-అంత్యము లేని వాడు మరియు సర్వ కారణ కారకుడు.’
కానీ, భగవంతుని యొక్క వ్యక్తిగత స్వరూప విషయంలో మనం గుర్తు ఉంచుకోవలసినది ఏమిటంటే, అది దివ్య మైనది (దివ్య మంగళ స్వరూపము), అంటే భౌతిక స్వరూపాల్లో కనిపించే దోషములకు అతీతమైనది. భగవత్ స్వరూపము సత్-చిత్-ఆనందము - అది నిత్యము, జ్ఞానవంతము మరియు దివ్య ఆనందముతో నిండి ఉన్నది.
అస్యాపి దేవ వపుషో మద్-అనుగ్రహస్య
స్వేచ్ఛా-మయస్య న తు భూత-మయస్య కో ఽపి
(భాగవతం 10.14.2)
ఈ శ్లోకంలో, బ్రహ్మ దేవుడు శ్రీ కృష్ణుడి ని ఇలా ప్రార్దిస్తున్నాడు. ‘ఓ భగవన్, మీ శరీరము పంచ-మహాభూతములతో చేయబడలేదు; అది దివ్యమైనది. మరియు మీరు ఈ రూపంలో మీ అభీష్టం ప్రకారమే, నావంటి జీవులపై కృప చేయటానికి, అవతరించారు.’
భగవత్ గీత నాలుగవ అధ్యాయంలో, శ్రీ కృష్ణుడు ఇలా అన్నాడు: ‘నేను జన్మ రహితుడనై ఉండి కూడా, సమస్త ప్రాణులకు స్వామినై ఉండి కూడా, నాశములేని వాడినై ఉండి కూడా, నేను ఈ లోకంలో నా యోగమాయా శక్తి చే, నా దివ్య స్వ-స్వరూపంలో కనిపిస్తుంటాను.’ (4.6). అంటే, భగవంతుడు ఒక స్వరూపాన్ని కలిగి ఉండటమే కాక ఈ లోకంలోకి అవతార రూపంలో దిగివస్తుంటాడు, అని అర్థం.
మనందరం ఆత్మలము, అనాదిగా ఈ లోకంలో జన్మలు తీసుకుంటూనే ఉన్నాము. భూలోకంలో ఇంతకు క్రితం భగవత్ అవతారము అయినప్పుడు కూడా మనం మానవ రూపంలోనే ఉండి ఉండవచ్చు. మనము ఆ అవతారాన్ని కూడా చూసి ఉండవచ్చు. కానీ, భగవంతుని స్వరూపము దివ్యమైనది మరియు మనకు ఉన్నవి ప్రాకృతిక కళ్ళు. కాబట్టి, మనం మన కళ్ళతో ఆయనను చూసినప్పుడు ఆయన వ్యక్తిత్వం యొక్క దివ్యత్వాన్ని గుర్తించలేకపోయాము.
భగవంతుని దివ్య స్వభావము ఎలాంటిదంటే, ఆయన దివ్యత్వము ఒక్కో మనిషికి వాని-వాని ఆధ్యాత్మిక శక్తి మేర అర్థం అవుతుంది. సత్త్వగుణము ప్రధానముగా ఉండేవారు, ఇలా అనుకుంటారు, ‘శ్రీ కృష్ణుడు ఒక అసాధారణ మనిషి. చాలా సామర్థ్యం ఉన్నవాడే కానీ, భగవంతుడు మాత్రం ఖచ్చితంగా కాడు.’ రజోగుణ ప్రభావంతో ఉన్నవారు, ‘అంత ప్రత్యేకమైనవాడేమీ కాదు, మన లాంటి వాడే’ అంటారు. తమోగుణ ప్రధానంగా ఉన్నవారు ఆయనను చూసినప్పుడు ఇలా అనుకుంటారు, ‘ఆయన అహంకారి మరియు చెడునడవడిక కలవాడు, మనకన్నా ఘోరమే.’ అని. కేవలం భగవత్ ప్రాప్తి పొందిన మహాత్ములు మాత్రమే ఆయనను భగవంతునిగా గుర్తిస్తారు, ఎందుకంటే వారికి భగవత్ కృపచే ఆ దివ్య దృష్టి లభించింది. కాబట్టి, ఎఱుకలేని భౌతిక దృక్పథంలో ఉన్న ఆత్మలు అయన ఈ లోకంలో అవతారం తీస్కున్నప్పుడు ఆయనను తెలుసుకోలేరు.