Bhagavad Gita: Chapter 9, Verse 15

జ్ఞానయజ్ఞేన చాప్యన్యే యజంతో మాముపాసతే ।
ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వతోముఖమ్ ।। 15 ।।

జ్ఞాన-యజ్ఞేన — జ్ఞాన సముపార్జన అనే యజ్ఞము; చ — మరియు; అపి — కూడా; అన్యే — ఇతరులు; యజంతః — పూజిస్తారు; మాం — నన్ను; ఉపాసతే — ఆరాధిస్తారు; ఏకత్వేన — అభేదభావ ఏకత్వముతో ; పృథక్త్వేన — వేరుగా; బహుధా — పలు రకముల; విశ్వతః-ముఖమ్ — విశ్వ రూపము.

Translation

BG 9.15: మరికొందరు, జ్ఞాన సముపార్జనా యజ్ఞములో నిమగ్నమై, నన్ను చాలా రకాలుగా ఆరాధిస్తారు. కొందరు నన్ను తమతో అభేదమైన ఏకత్వముగా చూస్తారు, మరికొందరు నన్ను తమకంటే వేరుగా పరిగణిస్తారు. ఇంకా కొందరు నా యొక్క విశ్వ రూపము యొక్క అనంతమైన ఆవిర్భావములలో ఆరాధిస్తారు.

Commentary

సాధకులు (ఆధ్యాత్మిక అభ్యాసము చేసేవారు), పరమ సత్యాన్ని చేరుకోవటానికి భిన్నభిన్న పద్ధతులను అనుసరిస్తుంటారు. శ్రీ కృష్ణుడు ఇంతకు క్రితం భక్తుల గురించి చెప్పాడు. వారు, ఆయన నిత్య అంశములుగా, సేవకులగా భగవంతుని చరణారవిందముల వద్ద భక్తితో శరణాగతి చేస్తారు. ఇక ఇప్పుడు సాధకులు అనుసరించే మరికొన్ని వేరే పద్ధతులను వివరిస్తున్నాడు.

జ్ఞాన యోగమును అనుసరించేవారు తమను తాము భగవంతునికి అభేదమే అని పరిగణించుకుంటారు. వారు ‘సోహం’ (నేను అది), ‘శివోహం’ (నేను శివుడను) మొదలైన సూత్రాలపై లోతుగా ధ్యానం చేస్తుంటారు. అద్వైత బ్రహ్మముగా, ఆ సర్వోత్కృష్ట అస్తిత్వము యొక్క ప్రాప్తియే, వారి యొక్క సర్వోన్నత లక్ష్యం; దానికి శాశ్వతత్వము, జ్ఞానము, మరియు ఆనందము వంటి గుణములు ఉన్నా, రూపములు, గుణములు, స్వభావములు, మరియు లీలలు ఉండవు. శ్రీ కృష్ణుడు అనేదేమిటంటే అటువంటి జ్ఞాన యోగులు కూడా తనను, నిరాకార, సర్వవ్యాప్త తత్త్వంలో ఆరాధిస్తారు అని అంటున్నాడు. వీరితో పోల్చితే, పలు రకాల అష్టాంగ యోగులు మొదలైనవారు ఉన్నారు, వారు తమను తాము భగవంతుని కంటే వేరుగా పరిగణించుకుంటారు మరియు అదే ప్రకారంగా ఆయనతో అనుసంధానం అవుతారు.

ఇంకా కొందరు ఈ కంటికి కన్పించే వ్యక్తమైన విశ్వాన్ని భగవంతునిగా ఆరాధిస్తారు. వైదిక తత్త్వములో దీనిని 'విశ్వ రూప ఉపాసన' అంటారు. పాశ్చాత్య తత్త్వశాస్త్రం లో దీనిని పాన్థీఇసమ్ (Pantheism) అంటారు; ఇది గ్రీకు పదాలైన ‘pan’ (పాన్) అంటే సమస్తము మరియు ‘theos’, ‘థియోస్’ అంటే భగవంతుడు, అన్న పదాల నుండి వచ్చింది. దీని యొక్క ప్రఖ్యాత ప్రతిపాదకుడు, స్పినోజా (Spinoza) అనే ఆయన. ఈ జగత్తు భగవంతునిలో భాగమే కాబట్టి దాని పట్ల దైవీ భావము తప్పేమీ కాదు, కానీ అది అసంపూర్ణము. అటువంటి భక్తులకు, పరమేశ్వరుని యొక్క ఇతర విభూతుల పట్ల జ్ఞానం ఉండదు, ఉదాహరణకి బ్రహ్మన్ (భగవంతుని అద్వైత సర్వ-వ్యాప్త అస్తిత్వము), పరమాత్మ (సర్వ భూతముల హృదయములో కూర్చుని ఉన్న పరమాత్మ), మరియు భగవంతుడు (భగవంతుని వ్యక్తిగత దివ్య మంగళ స్వరూపము).

మరైతే ఇన్ని రకాల భిన్న పద్ధతులు ఒకే దేవుడిని ఎలా ఆరాధిస్తాయి? శ్రీ కృష్ణుడు తదుపరి శ్లోకాలలో దీనికి సమాధానం చెప్తున్నాడు.