Bhagavad Gita: Chapter 9, Verse 19

తపామ్యహమహం వర్షం నిగృహ్ణామ్యుత్సృజామి చ ।
అమృతం చైవ మృత్యుశ్చ సదసచ్చాహమర్జున ।। 19 ।।

తపామి — వేడిని ప్రసరించు; అహం — నేను; అహం — నేను; వర్షం — వాన; నిగృహ్ణామి — నిలువరించు; ఉత్సృజామి — పంపించుట; చ — మరియు; అమృతం — అమరత్వం; చ — మరియు; ఏవ — కూడా; మృత్యుః — మరణము; చ — మరియు; సత్ — శాశ్వతమైన ఆత్మ; అసత్ — నశ్వరమైన భౌతికపదార్థములు; చ — మరియు; అహం — నేను; అర్జున — అర్జునా.

Translation

BG 9.19: నేను సూర్యుని రూపంలో వేడిమిని ప్రసరిస్తాను, మరియు నేనే వర్షమును ఆపుతాను, కురిపిస్తాను. నేనే అమరత్వమును మరియు నేనే మృత్యు రూపంలో వస్తాను. ఓ అర్జునా, నేనే ఆత్మను, నేనే పదార్థమును కూడా.

Commentary

భగవంతుడు మొదట ఈ విశ్వమును సృష్టించినప్పుడు, ఆయన మొట్టమొదట బ్రహ్మను సృష్టించి, ఆయనకే తదుపరి సృష్టి చేయటం అప్పగించాడు, అని పురాణాలు పేర్కొంటున్నాయి. ఈ సూక్ష్మమైన ప్రాకృతిక శక్తి నుండి సమస్త భౌతిక పదార్థమును, జీవ రాశులను సృష్టించే పని ఎలాచేయాలని బ్రహ్మ గారు అయోమయానికి గురయ్యాడు. ఆ తర్వాత భగవంతుడు అతనికి జ్ఞానాన్ని తెలియచేసాడు, దానినే చతుశ్లోకీ భాగవతము (నాలుగు శ్లోకముల భాగవతము) అంటారు, దీని ఆధారంగా బ్రహ్మగారు సృష్టి కార్యమును ప్రారంభించాడు. దాని యొక్క మొదటి శ్లోకం స్పష్టంగా ఇలా పేర్కొంటున్నది:

అహమేవాసమేవాగ్రే నాన్యద్యత్సదసత్ పరం
పశ్చాదహం యదేతచ్చ యోఽవశిశ్యేత సోఽస్మ్యహం

(భాగవతం 2.9.32)

శ్రీ కృష్ణుడు బ్రహ్మ గారికి ఇలా చెప్తాడు: ‘ఉన్నదంతా నేనే. సృష్టికి ముందు నేనొక్కడిని మాత్రమే ఉన్నాను. ఇక ఇప్పుడు సృష్టి ప్రారంభమైనది కాబట్టి బాహ్యంగా వ్యక్తమైన ఈ జగత్తు అంతా నా స్వరూపమే. ఇదంతా లయమై పోయిన తరువాత, నేను మాత్రమే ఉంటాను. నేను కానిది వేరే ఏమీ లేదు.’

ఈ పై యదార్థము మనకు సూచించేదేమిటంటే మనం ఈశ్వర ఆరాధనకు వాడే ద్రవ్యములు కూడా ఈశ్వరుడే. పవిత్ర గంగా నదిని పూజించేటప్పుడు జనులు, శరీరం క్రింది భాగం వరకు మునిగి, దోసిట్లోకి నీరు తీసుకుని మరల గంగ లోనికే పోస్తారు. ఈ ప్రకారంగా, గంగమ్మ ను అరాధించటాకి వారు గంగా నీటినే ఉపయోగిస్తారు. అదే విధంగా, ఉన్నదంతా భగవంతుడే కాబట్టి, ఆయనను ఆరాధించటానికి వాడే ద్రవ్యము కూడా ఆయన కంటే అభేదమే. ఈ విధంగా, ఇంతకు క్రితం 16వ మరియు 17వ శ్లోకాలలో చెప్పబడినట్టు, శ్రీ కృష్ణుడు, తనే - వేదము, యజ్ఞ అగ్ని, ఓం కారము, ఆజ్యము, మరియు సమర్పించే కార్యము - అని తెలియచేస్తున్నాడు. మన భక్తి యొక్క భావ, స్వరూప పద్ధతి ఏదైనా, ఆయన కానిది ఏమీ మనము ఆయనకు ఇవ్వలేము. ఐనప్పటికీ, మనకున్న ప్రేమ భావమే భగవంతుడిని ప్రసన్నం చేస్తుంది కానీ, మనం సమర్పించే ద్రవ్యము కాదు.