Bhagavad Gita: Chapter 9, Verse 2

రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమమ్ ।
ప్రత్యక్ష్యావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయమ్ ।। 2 ।।

రాజ-విద్యా — అన్ని విద్యలకెల్లా రారాజు; రాజ-గుహ్యం — అత్యంత రహస్యమైనది; పవిత్రం — పవిత్రమైనది; ఇదం — ఇది; ఉత్తమం — సర్వోన్నతమైనది; ప్రత్యక్ష — ప్రత్యక్ష్యముగా గమనించగలిగినది; అవగమం — నేరుగా అనుభవించగలిగినది; ధర్మ్యం — పవిత్రమైనది; సు-సుఖం — సులువైనది; కర్తుం — అభ్యాసము చేయటానికి; అవ్యయం — శాశ్వతమైనది.

Translation

BG 9.2: ఈ జ్ఞానము అన్ని విద్యలకు రారాజు మరియు అత్యంత గోప్యమయినది. ఇది విన్న వారిని పవిత్రం చేస్తుంది. ఇది నేరుగా అనుభవపూర్వకంగా తెలుసుకోవటానికి వీలైనది, ధర్మ బద్ధమైనది, ఆచరించటానికి సులువైనది, శాశ్వతమైన ఫలితమును ఇచ్చేటటువంటిది.

Commentary

రాజ అంటే రాజు/ప్రముఖుడు/ముఖ్యుడు అని అర్థం. శ్రీ కృష్ణుడు, తాను ఉపదేశించే జ్ఞానం యొక్క సర్వోత్కృష్ట స్థాయిని వక్కాణించటానికి ‘రాజ’ అన్న ఉపమానం వాడుతున్నాడు.

విద్యా అంటే ‘శాస్త్రము లేదా జ్ఞానము’. తన ఉపదేశాన్ని విశ్వాసము, మతము, అభిప్రాయము, ఆచారము, లేదా నమ్మకము అని ఆయన అనటంలేదు. తను అర్జునుడికి చెప్పబోయేది, అన్ని శాస్త్రాలలో కెల్లా రారాజు అని ప్రకటిస్తున్నాడు.

గుహ్య అంటే, ‘రహస్యము’ ఈ జ్ఞానము అత్యంత గోప్యమైనది కూడా. ఎంపికా స్వేచ్ఛ ఉన్నచోటే ప్రేమ సాధ్యమవుతుంది కాబట్టి కావాలనే భగవంతుడు తను నేరుగా సునాయాసముగా కనబడకుండా తనను తాను దాచి ఉంచుకుంటాడు; దీని ద్వారా ఆత్మకు భగవంతుడిని ప్రేమించాలా లేదా అనే స్వేచ్ఛ ఇస్తాడు. ఒక యంత్రము ప్రేమించలేదు ఎందుకంటే దానికి ఎంచుకునే స్వేచ్ఛ ఉండదు. మనం ఆయనను ప్రేమించాలని భగవంతుడు కోరుకుంటాడు, అందుకే మనకు ఆయనను కోరుకోవాలా లేదా అన్న స్వేచ్ఛను ఇస్తున్నాడు; దాన్ని మన ఇష్టానికే వదిలివేస్తున్నాడు. కేవలం మనం ఎంచుకున్న మార్గం వలన కలిగే పరిణామాలను మాత్రం తెలియచెప్తాడు, మరియు ఏ మార్గం అవలంబించాలనే స్వేచ్ఛను మనకే వదిలివేస్తాడు.

పవిత్రం అంటే పవిత్రమైన/స్వచ్ఛమైన అని. భక్తి యొక్క జ్ఞానము అత్యంత పవిత్రమైనది ఎందుకంటే అది అల్పమైన స్వార్థముచే కళంకితం కానిది. అది భగవంతుని దివ్య ప్రేమ బలిపీఠము యందు ఆత్మ సమర్పణకి ప్రేరణ ఇస్తుంది. భక్తుడి యొక్క పాపములు, బీజములు మరియు అవిద్యను భక్తి సాధన, నాశనం చేస్తుంది. పాపములు అంటే జీవుడి అనంతమైన పూర్వ-జన్మల నుండీ ఉన్న పాపరాశి. నిప్పు గడ్డిమూటని భస్మం చేసినట్టు, పాపరాశినంతటినీ భక్తి దహించివేస్తుంది. బీజములు అంటే మనస్సులో ఉన్న మాలిన్యములు, ఇవి పాపపు పనులు చేయటానికి ఉన్న మూల కారణం. ఈ బీజములు ఉన్నంతకాలం, కేవలం పూర్వ జన్మల పాపపు కర్మరాశిని నిర్మూలిస్తే సరిపోదు. ఎందుకంటే పాపపు పనులు చేయాలనే కోరిక హృదయంలో ఉండిపోతుంది మరియు వ్యక్తి తిరిగి పాపపు పనులు చేసే అవకాశం ఉంటుంది. భక్తి, హృదయాన్ని పవిత్రం చేస్తుంది, పాపాల యొక్క మూల బీజాలైన – కామము, క్రోధము, మరియు లోభములను నాశనం చేస్తుంది. కానీ, ఈ బీజముల నాశనం కూడా సరిపోదు. హృదయం మలినమవటానికి ఉన్న అసలు కారణం అవిద్య (అజ్ఞానం), దీనిచే మనలని మనం ఈ దేహమే అనుకుంటాము. ఈ యొక్క తప్పుడు అనుసంధానం వలన, ఈ శరీరమే మనము అనుకుంటాము, దానితో శారీరక కోరికలను సృష్టించుకుని, అవే మనకు సంతోషాన్ని ఇస్తాయి అనుకుంటాము. ఇటువంటి భౌతిక ప్రాపంచిక కోరికలు తీర్చుకోవటం అనేది, మరింత కామ, క్రోధ, లోభములు, ఇంకా ఇతర మలినముల వృద్ధికి దారి తీస్తుంది. మనస్సు పరిశుద్ధి చేయబడినా, అజ్ఞానము/అవిద్య ఉన్నంత కాలము, అది మరలా మాలిన్యమైపోతుంది. భక్తి అనేది అంతిమంగా - ఆత్మ మరియు భగవంతుని యొక్క అనుభవపూర్వక జ్ఞానానికి దారి తీస్తుంది, అది భౌతిక ప్రాపంచిక అస్తిత్వము యొక్క అజ్ఞానాన్ని నాశనం చేస్తుంది. భక్తి యొక్క ప్రయోజనములు ‘భక్తి రసామృత సింధు’ అనే పుస్తకంలో ఇలా వివరించబడ్డాయి: క్లేశస్తు పాపం తద్బీజం అవిద్యా తే త్రిధా (1.1.18) ‘భక్తి అనేది మూడు విషాలను నాశనం చేస్తుంది – పాపములు, బీజములు, అవిద్య”. ఈ మూడు సంపూర్ణముగా నాశనమైనప్పుడే హృదయం అనేది నిజముగా, శాశ్వతముగా పవిత్రమైనట్టు.

ప్రత్యక్ష అంటే ‘నేరుగా/ప్రత్యక్షముగా అనుభవించదగినది’ అని. విశ్వాసంతో వేసే మొదటి అడుగుతో, భక్తి శాస్త్రము యొక్క అభ్యాసము, ప్రారంభమవుతుంది మరియు భగవంతుని ప్రత్యక్ష్య అనుభవమును ఫలితముగా ఇస్తుంది. వేరే శాస్త్రముల కంటే ఇది భిన్నమేమీ కాదు, వాటిలో కూడా ఒక ప్రయోగాన్ని ఓ సిద్ధాంతంతో ప్రారంభించి దానిని నిరూపించబడ్డ ఫలితాలతో ముగిస్తాము.

ధర్మ్యం అంటే ‘ధార్మికమైన’ అని. భౌతిక ప్రాపంచిక కోరికలరహితంగా చేసే భక్తి అత్యంత పవిత్రమైన పని. గురుసేవ వంటి ధర్మకార్యముల వలన అది నిరంతరం పెంచిపోషించబడుతుంది.

కర్తుం సుసుఖం అంటే, ‘ఆచరించటానికి చాలా సులువైనది.’ భగవంతుడికి మన నుండి ఏమీ అవసరం లేదు; మనం ఆయనను ప్రేమించటం నేర్చుకుంటే, ఆయనను చాలా సహజంగానే పొందవచ్చు.

ఇది సర్వోత్కృష్ట శాస్త్రము మరియు ఆచరించటానికి కూడా సులువైనది అయినప్పుడు, జనులు దీనిని నేర్చుకోవటానికి ఎందుకు మొగ్గు చూపరు? శ్రీ కృష్ణుడు దీన్ని తదుపరి వివరిస్తాడు.