క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వచ్ఛాంతిం నిగచ్ఛతి ।
కౌంతేయ ప్రతిజానీహి న మే భక్తః ప్రణశ్యతి ।। 31 ।।
క్షిప్రం — త్వరగానే; భవతి — అగును; ధర్మ-ఆత్మా — ధర్మాత్ముడిగా; శశ్వత్-శాంతిం — శాశ్వతమైన శాంతి; నిగచ్ఛతి — పొందును; కౌంతేయ — అర్జునా, కుంతీ పుత్రుడు; ప్రతిజానీహి — ప్రకటించుము; న — ఎన్నటికి కాదు; మే — నా యొక్క; భక్తః — భక్తుడు; ప్రణశ్యతి — నశించుట.
Translation
BG 9.31: త్వరితగతిన వారు ధర్మాత్ములుగా అవుతారు, మరియు శాశ్వతమైన శాంతిని పొందుతారు. ఓ కుంతీ పుత్రుడా, నా భక్తుడు ఎన్నటికీ నష్టమునకు గురికాడు అని ధైర్యముగా ప్రకటించుము.
Commentary
కేవలం సరియైన నిర్ణయం తీసుకున్నంత మాత్రాన భక్తులు ధర్మాత్ములుగా ఎందుకు పరిగణించబడాలి? వారు అనన్య భక్తి మార్గంలో, భగవంతుని యందు దృఢ-విశ్వాసంతో ప్రయాణించటం కొనసాగిస్తూనే ఉంటే, వారి హృదయములు పవిత్రమౌతాయి మరియు వారు శీఘ్రముగా ధార్మిక గుణాలను పెంపొందించుకుంటారు, అని శ్రీ కృష్ణుడు ఇక్కడ వివరిస్తున్నాడు.
దైవీ గుణములు భగవంతుని నుండే ఉద్భవిస్తాయి. ఆయన సంపూర్ణ దోషరహితుడు, సత్యసంధుడు, కరుణామయుడు, ప్రేమమూర్తి, దయాళువు మొదలైన గుణాలు కలవాడు. మనము ఆయన యొక్క అణు-అంశములము కాబట్టి, మనం కూడా ఆ దైవీ గుణముల పట్ల ఆకర్షితులమౌతాము. కానీ, ధర్మాత్ములమయ్యే పద్ధతి ఇప్పటికీ ఒక అంతుచిక్కని రహస్యముగా ఉంది. చిన్నపటినుండి మనం విన్నాము, సత్యమే పలకాలి, ఇతరులకు సేవ చేయాలి, కోపము విడిచిపెట్టాలి వంటివి, కానీ మనం ఇంకా ఆ ఉపదేశాలని ఆచరణలోకి తేలేక పోతున్నాము, ఎందుకంటే, మన మనస్సు కల్మషములతో అపవిత్రంగా ఉంది. మనస్సు పరిశుద్ధం కాకుండా, మన వ్యక్తిత్వంలోని దోషాలు పూర్తిగా, శాశ్వతంగా నిర్మూలించబడలేవు. జగద్గురు శ్రీ కృపాలుజీ మహారాజ్, దైవీ గుణములు పెంపొందించు కోవటం కోసం ఉన్న తిరుగు లేని సత్యాన్ని ఇక్కడ ప్రకటిస్తున్నాడు.
సత్య అహింసా ఆది మన! బిన హరి భజన న పాయ
జల తే ఘృత నికలే నహీఁ, కోటిన కరియ ఉపాయ
(భక్తి శతకం, 35వ శ్లోకం)
‘బట్ట మీద ఉన్న నూనె మరకలు ఎంత ప్రయత్నించినా, నీటిచే తొలగించబడలేవు, అదే విధంగా, సత్యసంధత, అహింస, మరియు ఇతర సు-గుణములను, భగవంతుని పట్ల భక్తితో నిమగ్నమవకుండా పొందలేము.’ మనస్సు పరిశుద్ధి అయినప్పుడు ఈ గుణములు ప్రకటితమవుతాయి; మరియు మనస్సు యొక్క శుద్ధి (అంతఃకరణ శుద్ధి) అనేది, దాన్ని పరమ పవిత్రమైన భగవంతుని పై లగ్నం చేయకుండా, అవ్వదు.
అంతేకాక, శ్రీ కృష్ణుడు అర్జునుడిని, తన భక్తులు ఎన్నటికీ నశించరు, అని ధైర్యంగా ప్రకటించమంటున్నాడు. ఆయన ఈ విషయంలో, ‘జ్ఞానులు నశింపరు’ లేదా ‘కర్మీ (కర్మ కాండలు చేసేవారు) లు నశింపరు’ అని అనటం లేదు. ఆయన ఈ వాగ్దానాన్ని తన భక్తుల పట్ల మాత్రమే చేస్తున్నాడు; వారు ఎప్పుడూ పాడైపోరు అని అంటున్నాడు. ఈ విధంగా ఆయన, 9.22 శ్లోకంలో చెప్పిన దానిని పునరుద్ఘాటిస్తున్నాడు - తన పైనే ఆధార పడిన వారి మరియు తనపట్ల అనన్య భక్తితో ఉన్నవారి యొక్క యోగక్షేమములు తనే స్వయంగా చూసుకుంటాను అని.
శ్రీ కృష్ణుడు, ఈ విషయం ప్రకటించమని, అర్జునుడిని ఎందుకు అడుగుతున్నాడు? తనే ప్రకటించవచ్చుగా? అన్న విషయం కొంత నిగూఢమైనదిగా అనిపించవచ్చు. దీనికి కారణం ఏమిటంటే, కొన్ని ప్రత్యేక పరిస్థితులలో భగవంతుడు తను ఇచ్చిన మాటను తప్పుతాడు, కానీ తన భక్తుని మాటని ఎన్నటికి తప్పేటట్టు చెయ్యడు. ఉదాహరణకి, మహాభారత యుద్ధంలో ఆయుధం పట్టనని శ్రీ కృష్ణుడు శపథం చేసాడు. కానీ, ఎప్పుడైతే తన పరమ భక్తుడైన భీష్ముడు, మరుసటి రోజు తను అర్జునుడిని సంహరిస్తాను లేదా కృష్ణుడిచే ఆయుధం పట్టిస్తాను అని శపథం చేశాడో, భీష్ముని మాటనే నెగ్గించటానికి శ్రీ కృష్ణుడు తన స్వంత శపథాన్ని పక్కన పెట్టాడు. ఈ విధంగా, తను చెప్పిన దాని యొక్క బలాన్ని పునరుద్ఘాటించటానికి, శ్రీ కృష్ణుడు ‘అర్జునా, నా భక్తుడు ఎప్పటికి నశింపడు అని, నీవు చెప్పుము, ఎందుకంటే నీ మాట ఎప్పటికి నిలుస్తుంది అని నేను హామీ ఇస్తాను.’ అని అంటున్నాడు.