మాం హి పార్థ వ్యపాశ్రిత్య యేఽపి స్యుః పాపయోనయః ।
స్త్రియో వైశ్యాస్తథాశూద్రాః తేఽ పి యాంతి పరాం గతిమ్ ।। 32 ।।
మాం — నా యందే; హి — నిజముగా; పార్థ — అర్జునా, ప్రిథ పుత్రుడా; వ్యపాశ్రిత్య — ఆశ్రయమును పొంది (శరణుజొచ్చి); యే — ఎవరైతే; అపి — అయినా సరే; స్యుః — అయినా కూడా; పాప యోనయః — నిమ్న స్థాయి జన్మ; స్త్రియః — స్త్రీలు; వైశ్యః — వైశ్యులు; తథా — మరియు; శూద్రః — కార్మికులు; తే అపి — వారు కూడా; యాంతి — వెళ్లెదరు; పరాం — పరమ (సర్వోన్నత); గతిం — గమ్యమును.
Translation
BG 9.32: వారి జన్మ, జాతి, కులము ఏదైనా, లింగభేదం లేకుండా, సమాజము అసహ్యించుకునేవారయినా, నన్నుశరణుజొచ్చిన వారంతా పరమ పదమును పొందుతారు.
Commentary
ధార్మిక కుటుంబాలలో జన్మించే భాగ్యశాలి జీవులు (జీవాత్మలు), చిన్నతనం నుండే మంచి విలువలు మరియు ధార్మిక జీవనము యొక్క శిక్షణ పొందుతారు. ఇది వారి పూర్వ జన్మల పుణ్య ఫలం. అదే సమయంలో, మరి కొందరు జీవులు - తాగుబోతులు, నేరగాళ్ళు, వ్యసనపరులు, మరియు నాస్తికుల కుంటుంబాలలో పుట్టే దురదృష్టం ఉంటుంది. ఇది కూడా, తమ తమ పూర్వ జన్మలలో ఉన్న పాప ఫలితమే.
ఇక్కడ శ్రీకృష్ణుడు అనేదేమిటంటే, ఈ జీవి అయినా వాటి వాటి జన్మ, లింగ, కుల, లేదా జాతి భేదము లేకుండా ఎవరైనా భగవంతుడిని సంపూర్ణముగా ఆశ్రయిస్తే, వారు సర్వోత్కృష్ట లక్ష్యమును పొందుతారు, అని. అందరికీ అందుబాటులో ఉండే భక్తి మార్గము యొక్క గొప్పదనం దీని ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. కానీ, ఇతర మార్గాల్లో అర్హత కొరకు చాలా కఠిన నియమాలు ఉంటాయి.
జ్ఞాన యోగ పథంలో, అర్హత కొరకు, జగద్గురు శంకరాచార్య ఈ విధంగా పేర్కొన్నాడు:
వివేకినో విరక్తస్య శమాదిగుణ శాలినః
ముముక్షోరైవ హి బ్రహ్మ జిజ్ఞాసా యోగ్యతా మతాః
‘వివేకము, విరక్తి, నియంత్రించబడిన మనో-ఇంద్రియములు, మరియు మోక్షము కొరకు తీవ్ర వాంఛ — ఈ నాలుగు లక్షణాలు కలవారు మాత్రమే — జ్ఞాన యోగ మార్గాన్ని అవలంబించటానికి అర్హులు.’
కర్మ కాండ (వైదిక క్రతువులు) మార్గములో, ఆరు నిబంధనలు పాటించబడాలి:
దేశే కాల ఉపాయేన ద్రవ్యం శ్రద్ధా సమన్వితమ్
పాత్రే ప్రదీయతే యత్తత్ సకలం ధర్మ లక్షణమ్
‘కర్మ కాండలు సాఫల్యం చెందటానికి ఆరు నిబంధనలు పాటించబడాలి — సరియైన స్థానము, సరియైన సమయము, సరైన పద్ధతి మరియు దోషరహిత మంత్ర ఉచ్చారణ, స్వచ్ఛమైన ద్రవ్యమునే ఉపయోగించుట, యజ్ఞము చేపించే అర్హత కలిగిన బ్రాహ్మణుడు, మరియు ఆ క్రతువు మీద పూర్ణ విశ్వాసము - ఇవన్నీ ఉండాలి.’
అష్టాంగ యోగ మార్గములో కూడా, కఠినమైన నియమాలు ఉన్నాయి:
శుచౌ దేశే ప్రతిష్ఠాప్య (భాగవతం 3.28.8)
‘సరియైన ఆసనంలో నిశ్చలంగా కూర్చుని, హఠ యోగమును ఒక పవిత్రమైన ప్రదేశంలో చేయండి.’
వీటన్నిటితో పోలిస్తే, భక్తి యోగము ఎంత సులువంటే, ఎవరైనా, ఏ సమయంలో నైనా, ఏ ప్రదేశంలో నైనా, ఏ పరిస్థితిలో అయినా, ఏ పదార్థముతో నైనా, అది చేయబడవచ్చు.
న దేశ నియమస్తస్మిన్ న కాల నియమస్థథా (పద్మ పురాణం)
ఈ శ్లోకం ఏం చెప్తున్నదంటే, భగవంతుడికి మనము భక్తితో ఆరాధించే సమయము, ప్రదేశముతో సంబంధము లేదు. ఆయన కేవలం మన హృదయంలోని ప్రేమనే చూస్తాడు. అన్ని ఆత్మలు (జీవులు) భగవంతుని బిడ్డలే. ప్రేమతో తన దగ్గరికి వస్తే అందరినీ తన చేతులు చాచి స్వీకరించటానికి ఆయన సుముఖంగా ఉన్నాడు.