Bhagavad Gita: Chapter 9, Verse 4

మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా ।
మత్ స్థాని సర్వభూతాని న చాహం తేష్వవస్థితః ।। 4 ।।

మయా — నా చేత; తతమ్ — వ్యాపింపబడి; ఇదం — ఇది; సర్వం — సమస్త; జగత్ — జగత్తు; అవ్యక్త-మూర్తినా — అవ్యక్త రూపంలో; మత్ స్థాని — నా యందు; సర్వ-భూతాని — సర్వ ప్రాణులు; న — కాదు; చ — మరియు; అహం — నేను; తేషు — వాటి యందు; అవస్థితః — స్థితుడై.

Translation

BG 9.4: ఈ సమస్త విశ్వమూ నా అవ్యక్త స్వరూపంచే వ్యాపింపబడి ఉన్నది. సమస్త ప్రాణులు నా యందే స్థితమై ఉన్నాయి కాని నేను వాటి యందు స్థితుడనుకాను.

Commentary

భగవంతుడు ఈ ప్రపంచాన్ని సృష్టించి, ఆ తరువాత, ఈ ప్రపంచమంతా బాగానే నడుస్తున్నదా లేదా అని ఆ సప్త లోకాల పై నుండి తొంగి చూస్తుంటాడనే సిద్ధాంతాన్ని వైదిక తత్త్వము ఒప్పుకోదు. వైదిక శాస్త్రాలు అన్నీ భగవంతుడు లోకంలో సర్వ వ్యాపి అని పదేపదే ప్రతిపాదించాయి:

ఏకో దేవః సర్వభూతేషు గూఢః సర్వవ్యాపీ

(శ్వేతాశ్వతర ఉపనిషత్తు 6.11)

‘ఉన్నది ఒకటే భగవంతుడు; ఆయనే అందరి హృదయములో స్థితుడై ఉన్నాడు; ప్రపంచంలో అంతటా కూడా వ్యాపించి ఉన్నాడు.’

ఈశావాస్యం ఇదం సర్వం యత్ కించ జగత్యాం జగత్

(ఈశోపనిషత్తు 1)

‘భగవంతుడు లోకంలో అంతటా ఉన్నాడు’

పురుష ఏవేదం సర్వం, యద్ భూతం యచ్చ భవ్యం

(పురుష సూక్తం, ఋగ్వేదం)

‘భగవంతుడు ఇప్పటి వరకు ఉన్న అన్నింటిలో వ్యాప్తమై ఉన్నాడు మరియు ఇకముందు ఉండే అన్నింటిలో వ్యాపించి ఉంటాడు’

భగవంతుడు సర్వ వ్యాపి అన్న విషయాన్ని పలువిధాలుగా అర్థం చేసుకుంటారు. కొంతమంది తూర్పు దేశ తత్త్వవేత్తలు, ఈ లోకము, భగవంతుని పరిణామమే (transformation) అని నమ్ముతారు. ఉదాహరణకి, పాలు అనేవి ఒక కల్మషములేని పదార్థము. పుల్లని పదార్థ సంపర్కంచే అది పెరుగు గా మారుతుంది. అంటే, అది మారినప్పుడు, పెరుగు అనేది పాల యొక్క పరిణామమే. ఈ ప్రకారంగా, పరిణామ వాద ప్రవక్తలు, భగవంతుడే ఈ జగత్తు లాగ మారిపోయాడు అని చెప్తారు.

మరికొందరు తత్త్వవేత్తలు, ఈ జగత్తు వివర్తము (ఒక వస్తువును ఇంకోలా తప్పుగాఅనుకోవటం) అంటారు. ఉదాహరణకి, చీకట్లో ఒక తాడుని పాములా అనుకోవచ్చు. వెన్నెలలో మెరిసే నత్తగుల్లని వెండిగా పోరపాటుపడవచ్చు. అదే విధంగా, వారు అనేదేమిటంటే, ఉన్నదంతా దేవుడే, ఈ లోకం లేదు అని; మనం జగత్తుగా చూసేదంతా నిజానికి బ్రహ్మమే, అని.

కానీ, 7.4వ మరియు 7.5వ శ్లోకాల ప్రకారం ఈ జగత్తు పరిణామము కాదు, వివర్తమూ కాదు. అది భగవంతుని యొక్క మాయా శక్తి అనే భౌతిక శక్తి ద్వారా సృష్టించబడినది. జీవాత్మలు కూడా భగవంతుని శక్తి స్వరూపమే, కానీ వారు ఆయన యొక్క ఉత్కృష్ట స్థాయి, జీవ శక్తి. కాబట్టి ఈ ప్రపంచము మరియు దానిలో ఉన్న అన్ని జీవులు రెండూ భగవంతుని శక్తి స్వరూపములే మరియు ఆయన వ్యక్తిత్వము లోని భాగములే. అయినా, తను సర్వ భూతములకు అతీతుడను (వాటి యందు పరిమితమై వసించను) అని చెప్తున్నాడు; అంటే పరిమితమైన వాటి యందు, అనంతమై ఉన్నది, ఇమిడి ఉండలేదు. ఇది ఎందుకంటే ఆయన ఈ రెండు శక్తి స్వరూపాల మొత్తం కన్నా ఎంతో ఎక్కువైనవాడు. ఎలాగైతే సముద్రము ఎన్నో అలలను విడుదల చేస్తుంటుందో, మరియు ఈ అలలన్నీ సముద్రము లోని భాగములే అయినా, సముద్రము అనేది ఈ సమస్త అలల మొత్తానికన్నా ఎంతో ఎక్కువే. అదే విధంగా, జీవులు మరియు మాయ భగవంతుని వ్యక్తిత్వంలోని భాగమే, అయినా, ఆయన వాటికన్నా ఉన్నతుడు, అతీతుడు.