1వ అధ్యాయము: అర్జున విషాద యోగము

అర్జున విషాద యోగము

దాయాదులైన కౌరవులు, పాండవుల మధ్య మొదలవ్వబోతున్న మహాభారత సంగ్రామ యుద్ధ భూమియందు భగవద్గీత చెప్పబడింది. ఈ భారీ యుద్ధానికి దారి తీసిన పరిణామాల యొక్క వివరణాత్మక వర్ణన ఈ పుస్తకం యొక్క ఉపోద్ఘాతం అధ్యాయంలో, "భగవద్గీత సమయ పరిస్థితి అనే భాగంలో చెప్పబడింది.


ధృతరాష్ట్ర మహారాజు, అతని మంత్రి సంజయునికి మధ్య జరిగిన సంభాషణ రూపంలో భగవద్గీత విశదీకరింపబడటం మొదలు అవుతుంది. ధృతరాష్ట్రుడు అంధుడైన కారణం చేత, తానే స్వయంగా యుద్ధభూమి యందు లేడు, అందుకే సంజయుడు అతనికి యుద్ధ రంగ విశేషాలని యథాతథంగా చెప్పుచున్నాడు. సంజయుడు, మహాభారతాన్ని రచించిన మహాత్ముడు, వేద వ్యాసుని శిష్యుడు. వేద వ్యాసునికి సుదూరంలో జరిగే విషయాలని చూసే దివ్య శక్తి వుంది. తన గురువుగారి కృప వలన సంజయుడికి కూడా ఆ దివ్య శక్తి ప్రాప్తించింది. అందుకే సంజయుడు దూరంనించే యుద్ధ భూమిలో జరిగేవన్నీ చూడగలుగుతున్నాడు.

ధృతరాష్ట్రుడు పలికెను: ఓ సంజయా, ధర్మభూమి అయిన కురుక్షేత్రం లో కూడియుండి, యుద్ధానికి సన్నద్ధమైన నా పుత్రులు మరియు పాండు పుత్రులు ఏమి చేసారు?

సంజయుడు పలికెను: సైనిక వ్యూహాత్మకంగా నిలిపి ఉన్న పాండవ సైన్యాన్ని చూచిన దుర్యోధనుడు తన గురువు ద్రోణాచార్యుడిని సమీపించి ఈ విధంగా పలికెను.

దుర్యోధనుడు పలికెను:  గౌరవనీయులైన గురువర్యా! మీ ప్రియ శిష్యుడు, ద్రుపద పుత్రుడిచే అత్యంత వ్యూహాత్మకంగా నిలుప బడిన ఈ పాండవుల మహా సైన్యాన్ని చూడుము.

వారి పక్షాన సైన్యంలో ఉన్న ఎంతోమంది శక్తివంతమైన యోధులను చూడండి - యుయుధానుడు, విరాటుడు మరియు ద్రుపదుడు వంటి వారు గొప్ప ధనుస్సులను ధరించి ఉన్నారు మరియు వారు భీమార్జునులతో సమానమైన వారు. అక్కడున్న పరాక్రమవంతులైన ధృష్టకేతుడు, చెకితానుడు, వీరుడైన కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు మరియు శైబ్యుడు - వీరందరూ ఉత్తమ పురుషులే. వారి సైన్యంలో ఉన్నటువంటి - ధైర్యశాలి యుధామన్యుడు, వీరుడైన ఉత్తమౌజుడు, సుభద్ర కుమారుడు, ద్రౌపది పుత్రులు - వీరందరూ యుద్ధ వీరులే.

ఓ బ్రాహ్మణోత్తమా, మన పక్షం లో ఉన్న ప్రధాన యోధుల గురించి కూడా వినుము, వీరు నాయకులుగా అత్యంత యోగ్యమైన వారు. మీ ఎరుకకై ఇప్పుడు వీరి గురించి తెలుపుచున్నాను.

మీరును, భీష్ముడు, కర్ణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు మరియు భూరిశ్రవుడు - వీరందరూ  ఎప్పటికీ యుద్ధములో విజయులే.

ఇంకా చాలా మంది వీరయోధులు నా కోసం ప్రాణాలు అర్పించటానికి సిద్దంగా వున్నారు. అనేక ఆయుధములతో  ఉన్న వీరందరూ యుద్దవిద్య లో ప్రావీణ్యం కలవారే.

మన సైనిక బలం అపరిమితమైనది మరియు మనం భీష్మ పితామహుడిచే రక్షింపబడుతున్నాము, కానీ, భీముడిచే రక్షింపబడుచున్న పాండవసైన్యం పరిమితమైనది.

కావున, కౌరవ సేనా నాయకులందరికీ, మీమీ వ్యూహాత్మక స్థానాలను పరిరక్షిస్తూ భీష్మ పితామహుడికి పూర్తి సహకారం అందించమని పిలుపునిస్తున్నాను.

అప్పుడు, కురు వంశ వృద్ద పితామహుడు, మహోన్నత మూలపురుషుడు అయిన భీష్ముడు, సింహంలా గర్జించి, తన శంఖాన్ని పెద్ద శబ్దం తో పూరించాడు; ఇది దుర్యోధనుడికి హర్షమును కలుగచేసింది.

ఆ తరువాత శంఖములు, డోళ్ళు, ఢంకాలు, భేరీలు, కొమ్ము వాద్యములు  ఒక్కసారిగా మ్రోగినవి, అవన్నీ కలిసిన శబ్దం భయానకముగా ఉండెను.

ఆ తరువాత, పాండవ సైన్యం మధ్య లోనుండి, తెల్లని గుఱ్ఱములు పూన్చి ఉన్న ఒక అద్భుతమైన రథం లో కూర్చుని ఉన్న, మాధవుడు మరియు అర్జునుడు తమ దివ్య శంఖాలని పూరించారు.

హృషీకేశుడు 'పాంచజన్యం' అనబడే శంఖాన్ని పూరించాడు. అర్జునుడు దేవదత్తాన్ని పూరించాడు. గొప్పగా భుజించే వాడు, అత్యంత కష్టమైన పనులను చేయునట్టి భీముడు 'పౌండ్రం' అనబడే బ్రహ్మాండమైన శంఖమును పూరించెను.

ఓ భూమండలాన్ని పాలించేవాడా! యుధిష్ఠిర మహారాజు అనంతవిజయాన్ని పూరించాడు. నకుల సహదేవులు, సుఘోష మణిపుష్పకములను పూరించారు. గొప్ప  విలుకాడైన  కాశీ రాజు, మహారథుడైన శిఖండి, ధృష్టద్యుమ్నుడు, విరాటుడు, అజేయుడైన సాత్యకి, ద్రుపదుడు, ద్రౌపది యొక్క ఐదుగురు కుమారులు; భుజబలము కలవాడు, సుభద్రా పుత్రుడు అయిన అభిమన్యుడు, వీరందరూ తమ తమ శంఖములను పూరించారు.

ఓ ధృతరాష్ట్రా, ఆ భీకరమైన శబ్దానికి భూమ్యాకాశములు దద్దరిల్లెను; అది మీ తనయుల హృదయాలను బ్రద్దలు చేసెను.

ఆ సమయంలో, తన రథం జెండా పై హనుమంతుని చిహ్నం కలిగివున్న పాండు పుత్రుడు అర్జునుడు, తన ధనుస్సుని తీసుకున్నాడు. సమరానికి ఎదురుగా నిలిచిఉన్న మీ పుత్రులను చూసి, ఓ రాజా, అర్జునుడు శ్రీ కృష్ణుడితో ఇలా అన్నాడు.

అర్జునుడు ఇలా అన్నాడు. అచ్యుతా (శ్రీ కృష్ణా), దయచేసి నా రథాన్ని రెండు సైన్యాల మధ్యలో నిలుపుము. ఈ మహా పోరాటంలో, రణరంగంలో నిలిచియున్న ఎవరెవరితో యుద్ధం చేయవలసి ఉన్నదో నేను పరీక్షించాలి.

దుర్బుద్ధిగల ధృతరాష్ట్రుని పుత్రున్ని సంతోషపెట్టడం కొరకు అతని పక్షాన యుద్ధానికి వచ్చియున్న అందరిని ఒకసారి నాకు చూడాలనిపిస్తున్నది.

సంజయుడు ఇలా అన్నాడు: ఓ ధృతరాష్ట్రా, ఈ విధంగా, నిద్రని జయించిన వాడైన, అర్జునుడు కోరిన విధంగా, శ్రీ కృష్ణుడు ఆ వైభవోపేతమైన రథమును రెండు సైన్యముల మధ్యకు నడిపించి నిలిపెను.

భీష్ముడు, ద్రోణాచార్యుడు మరియు ఇతర రాజుల సమక్షంలో, శ్రీ కృష్ణుడు ఇలా అన్నాడు, "ఓ పార్థా, ఇక్కడ కూడి ఉన్న కురు వంశస్థులను చూడుము".

అక్కడ అర్జునుడు రెండు సైన్యములలో కూడా ఉన్న తన తండ్రులను, తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, దాయాదులను, పుత్రులను, మనుమలను, మిత్రులను, మామలను ఇంకా శ్రేయోభిలాశులను చూచెను.

అక్కడ ఉన్న తన అందరు బంధువులని చూసిన కుంతీ పుత్రుడు అర్జునుడు, కారుణ్యం తో నిండినవాడై, తీవ్ర విచారానికి లోనై ఈ విధంగా పలికెను.

అర్జునుడు ఇలా అన్నాడు: ఓ కృష్ణా, యుద్ధానికి బారులు తీరి ఒకరినొకరు చంపుకోటానికి పూనుకుంటున్న నా బంధువులను చూసి, నా అవయవాలు పట్టు తప్పుతున్నాయి, ఇంకా నా నోరు ఎండిపోతోంది.

నా శరీరమంతా వణుకుచున్నది; వెంట్రుకలు నిక్కబొడుచుకుంటున్నాయి.  నా విల్లు, గాండీవం, చేజారి పోతున్నది ఇంకా నా చర్మమంతా తపించిపోవుచున్నది. నా మనస్సు ఏమీ తోచని స్థితిలో అయోమయంగా తిరుగుతున్నది. ఇక నన్ను నేను స్థిరంగా ఉంచుకోలేకపోతున్నాను. ఓ కృష్ణా, కేశి రాక్షసుడను సంహరించినవాడా (కేశవః), అంతటా అశుభ శకునములే కనపడుతున్నాయి. ఈ యుద్ధంలో సొంత బంధువులనే చంపుకోవటం వలన, మంచి ఎలా కలుగుతుందో నేను చూడలేకున్నాను.

ఓ కృష్ణా, నాకు విజయం కానీ, రాజ్యం కానీ, వాటివల్ల వచ్చే సుఖం కానీ అక్కరలేదు. మనం ఎవరికోసమైతే ఇదంతా కోరుకుంటున్నామో వారే మన ఎదురుగా యుద్ధం కోసం ఉన్నప్పుడు,  రాజ్యం వలన కానీ, సుఖాల వలన కానీ, ఇక ఈ జీవితం వలన కానీ ప్రయోజనం ఏముంది?

గురువులు, తండ్రులు, కొడుకులు, మేనమామలు, మనుమలు, మామలు, బావ మరుదులు ఇంకా ఇతర బంధువులు, ప్రాణాలను, ధనాన్ని పణంగా పెట్టి మరీ, ఇక్కడ చేరి వున్నారు.  ఓ మధుసూదనా, నా మీద దాడి చేసిననూ నేను వీరిని చంపను. ధృతరాష్ట్రుని పుత్రులని సంహరించి, ముల్లోకముల పై ఆధిపత్యం సాధించినా, ఏం తృప్తి ఉంటుంది మనకు, ఇక ఈ భూ-మండలము కోసమైతే ఏమి చెప్పను?

ఓ జనార్ధనా (సర్వ భూతముల సంరక్షకుడు, పోషకుడు అయినవాడా), ధృతరాష్ట్ర తనయులను చంపి మనము ఎలా సంతోషముగా ఉండగలము? వారు దుర్మార్గపు దురాక్రమణదారు లయినా, వారిని సంహరిస్తే  మనకు పాపం తప్పకుండా చుట్టుకుంటుంది. కాబట్టి ధృతరాష్ట్రుని పుత్రులను, స్నేహితులను చంపటం మనకు తగదు. ఓ మాధవా (కృష్ణా), మన సొంత వారినే చంపుకుని మనం సుఖం గా ఎలా ఉండగలము?

దురాశచే వారి ఆలోచనలు భ్రష్టు పట్టి, బంధువులను సర్వనాశనం చేయటం లో గానీ, మిత్రులపై కక్ష తీర్చుకుని విశ్వాసఘాతుకత్వం చేయటం లో గాని, వారు దోషం చూడటం లేదు. కానీ, ఓ జనార్ధనా, మనవారినే చంపటం లో ఉన్న దోషాన్ని చక్కగా చూడగలిగిన మనము, ఈ పాపపు పని నుండి ఎందుకు  తప్పుకోకూడదు?

వంశము నాశనమయినప్పుడు, వంశాచారములన్నీ లుప్తమవును; మిగిలిన కుటుంబసభ్యులు అధర్మపరులు అగుదురు.

దుర్గుణాలు ప్రబలిపోవటం వలన, ఓ కృష్ణా, కుల స్త్రీలు నీతి తప్పిన వారు అగుదురు, మరియు స్త్రీల యొక్క అనైతిక ప్రవర్తన వలన, ఓ వృష్ణి వంశస్తుడా, అవాంఛిత సంతానం జన్మిస్తారు.

అవాంఛిత సంతానం పెరగటం వలన కులమునకు, కుల నాశనము చేసిన వారికి కూడా నరకము ప్రాప్తించును. శ్రాద్ద తర్పణములు లుప్తమయిన కారణముగా ఆ భ్రష్టుపట్టిన వంశ పూర్వీకులు కూడా పతనమవుదురు.

కుటుంబ ఆచారము నాశనము చేసి, అవాంఛిత సంతానం పెంపొందటానికి కారణమైన వారి దుష్ట చేష్టల వలన అనేకానేక సామాజిక, కుటుంబ సంక్షేమ ధర్మములు నశించిపోవును.

ఓ జనార్ధనా (కృష్ణా), కులాచారములను నాశనం చేసిన వారు నిరవధికముగా నరకములోనే ఉంటారని, నేను పండితుల నుండి వినియున్నాను;

అయ్యో! ఎంత ఆశ్చర్యం, ఈ మహాపాపం చేయటానికి నిశ్చయించాము. రాజ్య సుఖములపై కాంక్ష తో మన బంధువులనే చంపటానికి సిద్దపడ్డాము. ఆయుధాలు చేతిలో ఉన్న ధృతరాష్ట్రుని పుత్రులు, ఆయుధాలు లేకుండా ప్రతిఘటించకుండా ఉన్న నన్ను యుద్ధభూమిలో చంపివేసినా, దీనికంటే మేలే.

సంజయుడు పలికెను: ఈ విధంగా పలికిన అర్జునుడు, దీనస్థితిలో, తీవ్ర శోకసంతుప్తుడై తన బాణాలను, ధనుస్సును పక్కన జారవిడిచి, రథం లో కూలబడ్డాడు.