Bhagavad Gita: Chapter 1, Verse 3

పశ్యైతాం పాండుపుత్రాణామ్ ఆచార్య మహతీం చమూమ్ ।
వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా ।। 3 ।।

పశ్య — చూడుము; ఏతాం — ఈ యొక్క; పాండు-పుత్రాణామ్ — పాండురాజు పుత్రులు; ఆచార్య — గురువర్య; మహతీం — గొప్పదైన; చమూమ్ — సైన్యము; వ్యూఢాం — సైనిక వ్యూహాత్మకంగా నిలుపబడిన; ద్రుపద-పుత్రేణ — ద్రుపదుని పుత్రుడు ధృష్టద్యుమ్నుడు; తవ శిష్యేణ — మీ శిష్యుని చేత; ధీ-మతా — తెలివైనవాడు.

Translation

BG 1.3: దుర్యోధనుడు అన్నాడు: గౌరవనీయులైన గురువర్యా! ద్రుపదుని పుత్రుడైన, ప్రతిభావంతుడైన మీ శిష్యుడిచే అత్యంత వ్యూహాత్మకంగా నిలుపబడిన ఈ పాండవుల మహా సైన్యాన్ని చూడుము.

Commentary

తన అస్త్రవిద్యా గురువు ద్రోణాచార్యుడికి గతంలో ఆయన చేసిన తప్పుని, యుక్తితో ఎత్తి చూపాడు దుర్యోధనుడు. ద్రోణాచార్యుడికి గతంలో ద్రుపద మహారాజుతో రాజకీయ వైరం ఉండేది. వైరంతో ఆగ్రహం చెందిన ద్రుపదుడు, ఒక యజ్ఞం చేసి, ద్రోణాచార్యుడిని సంహరించగలిగే పుత్రుడు కలగాలనే వరం పొందాడు. ఆ వరం ఫలితంగా ద్రుపదునికి ధృష్టద్యుమ్నుడు పుట్టాడు.

ద్రోణాచార్యుడికి ధృష్టద్యుమ్నుడి జన్మ ప్రయోజనం తెలిసినా సరే, తన వద్దకు సైనిక విద్యని అభ్యసించడానికి వచ్చినప్పుడు, పెద్ద మనసుతో, ధృష్టద్యుమ్నుడికి తనకు తెలిసిన విద్యనంతా సంకోచించకుండా బోధించాడు. ఇక ఇప్పుడు యుద్ధంలో, ధృష్టద్యుమ్నుడు, పాండవ పక్షంలో సర్వ సైన్యాధిపతిగా చేరిఉన్నాడు మరియు పాండవుల సేనా-వ్యూహాన్ని ఏర్పాటు చేసింది కూడా అతడే. ఆయన (ద్రోణుడు) గతంలో చూపిన కనికరమే ప్రస్తుత సంకటస్థితికి కారణమయిందని తన గురువుగారికి సూచిస్తూ, ఇకనైనా ద్రోణాచార్యుడు ఇంకా మరింత కనికరం చూపించకుండా పాండవులతో యుద్ధం చేయాలని సూచిస్తున్నాడు, దుర్యోధనుడు.

Watch Swamiji Explain This Verse