Bhagavad Gita: Chapter 10, Verse 12-13

అర్జున ఉవాచ ।
పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ ।
పురుషం శాశ్వతం దివ్యమాదిదేవమజం విభుమ్ ।। 12 ।। ఆహుస్త్వామృషయః సర్వే దేవర్షిర్నారదస్తథా ।
అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషి మే ।। 13 ।।

అర్జునః ఉవాచ — అర్జునుడు పలికెను; పరం — సర్వోత్కృష్ట; బ్రహ్మ — బ్రహ్మం; పరం — సర్వోత్కృష్ట; ధామ — ధామము; పవిత్రం — పవిత్రం చేసే; పరమం — సర్వోత్కృష్ట; భవాన్ — నీవు; పురుషం — పురుషుడవు; శాశ్వతం — నిత్యమైన; దివ్యం — దివ్యమైన; ఆది-దేవం — ఆది దేవుడివి; అజమ్ — జన్మ రహితుడువి; విభుం — గొప్ప/మహిమగల; ఆహుః — (వారు) ప్రకటించారు; త్వం — నీవు; ఋషయః — ఋషులు; సర్వే — అందరూ; దేవ-ఋషిః-నారదః — దేవర్షి నారదుడు; తథా — మరియు; అసితః — అసితుడు; దేవలః — దేవలుడు; వ్యాసః — వ్యాసుడు; స్వయం — స్వయముగా; చ — మరియు; ఏవ — నిజముగా; బ్రవీషీ — నీవే ప్రకటిస్తున్నావు; మే — నాకు.

Translation

BG 10.12-13: అర్జునుడు ఇలా అన్నాడు: నీవే పరబ్రహ్మము, పరంధాముడవు, సర్వోన్నతమైన పవిత్రమొనర్చే వాడివి, నిత్యసనాతన భగవంతుడివి, ఆది పురుషుడివి, జన్మ రహితుడివి, మరియు అత్యున్నతమైన వాడివి. మహర్షులైన నారదుడు, అసితుడు, దేవలుడు మరియు వ్యాసుడు వంటివారు ఇది చాటిచెప్పారు, మరియు ఇప్పుడు స్వయముగా నీవే నాకు ఈ విషయాన్ని ప్రకటిస్తున్నావు.

Commentary

వేదశాస్త్రాల పై వ్యాఖ్యానం చేసేవారు, శ్రీ కృష్ణుడు, శ్రీ రాముడు సర్వోన్నత భగవానులు కారు అని చెప్తుంటారు. సర్వోత్కృష్ట అస్తిత్వము, ఒక నిర్గుణ, నిరాకార తత్త్వమని, అదే రూపములను తీసుకుని మరియు అవతారములుగా ప్రకటితమవుతుందని, అందుకే ఈ అవతారాలు భగవంతుని నుండి ఒక మెట్టు దూరమైనవనీ చెపుతుంటారు. కానీ, అర్జునుడు ఈ అభిప్రాయాలను త్రిప్పికోడుతూ, శ్రీ కృష్ణుడే తన సాకార రూపంలో, సర్వోన్నతమైన సర్వ కారణ కారకుడు అని చెప్తున్నాడు.

ఇంతకు పూర్వపు నాలుగు శ్లోకాలు విన్న తరువాత అర్జునుడికి శ్రీ కృష్ణ భగవానుని యొక్క సర్వోన్నత స్థాయి పట్ల సంపూర్ణ నమ్మకం కలిగింది; మరియు తనలో ఇప్పుడు కలిగిన దృఢ విశ్వాసాన్ని బయటికి బలంగా వ్యక్తపరుస్తున్నాడు. ఎప్పుడైతే మాహత్ములైనవారు జ్ఞానాన్ని యదార్థమని చెప్తారో, అప్పుడు దాని యొక్క విశ్వసనీయత స్థిరపడుతుంది. మహాత్ములైన మహర్షులు ఆధ్యాత్మిక జ్ఞానంపై పూర్తి పట్టు కలవారు. అందుకే అర్జునుడు ఆ మహర్షులను పేర్కొన్నాడు - నారదుడు, అసితుడు, దేవలుడు, మరియు వ్యాసుడు వంటి వారు శ్రీ కృష్ణుడే సర్వోత్కృష్ట భగవానుడు మరియు సర్వకారణ కారకుడు అని చెప్పి ఉన్నారు. మహాభారతంలోని భీష్మ పర్వంలో ఒక పద్యం ఉంది, అందులో ఎంతో మంది శ్రీ కృష్ణుడిని స్తుతిస్తారు.

నారద మహర్షి ఇలా అంటాడు: ‘శ్రీ కృష్ణుడు సర్వ జగత్తులకి సృష్టికర్త మరియు అందరి మదిలోని భావాలను ఎరిగినవాడు. ఆయనే ఈ విశ్వమును నిర్వహించే అందరి దేవతల ప్రభువు.’ (శ్లోకం 68.2).

మార్కండేయ ముని ఇలా పేర్కొన్నాడు: ‘శ్రీ కృష్ణ భగవానుడే సమస్త యజ్ఞముల లక్ష్యం మరియు నియమనిష్ఠల సారం. ఆయనే సమస్తమునకూ భూత-వర్తమాన-భవిష్యత్తు.’ (శ్లోకం 68.3)

భృగు మహర్షి ఇలా అన్నాడు: ‘ఆయన దేవ దేవుడు మరియు విష్ణుమూర్తి యొక్క ప్రథమ మూల స్వరూపము.’ (శ్లోకం 68.4).

వేద వ్యాస ఋషి ఇలా పేర్కొన్నాడు: ‘ఓ కృష్ణా, నీవే వసువులకు ప్రభువు, నీవే ఇంద్రుడికి మరియు ఇతర దేవతలకి అధికారాన్ని/శక్తిని ప్రసాదించావు.’ (శ్లోకం 68.5).

అంగీర మహర్షి ఇలా అన్నాడు: ‘శ్రీ కృష్ణుడే సర్వ ప్రాణుల సృష్టికర్త. ముల్లోకాలు ఆయన ఉదరము యందే ఉన్నాయి. ఆయనే సర్వోత్కృష్ట భగవానుడు.’ (శ్లోకం 68.6).

మహాభారతంలోనే మరోచోట, అసిత మరియు దేవల మహర్షులు ఇలా ప్రకటించారు: ‘ముల్లోకాలను సృష్టించిన బ్రహ్మదేవుడిని సృష్టించిన వాడు శ్రీకృష్ణుడు.’ (మహాభారత వనపర్వం 12.50).

ఈ మహోన్నతమైన ప్రామాణికమైన మహాత్ములని ఊటంకిస్తూ అర్జునుడు - ఇప్పుడు శ్రీ కృష్ణుడే, తానే సర్వ కారణ కారకుడను అని చెప్పటం ద్వారా - స్వయముగా వారి మాటలను ధ్రువీకరిస్తున్నాడు అని అంటున్నాడు.